5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalయాగంటి

యాగంటి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

యాగంటి(Yaganti) బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది వినే వుంటారు.
కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం వుంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు.. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వుంటాడని కూడా తెలుసు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకె వేయడం కూడా ఒకటి అని తెలుసు. అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’.

యాగంటి(Yaganti) క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై వుంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్దపెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు, ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ వుంటాయి. ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లు వుంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది.

మొదట యాగంటిలో వేంకటేశ్వర స్వామిని ప్రతిష్టించాలని అనుకున్నారన్న కథనం ఒకటి ప్రచారంలో వుంది. ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చెక్కారట. అయితే విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్ఠార్హత లేదని భావించారట. ఆ ప్రాంతంలో స్వయంభూవుగా వెలసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారట. అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందట. అలాగే మరో కథనం కూడా ప్రచారంలో వుంది. తిరుమల వేంకటేశ్వరాలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట. అయితే విగ్రహం కాలిని చెక్కడంలో లోపం ఏర్పడటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట. ఇప్పటికీ ఆ వేంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ వుండటం విశేషం.

అగస్త్యపుష్కరిణి

యాగంటి ఉమామహేశ్వరాలయంలో వున్న పుష్కరిణికి ‘అగస్త్య పుష్కరిణి’ అనే పేరు వుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో వుండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని చెబుతారు.
పర్వతం మీద వున్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడ్డానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వుంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో వున్న ఉమా మహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే వుండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తూ వుంటారు.

కాకులుకనిపించవు

ఆంధ్రప్రదేశ్‌లో కోటప్పకొండ లాంటి శైవ క్షేత్రాల్లో కాకులు కనిపించవు. యాగంటి క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ఇక్కడ ప్రచారంలో వుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్య ముని సంకల్పిస్తే, విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది. అగస్త్యుడి ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ, కారణాంతరాన్ని అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట. అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించడంలో ఆయన ఆగ్రహించారట. ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట. ఈ కారణం వల్లే ఇక్కడ కాకులు కనిపించవని అంటారు.

యాగంటి (Yaganti)కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో వుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం వుంటుంది. అందువల్ల కర్నూలు, నంద్యాల, బనగానపల్లిలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్ళవలసి వుంటుంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments