కాలేయం మెదడు తరువాత శరీరంలో రెండో అతిపెద్ద, రెండో అత్యంత క్లిష్టమైన అవయవం. కాలేయం జీవక్రియలను, జీర్ణవ్యవస్థను నియంత్రించుటలో, శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగించుటలో ఎంతగానో సహాయం చేస్తుంది. రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియ, జీవక్రియ, గ్రహించిన పోషకాల నిల్వ, విసర్జనకు సంబంధించిన కీలకమైన విధులను నిర్వహించడానికి ఇది బాధ్యత వహిస్తుంది.
ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతి ఏటా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడం, హెపటైటిస్ నిర్మూలించేలా ప్రపంచం నలుమూలల ఉన్న ప్రజలను ప్రోత్సహించడం, అలాగే హెపటైటిస్ తో బాధపడుతున్న లక్షలాది మందిని గుర్తించే లక్ష్యంతో ఈ రోజును ఏర్పాటు చేశారు.
హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరుప బడుతుంది. ప్రతి సంవత్సరం 100కి పైగా దేశాలలో ప్రదర్శనలు, ప్రచారాలు, కచేరీలు, టాక్ షోలు, ఫ్లాష్ మాబ్స్, టీకా డ్రైవ్‌లు వంటి కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి.
2004, అక్టోబరు 1న యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్ పేషెంట్ గ్రూప్స్, బేబీ మురియెల్ సమన్వయంతో అంతర్జాతీయ హెపటైటిస్ సి అవగాహన దినోత్సవం జరిగింది. వేరువేరు సమూహాలు వేర్వేరు తేదీలలో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ కారణంగా 2008లో వివిధ ప్రాంతాలలోని రోగుల సమూహాల సహకారంతో ప్రపంచ హెపటైటిస్ అలయన్స్ సంస్థ మే 19ను మొదటి ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించింది.
కాలేయ వ్యాధి దినోత్సవం నిర్వహించాలన్న ఆలోచన కటక్ లో వచ్చింది. హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కటక్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ ప్రతిపాదించాడు. 2010, మే నెలలో జరిగిన 63వ ప్రపంచ ఆరోగ్య సభలో ఈ ప్రతిపాదన ఆమోదించబడి, జూలై 28న పంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించ బడింది.
కాలేయ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రజలపై ప్రభావితం చూపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత వల్ల దీర్ఘకాలిక వ్యాధికి గురై ప్రతి సంవత్సరం 1.34 మిలియన్ల మంది చనిపోతున్నారు. బాధితుల్లో 12.22 శాతం మంది 30 ఏళ్లలోపు వారుంటే… 40 ఏళ్లలోపు వారు 25.8 శాతం, 50 ఏళ్లలోపు వారు 28.10 శాతం, 60 ఏళ్లలోపు వారు 21.74 శాతం ఉండడం గమనార్హం.
సాధారణంగా మద్యం, మాంసం, ఆయిల్ ఫుడ్ అతిగా తీసుకునేవారే ఎక్కువగా కాలేయ జబ్బుల బారిన పడుతుంటారు. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే కనీస/తక్కువ బరువుతో ఉన్నవారు… ఎలాంటి దురలవాట్లు లేనివారు సైతం ప్రస్తుతం ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నారు. ఇలా ప్రతి 10 మందిలో ఐదారుగురు ఈ సమస్యతో బాధ పడుతుండడం ఆందోళన కలిగించే అంశం.
మద్యపానం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం మొదలైన వాటితో సహా జన్యు లేదా జీవనశైలి కారకాలు కాలేయానికి హాని కలిగిస్తాయి.
కాలేయ మార్పిడి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అవసరమైన వారికి తమ కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చినా… వయసు, బ్లడ్‌గ్రూప్ మ్యాచింగ్ కావడం లేదు. ఒకవేళ మ్యాచ్ అయినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా లైవ్ డోనర్ సర్జరీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో చికిత్సలు జరగడం లేదు.
నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలలో ఎక్కువ శాతం కృత్రిమ క్రొవ్వులు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి, ఇవి ఆరోగ్యo పై పెను ప్రభావాన్ని చూపించ గలవు. ఊబకాయం, అస్తవ్యస్త జీవ క్రియలు, జీర్ణాశయ పని తీరు మందగింపు, మూత్రాశయ సంబంధిత సమస్యలు, రక్తంలో గ్లూకోజ్ స్తాయిలు హెచ్చు మీరడం, రక్త పోటు, హృదయ సంబంధిత వ్యాధులు మొదలైన వాటికి కారణo అవుతుంటాయి. ఉప్పు అధికంగా తీసుకోవడం కాలేయ కణాలకు కూడా అసౌకర్యాన్ని కలిగించి ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన , నిల్వ ఉంచిన ఆహార పదార్ధాల కారణంగా శరీరంలో అధిక క్రొవ్వులు పేర్కొని పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. మాంసంలో ఉండే అధిక ప్రోటీన్, అధిక క్రొవ్వులు కాలేయానికి తీవ్రమైన ప్రభావాలను ఇస్తుంటాయి. సాఫ్ట్ డ్రింక్స్ లో ఎక్కువ మోతాదులో కృత్రిమ చక్కెరలు, కార్బోనేటెడ్ మిశ్రమాలతో నిండి ఉంటుంది. అనగా కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఈ కృత్రిమ చక్కెరలు, మరియు కార్బన్ డై ఆక్సైడ్ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. ముఖ్యంగా వీటి ప్రభావం కాలేయం మీద ఖచ్చితంగా ఉంటుంది.
నోటిద్వారా తీసుకున్న ఏ ఆహారమైనా అది ఖచ్చితంగా కాలేయానికి ఏదో ఒకరూపంలో చేరుతుంది. కావున తీసుకునే ఆహార ప్రణాళికలో భాగంగా తృణ ధాన్యాలు, ప్రోటీన్లు, పాల పదార్ధాలు, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకర క్రొవ్వు పదార్ధాలు ఉండేలా చూసుకోవడం ద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవచ్చు.
