5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionఅసమాన ప్రతిభాశాలి యజ్ఞేశ్వర చింతామణి

అసమాన ప్రతిభాశాలి యజ్ఞేశ్వర చింతామణి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి. ఈ పేరు చాలా మందికి తెలియనిది. నేటి జర్నలిస్టులు గాని, రాజకీయ నాయకులు గానీ చింతామణి గురించి ఎక్కువగా విని ఉండక పోవచ్చు. ఆయన ఒక తెలుగువాడిగా పుట్టడం తెలుగు వారందరికీ గర్వ కారణం. చదువులో రాణించలేక పోయినా, ఆంగ్ల భాషలలో విశ్వవిద్యాలయ పట్టా లేకున్నా, పుట్టిన గడ్డను వదిలి, నిండా 18ఏళ్లు నిండకుండానే, ఒక ఆంగ్ల పత్రిక కు సంపాదకుడుగా కాగలిగి, దాదాపు మూడు దశాబ్దాల కాలం అదీ ఇంగ్లీషు వారి పరిపాలనా సమయంలో ముఖ్య సంపాదకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అసమాన ప్రతిభాశాలి చింతామణి.

చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి 1880 – 1941) పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయులు, ఉదారవాద రాజకీయ నాయకులు. అలహాబాదు నుండి వెలువడిన లీడర్ అనే ఆంగ్ల పత్రికకు 1909 నుండి 1934 వరకు మూడు దశాబ్దాలపాటు సంపాదకత్వం వహించారు. ఈయన ఇండియన్ హెరాల్డ్, స్టాండర్డ్ పత్రికలను కూడా వ్యవస్థీకరించారు.

1880 ఏప్రిల్ 10న తెలుగు నూతన సంవత్సరాది నాడు చింతామణి జన్మించారు. విజయనగరం ఆస్థానంలో రాజపురోహితులు. ఆయన తండ్రి చిర్రావూరు రామసోమయాజులు, వేదపండితుడు, విజయనగరం సంస్థానంలో మహారాజా విజయరామ గజపతిరాజుకు రాజగురువు. తాతలు, తండ్రుల లానే చింతామణి కూడా పురోహితులు అవుతారని అందరూ అనుకున్నారు. యజ్ఞేశ్వర చింతామణికి 10 యేటనే వివాహమైనది. చింతామణి అనారోగ్యం వల్ల, మాతృవియోగం వల్ల ఎఫ్.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేక పోయారు.
అయితే, యువరాజా సూచనతో, విజయనగరం మహారాజా కాలేజ్‌లో ఇంగ్లీషు చదువు కోసం వెళ్ళినా, చింతామణి విశాఖలో స్థానిక రాజకీయ వ్యక్తులతో తిరగటం ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల నుండి పట్టాలు పొందలేక పోయాయినా, అసమానమైన ఆంగ్లభాషా పాండిత్యాన్ని సంపాదించారు. చదువుకొనే రోజుల్లోనే పత్రికలకు వ్యాసాలు రాశారు చింతామణి. స్వయంకృషితో పట్టు సాధించి, అనేక సభలలో ఉపన్యాసాలను ఇచ్చేవారు.

పత్రికా రచనపై ఆయనకు ఆసక్తి మెండుగా ఉండేది. ప్రారంభ దశలో “తెలుగు హార్స్” అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ఈయన వ్రాసే వ్యాసాలు వైజాగ్ స్పెక్టేటర్ పత్రికలో అచ్చు అవటం ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలానికే 18 యేళ్ల వయసులోనే వైజాగ్ స్పేక్టేటర్ పత్రికకు సంపాదకత్వం వహించే అవకాశం లభించింది. అప్పట్లో 30 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ తరువాత చింతామణి ఆ పత్రికను 300 రూపాయలకు కొని, తనతో పాటు వైజాగ్ స్పెక్టేటర్ పత్రికను విజయనగరానికి తీసుకొచ్చారు. తర్వాత ఆ వారపత్రికకు “ఇండియన్ హెరాల్డ్” అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చింతామణీ “నేను కేవలం సంపాదకుడినే కాదు, ఫోర్మెన్, ప్రూఫ్ రీడర్, విలేఖరి, ఉపసంపాదకుడు, యజమాని అన్నీ నేనే” అని వివరించారు. పత్రిక బాగా ప్రాచుర్యం పొందినా ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండు సంవత్సరాలలో దాన్ని మూసివేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే చింతామణి భార్య మృతి చెందగా, మద్రాసుకు మకాం మార్చి, కొంతకాలం యునైటెడ్ ఇండియా అనే వారపత్రికలోను, ఆ తర్వాత జి. సుబ్రమణ్యం అయ్యర్ సంపాదకత్వంలో వెలువడుతున్న “మద్రాస్ స్టాండర్డ్” దినపత్రికలో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. 1903లో నాగేంద్రనాథ్ గుప్తా ప్రారంభించిన “ఇండియన్ పీపుల్” పత్రికకు సంపాదకత్వం వహించడానికి అలహాబాదు మకాం మార్చారు. 1909 అక్టోబరులో మదన్ మోహన్ మాలవ్యా, తేజ్ బహద్దర్ సప్రూ వంటి మితవాద కాంగ్రెస్ నాయకులు “లీడర్” అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించారు. “ఇండియన్ పీపుల్” పత్రిక “లీడర్” పత్రికలో కలిసిపోయింది. చింతామణి లీడర్ పత్రిక సంపాదకత్వ బాధ్యతను స్వీకరించారు. చింతామణి నిష్పక్షపాతమైన విమర్శకుడిగా పేరు గడించారు. ఈ పత్రికలోని సంపాదకీయాలు ఇతడికి మంచి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెట్టగా, 1916 వరకు లీడర్ పత్రికా సంపాదకుడిగా ఉన్నారు. 1927నుండి మళ్లీ లీడర్ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు.

పత్రికా రంగంతో పాటు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. 20 సంవత్సరాలు కూడా నిండని వయసులో 1900 సంవత్సరం చివరలో లాహోరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యేందుకు ప్రయాణ ఖర్చులకు డబ్బు లేకపోతే అప్పు చేసి వెళ్లారు. ఆ సమావేశాలలో అనేక విషయాలపై ఆయన చేసిన గంభీరమైన ఉపన్యాసాలు. సురేంద్రనాథ్ బెనర్జీ, భూపేంద్రనాథ్ బోస్ వంటి కాంగ్రెస్ నాయకుల ప్రశంసా పాత్రాలు అయినాయి. “హిందూ” పత్రిక ఆ ఉపన్యాసాలను ప్రశంసించింది. 1916లో తిరిగి 1927లోనూ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనారు.1921-23 మధ్య అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ (నేటి ఉత్తర ప్రదేశ్) కు విద్య, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. 1930-31లో లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతినిధిగా హాజరైనారు.

కాంగ్రెస్ వాదిగా రాజకీయాలలో పాల్గొని, గాంధీ సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలతో విభేదించి, మితవాదిగా పంథా మార్చు కున్నారు. అయినా గాంధీ, నెహ్రూతో సహా నాటి నేతలంతా చింతామణిని అభిమానించేవారు.

బ్రిటీషు ప్రభుత్వం ఆయనకు 1939లో సర్ బిరుదునిచ్చి సత్కరించింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు (ఎల్.ఎల్.డి)ప్రదానం చేసింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం డి.లిట్. గౌరవ పట్టాను ఇచ్చింది.

తెలుగు తేజాన్ని, రాజకీయ పరిజ్ఞానాన్ని భారతదేశ మంతటా చాటిన చింతామణి 1941, జూలై 1 న తన 62వ యేట మరణించారు.
మరణించిన దినాన సైతం ఆయన స్వీయ సంపాదకీయం రాయడం గమనార్హం.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments