5.1 C
New York
Sunday, May 28, 2023
Homespecial Editionఅటవీ సంరక్షణ సామాజిక బాధ్యత

అటవీ సంరక్షణ సామాజిక బాధ్యత

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21 న నిర్వహించ బడుతుంది. 2012 లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించినప్పటి నుండి, ప్రపంచ దేశాలు అన్ని రకాల చెట్లు అడవుల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2012, నవంబరు 28న యునెస్కో వారిచే తీర్మానించబడిన ప్రపంచ అటవీ దినోత్సవం, 2013 మార్చి 21న తొలిసారిగా నిర్వహించ బడింది. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు పర్యావరణ అభివృద్దికి అడవులు ఎంతో అవసరమని తెల్పడం ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుత, ముందు తరాల వారికి అడవుల ప్రాముఖ్యత, ప్రయోజనాలను తెలియ జేయడం కోసం ఈ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

మానవాళి మనుగడకు అడవులు సోపానాలు. మన జీవావరణ సంపదలు. ఇవి అనేక జీవరాసులకు ఆవాసాలు. పర్యావరణ సమతుల్యానికి పట్టు కొమ్మలు. నదీనదాలకు వర్షాధారాలు. అడవులు మూలికా ఔషధాలకు నిలయాలు. జీవకోటికి ప్రాణ వాయువును అందించడం లోనూ, భూమి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించడం లోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వృక్షో రక్షిత రక్షితః అన్నారు. వృక్షాలను మనం రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి.

అడవులలో పలు రకాలు ఉన్నాయి…
రిజర్వు అడవులు: ఇవి ప్రభుత్వం పరిరక్షణలో వుంటాయి. మానవుల, పశువుల సంచారానికి మరియు కలప కొరకు చెట్లును నరకడం ఈ అడవులలో నిషేధం. భారత దేశంలో ఈ అడవులు 40.1 మిలియన్ హెక్టార్లు అనగా 53% వరకు విస్తరించి వున్నాయి.
రక్షిత అడవులు: ఇవి ప్రభుత్వం పరిరక్షణలో వున్నప్పటికీ మానవులు, పశువులు సంచారానికి అనుమతి వుంది. అయితే ఈ అడవులకు ఎటువంటి నష్టాన్ని కలుగ చేయకూడదు. భారత దేశంలో ఈ అడవులు 21.5 మిలియన్ హెక్టార్లు అనగా 29% వరకు విస్తరించి వున్నాయి.
కేటాయించని అడవులు: ఇవి చెట్లు నరకడానికి, మరియు పశువుల సంచారానికి ఎటువంటి నియమ నిర్బంధాలు లేవు. భారత దేశంలో ఈ అడవులు 13.1 మిలియన్ హెక్టార్లు అనగా 18% మేరకు విస్తరించి వున్నాయి.

అడవులు ప్రపంచంలో 4.057 మిలియన్ హెక్టార్ల భూభాగంలో విస్తరించి వున్నాయి. ప్రపంచ అటవీ విస్తీర్ణత లో భారత దేశంలో అటవీ విస్తీర్ణత 1.85% వుంది. అంటే 2% కూడా లేదు. తలసరి అటవీ విస్తీర్ణత 0.05 హెక్టార్లు మాత్రమే వుంది.
2003 ఇండియన్ సెట్ ఫారెస్టు రిపోర్టు ప్రకారం 69.79 మిలియన్ హెక్టార్ల అడవులు భారత దేశ భూభాగంలో విస్తరించి వున్నాయి. ఇది దేశ భౌగోళిక విస్తరణలో 21.23%గా వుంది. ఈ నివేదిక 2013 ప్రకారం అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 34.572 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్ర భూభాగంలో 22.64% కలిగి వున్నాయి. దేశ అటవీ విస్తీర్ణత ప్రకారం ఆంధ్ర రాష్ట్రం 9వ స్ధానాన్ని కలిగి వుంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో 29.242 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉండేవి. రాష్ట్ర భూభాగంలో 25.46% మేరకు విస్తరించి ఉండేవి. కానీ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత ఖమ్మం జిల్లాలోని 327 ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల రాష్ర్ట అడవుల విస్తీర్ణం 26,903.70 చ.కి.మీ.కు తగ్గింది. ఇది రాష్ర్ట వైశాల్యంలో 23.99 శాతం.
దేశ అటవీ విస్తీర్ణతలో 4.22% వరకు విస్తరించి, తెలంగాణ 12వ స్ధానాన్ని కలిగి వుంది. ఈ సర్వే ప్రకారం భారత దేశంలో అడవులు ఎక్కువగా వున్న రాష్ట్రలలో మధ్య ప్రదేశ్ మెుదటి స్ధానాన్ని రెండవ స్ధానాన్ని అరుణాచల ప్రదేశ్ మూడవ స్థానాన్ని ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు వరుస స్థానాల్లో వున్నాయి. అత్యధిక అడవులు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో మెుదటి స్ధానంలో నికోబార్ రెండవ స్థానంలో దాద్రా నగర్ హవేలి వున్నాయి. భారత దేశంలో అత్యధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు మిజోరం మెుదటి స్ధానంలో అరుణాచల ప్రదేశ్ రెండవ స్థానంలో వున్నాయి. దేశంలో అత్య అల్ప శాతం అడవులు కలిగిన రాష్ట్రలు వరుసగా హర్యానా మెుదటి స్ధానంలో పంజాబ్ రెండో స్థానంలో బీహార్ మూడో స్థానంలో వున్నాయి. అత్యఅల్ప శాతం అడవులు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు వరుసగా పుదుచ్చేరి మెుదటి స్ధానంలో ఢిల్లీ రెండవ స్థానంలో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షా డబ్బై వేల ఎకరాల అడవులు అంతరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చెట్లును నరికివేసి వాటి నుంచి వచ్చే కలపను ఇంధనంగా వాడటం, పశువుల పచ్చిక బయళ్ళుగా మార్చడం, వంట చెరకు, గృహ నిర్మాణాలు, గృహోపకరణాలకు ఉపయో గించడం, పెరుగుతున్న ప్రపంచ జనాభా అవసరాలను తీర్చడానికి జనావాసాలుగా మార్చడం వంటి చర్యలను అటవీ నిర్మూలనకు కారణాలు. అలాగే అడవుల్లో సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలతో విలువైన జాతుల అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. భారీ వృక్షాలు, అడవి జంతువులతో పాటు ఆయుర్వేద గుణాలున్న విలువైన మూలికా వృక్షాలు, మొక్కలకు చేటు కలుగుతోంది. సమస్త జీవకోటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడవులే ఆధారం. అయితే, ప్రస్తుతం అంతరించి పోతున్న అడవులు జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయి. ఒకవైపు అక్రమార్కుల చేతిలో పడి అడవులు చిక్కిపోతుంటే, మరోవైపు మానవ తప్పిదాలు అటవీ సంపదకు చేటు చేస్తున్నాయి. వేసవిలో ఏటా అగ్ని ప్రమాదాలకు వృక్ష సంపద ఆహుతవుతోంది. పెరుగుతున్న జనాభా తమ అవ సరాలకు మించి అడవులను నరికివేస్తున్న వైనం. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగి జల, వాయు కాలుష్యాలు అధికమై సమస్త జీవరాసుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో భూమి కోతకు గురవుతుంది. బంజరు భూమిగా రూపాంతరం చెందుతుంది.

వైల్డ్‌ లైఫ్‌ యాక్ట్‌ ప్రకారం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి. ప్రస్తుతం 24.12 శాతం మాత్రమే ఉన్నాయి. ఇది చాలా విచారించదగ్గ విషయం. అంతరించి పోతున్న వాటిని కాపాడు కోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. అడవుల రక్షణ బాధ్యత అందరిది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments