Monday, August 15, 2022
HomeLifestylespecial Editionప్రపంచ పిచ్చుకల దినోత్సవం

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం


పిచ్చుకలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఏటా మార్చి 20వ తేదీని పిచ్చుకల సంరక్షణ దినంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపు కుంటున్నారు. మొట్టమొదటి ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని 2010లో పాటించారు. అంతర్జాతీయంగా పిచ్చుకల సంరక్షణ కోసం ఈ దినోత్సవాన్ని నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా.. ఫ్రాన్స్‌కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్, ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అంతరించి పోతున్న సహజ జీవవైవిధ్యం, జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తించి, వాటిని కాపాడు కోవడానికి ప్రజలను ఏకం చేయడమే ఈ పిచ్చుకల దినోత్సవ ముఖ్యోద్దేశం.

ఒకప్పుడు సూర్యోదయానికి పూర్వమే, ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తూ, గూళ్ళల్లో నుండి బయటకు వచ్చి, కళ్లు తెరవగానే కనిపించే ముద్దులొలికే పిట్టల కిచకిచల ద్వనులు నేడు కరువయ్యాయి. పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాల లోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు, ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి.

జీవన శైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’గా పరిణమించింది. పిచ్చుక జాతి అంతరించనుంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి. పిచ్చుకలు అంతరించి పోవడానికి కారణాలు.

ఒకప్పుడు చైనాలో పిచ్చుకలంటే చీడ పురుగులుగా భావించే వారట. పంటలను నాశనం చేస్తున్నాయని, ఆహార ధాన్యాలను అధికంగా తినేస్తున్నాయనే అపోహతో చైనాలో పిచ్చుకల జాతిని నాశనం చేయడానికి నడుం బిగించి, తగిన చర్యలు తీసుకున్నారట. ఫలితంగా చైనాలో అతి తక్కువ సమయంలో పిచ్చుకలు మొత్తం నశించాయట.

వాస్తవానికి పిచ్చుకల ఆహారం పంట పొలాలపై దాడి చేసే చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు. ఈ సంగతి గ్రహించని చైనీయులు వాటిని వినాశాన్ని కోరుకున్నారు. పిచ్చుకలు లేని కారణంగా పంటలకు మరింతగా పురుగుపట్టి 1958-61 మధ్య కాలంలో చైనా తీవ్రమైన ఆహార కొరతను అనుభవించిందట. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచిందని చెపుతుంటారు.

గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లల్లో విరివిగా వుండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కొరకు వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరుకు వేలాడ దీసే వారు. రైతులు జొన్న, సజ్జ తదితర సంప్రదాయ పంటలను సాగు చేస్తుండేవారు. వాటిని తిని పక్షులు జీవించేవి. అయితే ప్రస్తుతం పత్తి తరహా వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపిస్తుడడంతో పిచ్చుకలకు ఆహారం కరువైంది. ప్రస్తుతం పంటలు లేక ఆహారం కరువై, పూరిళ్ళ స్థానంలో సిమెంట్ గృహాలు, ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో అవి కనబడడం లేదు. పిచ్చుకలో ఇంచుమించు 35 జాతులు ఉంటే, అవి కాలక్రమేణ కనుమరుగు అవుతున్నాయి.

పిచ్చుకల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదాల నివారణకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవమును నిర్వహిస్తున్నాయి. అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి.
పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా ఈ బిళ్లను కూడా విడుదల చేసింది.


పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకు నేందుకు అందరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పల్లెల్లో నివసించే వారు ఊరపిచ్చుకల గూళ్లు కనబడితే వాటిని జాగ్రత్తగా సంరక్షించు కోవాలి.

కృత్రిమమైన పిచ్చుకగూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించ వచ్చని శాస్త్రవేత్తల సలహా. పిచ్చుకల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఎన్ఎఫ్ఎస్ సంస్థ పిచ్చుకల అవార్డులను కూడా అంద జేస్తున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments