సినిమాలు, టి.వి.లు లేని రోజుల్లో వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసి పోయిన పల్లె ప్రజలకు జానపదుల ప్రదర్శనలు సేదతీర్చేవి. గ్రామాల్లో జానపద కళాకారులు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చేవారు. ముందు తరాలవి శ్రమైక జీవన విధానం. కష్టజీవులే ఎక్కువ మంది. రోజంతా కాయకష్టం చేసి ఇళ్లకు చేరిన వారి అలసట తీర్చి వారికి సాంత్వన చేకూర్చే కళా రూపాలే జనపదాలు. అలాంటి వాటిలో తోలు బొమ్మలాట ప్రధాన మైనది.
తోలు బొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించు కున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవ నిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడం లోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది. సుసంపన్న మైన హిందూ ఇతిహాసాలను తెర మీదకి తెచ్చిన ఒక గొప్ప ప్రక్రియ తోలు బొమ్మలాట.
ఒక సామూహిక సంగీత, నాట్య ప్రదర్శన కళారూపమైన తోలు బొమ్మలాట, జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళారూపాన్ని గుర్తించ వచ్చు.
పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలు బొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు. ఈ విధంగా తోలు బొమ్మలాట పుట్టిందని, ఈ ఆట పండితుల చేత మెరుగులు దిద్దుకున్నదని, చెప్పడానికి అమర కోశం లోని శ్లోకాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు.
మహా భారతంలో తోలు బొమ్మలాట ప్రస్తావన ఉంది. భగవద్గీతలో సత్త్వ, తమో, రజో గుణాలు మూడు దారాలని, అవి పరమాత్ముని చేత మానవ జీవన గమనంలో లాగబడు తుంటాయని చెప్పబడింది. మానవుడు బొమ్మ అయితే అతనికున్న సూత్రాలు ఈ మూడు గుణాలు. ఆడించేవాడు జగన్నాటక సూత్రధారి అన్న అర్థంలో ఉన్న ఈ భాగం తోలు బొమ్మలాటలకు సంబంధించిన ప్రస్తావన.
భారతీయ జానపద ప్రదర్శన కళల్లో అతి ప్రాచీనమైన దృశ్య రూపకానికి చెందినది తోలు బొమ్మలాట. క్రీ.పూ 3 వ శతాబ్దం నాటికే తెలుగు దేశంలో తోలు బొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.
చరిత్రకారుల ప్రకారం తోలు బొమ్మలు క్రీ.పూ 2500 సం.నకు పూర్వం, పురాతన నాగరికత అయిన హరప్పా, మొహంజోదారో కొన్ని వేల కిలోమీటర్ల వరకూ వ్యాపించినట్లు చెపుతారు. క్రీ.పూ 3 వ శతాబ్ధానికి చెందిన అశోకుని శిలా శాసనాల్లో జంబూ ద్వీపానికి బొమ్మలాట ప్రదర్శన రంగంగా ఆపాదించారు. పతంజలి మహాభాష్యంలో తన కాలపు వినోద సాధనాలను వివరిస్తూ మూడు ప్రధానమైన వాహికలను వివరిస్తూ వాటిలో బొమ్మలాట ఒక ప్రధనమైన వాహిక అని వివరించారు.
తేరి గాథ అను బౌద్ధ గ్రంథంలో బొమ్మలాటకు సంబంధించిన ప్రస్తావన ఉంది. వాత్సాయనుని కామసూత్రాల్లో బొమ్మలలోని రకాలు, బొమ్మలాటల్లోని తేడాలు చర్చింప బడినాయి. కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదర్శన అవసరమని వాత్సాయనుని వివరణ. నాటకానికి, తరువాత పరోక్షంగా తోలుబొమ్మలాట సినిమాకు మూలమైంది.
కదలికలోని ఆనందం కనుక్కున్న మనిషి ఆలోచనలో నుండి పుట్టిందే బొమ్మలాట. స్థిరత్వం నుండి చలనం వైపుకు పయనించడంలో భాగంగా ప్రాచీన మానవుడు బొమ్మలాటను సృష్టించు కున్నాడు. కథ చెప్పడం మొదలైన తరువాత ఆ కథలోని పాత్రలు తెరమీద కనిపిస్తే, నటిస్తే చూడాలన్న జనపదుడి తపనలో నుండి బొమ్మలాట పుట్టింది. బొమ్మలతో ఆడుకోవడం అతి ప్రాచీన కళ. కొయ్యబొమ్మ లాటలు, కట్టెబొమ్మ లాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మ లాటలు, బుట్టబొమ్మ లాటలు, తోలుబొమ్మ లాటలు అని బొమ్మలాటలు అనేకము ఉన్నాయి.
రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెర భూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించే టప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డు తగలకుండా ఉంటుంది. తోలు బొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు.
ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలిన వారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగం తీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు.
తోలు బొమ్మలాటలో సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి, పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢ నమ్మకాలను ఎండగడతారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపు కథలు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిళ్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. తోలు బొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతం లకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి. లంకా దహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణ వధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తర గోగ్రహణం వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. పర్షియా, టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడినుండి ఫ్రాన్స్ లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. తోలు బొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెపుతారు.
తోలుబొమ్మల ఆటలు క్రమేపీ కనుమరుగు కాక తప్పని స్థితి నెలకొంది. తోలు బొమ్మల కళారూపం అంతరించి పోవడానికి గల కారణం నాటకాల ప్రభావం ఉధృతంగా ఉండడం, పద్యనాటకాల ప్రాధాన్యత పెరగడం, నాటకాలలో శాస్త్రీయతకు, సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్నతస్థానం లభించడం, సినిమాలు ప్రజలను సమ్మోహితులను చేయడం, తెరపై ప్రేక్షకులకు కావలసినవి అందించడం, అదేవిధంగా ఇంట్లోనే జనరంజకం అన్న నేపథ్యంలో విస్తృతంగా ఛానల్స్ వచ్చి ప్రపంచ తీరు తెన్నులను మార్చడం వంటి ఎన్నో కారణాలు తోలుబొమ్మలు లాంటి కళారూపాల మనుగడకు సవాలుగా నిలిచాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో, మన ప్రాచీన కళా రూపాల ఆనవాళ్ళు అని చెప్పడానికి వాటిని బ్రతికించు కోవలసిన అవసరం ఎంతైనా అవసరం.
ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES