Wednesday, August 10, 2022
HomeLifestyleLife styleప్రాథమిక హక్కుల పట్ల అవగాహన అవసరం

ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన అవసరం

ప్రతి సంవత్సరం మార్చి మొదటి తేదీన, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1990లో, ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ (ICDO) ఈ రోజును ప్రపంచ పౌర రక్షణ దినంగా ప్రకటించింది. ఐసిడిఒ అనేది ఒక లాభాపేక్ష లేని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. పౌర హక్కుల పరిరక్షణ, సౌకర్యాల కల్పన, ప్రజల ఎదుగుదల, సురక్షితంగా ఉండటానికి సహాయ పడుతుంది. 59 దేశాలు ఐసిడిఒ లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇది ఆయా దేశాలలోని పౌర రక్షణ దళాల మానవ వనరుల నిర్వహణను మెరుగు పరచడానికి అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

అన్ని దేశాలు, ప్రజలందరికీ ఆదర్శ నీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా పత్రాన్ని నిర్దేశిస్తూ
1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్య రాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించి, ప్రపంచ మంతటా పరిరక్షించు కోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా నిర్దేశించింది. ఈ సందర్భంగా హక్కుల విషయంలో ఏ ఆర్టికల్ ఏమి సూచిస్తుంది అనే విషయం తెలుసు కుందాం.

ఆర్టికల్ 1: మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. గౌరవం, హక్కుల విషయంలో అందరూ సమానులే. మనుషులందరికీ సొంత ఆలోచన, అంతః చేతన ఉంటాయి. ఒకరితో మరొకరు సోదరభావంతో మెలగాలి. ఆర్టికల్ 2: ఈ పత్రంలోని అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జాతి, రంగు, లింగం, భాష, మతం లాంటి అంశాల ప్రాతిపదికగాగాని, రాజకీయ నేపథ్యం వల్లగాని, భిన్నాభిప్రాయం వల్లగాని, జాతీయ లేదా సామాజిక మూలాలవల్లగాని, సంపదలో వ్యత్యాసాల వల్లగాని, పుట్టుక లేదా ఇతర ప్రాతిపదికల వల్లగాని వివక్ష చూపడానికి వీల్లేదు.
వ్యక్తులను వారి దేశం లేదా భూభాగం రాజకీయ/అంతర్జాతీయ హోదా ఏమిటనేదాని ప్రాతిపదికగా ఎలాంటి వివక్షా చూపరాదు.
ఆర్టికల్ 3: జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వీయ భద్రతా హక్కు ప్రతి మనిషికీ ఉంటాయి.
ఆర్టికల్ 4: ఎవ్వరినీ బానిసగా చేసుకోవడానికి వీల్లేదు. బానిసత్వాన్ని, బానిస వ్యాపారాన్ని అన్ని రూపాల్లో నిషేధించాలి.
ఆర్టికల్ 5: ఎవ్వరినీ చిత్రహింసలకు గురిచేయరాదు. ఎవ్వరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమాన కరమైన శిక్షకు గురిచేయరాదు.
ఆర్టికల్ 6: ప్రతి చోట చట్టం ముందు వ్యక్తిగా గుర్తింపు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
ఆర్టికల్ 7: చట్టం ముందు అందరూ సమానులే. ఎలాంటి వివక్షా లేకుండా చట్టపరమైన రక్షణ పొందే హక్కు అందరికీ ఉంది. ఈ డిక్లరేషన్‌కు విరుద్ధంగా, ఎలాంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమానమైన రక్షణ ఉంటుంది.
ఆర్టికల్ 8: రాజ్యాంగం, లేదా చట్టం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే చర్యల విషయంలో సంబంధిత జాతీయ ట్రైబ్యునల్ నుంచి పరిష్కారం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
ఆర్టికల్ 9: ఎవ్వరినీ ఏకపక్షంగా అరెస్టు చేయడానికిగాని, నిర్బంధించడానికిగాని, ప్రవాసానికి పంపించడానికిగాని వీల్లేదు.
ఆర్టికల్ 10: క్రిమినల్ నేరాభియోగాలపైగాని, తన హక్కులను, బాధ్యతలను నిర్ణయించే విషయంలోగాని స్వతంత్ర, నిష్పాక్షిక ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో నిష్పాక్షిక, బహిరంగ విచారణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంది.
ఆర్టికల్ 11: (1) శిక్షార్హమైన నేరాభియోగాన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ, బహిరంగ విచారణలో చట్ట ప్రకారం దోషిగా తేలే వరకు నిర్దోషిగానే భావించాలి. ఈ మేరకు ఆ వ్యక్తికి హక్కు ఉంది. ఈ విచారణలో, తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని హామీలూ వ్యక్తికి ఉంటాయి.
(2) ఎవరైనా వ్యక్తి చేసిన తప్పిదం లేదా పని అది జరిగిన సమయానికి జాతీయ, లేదా అంతర్జాతీయ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం కాకపోతే, ఆ వ్యక్తిని శిక్షార్హమైన నేరంలో దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. శిక్షార్హమైన నేరం జరిగినప్పుడు వర్తించే శిక్ష కన్నా తీవ్రమైన శిక్షను విధించడానికి కూడా వీల్లేదు.
ఆర్టికల్ 12: ఏ ఒక్కరి వ్యక్తిగత గోప్యత, కుటుంబం, ఇల్లు, ఉత్తరప్రత్యుత్తర విషయాల్లో ఏకపక్షంగా జోక్యం చేసుకోవడానికిగాని, గౌరవ ప్రతిష్ఠలపై దాడి చేయడానికిగాని వీల్లేదు. అలాంటి జోక్యం, దాడుల నుంచి చట్టపరమైన రక్షణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఆర్టికల్ 13:(1) దేశంలో స్వేచ్ఛగా తిరిగే, నివసించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. (2) సొంత దేశం నుంచి లేదా ఏ దేశం నుంచి అయినా వెళ్లిపోయే హక్కు, తన దేశానికి తిరిగి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. ఆర్టికల్ 14: (1) పీడన నుంచి తప్పించుకొనేందుకు ఇతర దేశాలను ఆశ్రయం అడిగే, పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. (2) ఐక్యరాజ్యసమితి సూత్రాలకు, ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలు లేదా రాజకీయతేర నేరాలపై నిజమైన ప్రాసిక్యూషన్ జరిగే సందర్భంలో ఈ హక్కు ఉండకపోవచ్చు. ఆర్టికల్ 15: (1) ఏదైనా జాతీయతను కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. (2) ఎవరికీ ఏకపక్షంగా జాతీయతను తొలగించకూడదు, అలాగే జాతీయతను మార్చుకొనే హక్కును నిరాకరించకూడదు. ఆర్టికల్ 16: (1) జాతి, జాతీయత లేదా మతం పరిమితులు లేకుండా పెళ్లి చేసుకొనేందుకు, కుటుంబాన్ని కలిగి ఉండేందుకు వయోజనులైన మహిళలకు, పురుషులకు హక్కు ఉంది. వివాహం చేసుకొనేటప్పుడు, వివాహ బంధంలో ఉన్న కాలంలో, దీనిని రద్దుచేసుకొనేటప్పుడు వారికి సమానమైన హక్కులు ఉంటాయి. (2) పెళ్లికి ఇద్దరు వ్యక్తుల్లో స్వేచ్ఛాయుత, సంపూర్ణ అంగీకారం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. (3) సమాజంలో కుటుంబమనేది ఒక సహజమైన, ప్రాథమికమైన భాగం. కుటుంబానికి సమాజం, రాజ్యం రక్షణ కల్పించాలి.
ఆర్టికల్ 17: (1) సొంతంగాగాని, ఇతరులతో కలసి గాని ఆస్తులు కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది. (2) ఎవరికీ ఏకపక్షంగా ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదు.
ఆర్టికల్ 18: స్వేచ్ఛాయుత అంతఃచేతనత్వానికి, స్వేచ్ఛగా ఆలోచించడానికి, మతాన్ని పాటించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. మతాన్ని లేదా విశ్వాసాన్ని మార్చుకొనే హక్కు ఇందులో భాగం. ఒంటరిగాగాని, ఇతరులతో కలిసిగాని ప్రైవేటుగాగాని, బహిరంగంగాగాని తన మతవిశ్వాసాలను పాటించే, బోధించే స్వేచ్ఛ, పూజించే స్వేచ్ఛ అందరికీ ఉన్నాయి.
ఆర్టికల్ 19: ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా హక్కు ఉంది. ఇతరుల జోక్యం లేకుండా సొంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు, సరిహద్దులతో సంబంధం లేకుండా ఏ మార్గం నుంచైనా సమాచారం, ఆలోచనలు కోరే, స్వీకరించే హక్కు ఇందులో భాగం.
ఆర్టికల్ 20: (1) స్వేచ్ఛగా శాంతియుతంగా సమావేశమయ్యేందుకు, సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది. (2) ఏదైనా సంఘంలో భాగస్వామి కావాలని ఎవరినీ బలవంతపెట్టడానికి వీల్లేదు.
ఆర్టికల్ 21: ప్రతి ఒక్కరికీ తమ దేశ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా లేదా ఎంచుకున్న ప్రతినిధి ద్వారా భాగస్వామ్యమయ్యే హక్కు ఉంది.
1) ప్రతి ఒక్కరికీ తమ దేశంలో ప్రభుత్వ సేవలను సమానంగా పొందే హక్కు ఉంది. 2) ప్రభుత్వానికి ప్రజాభీష్టం ప్రాతిపదిక కావాలి. నిర్దేశిత కాలానికి జరిగే నిజమైన ఎన్నికల్లో ఈ ప్రజాభీష్టం వ్యక్తంకావాలి. ఈ ఎన్నికల్లో సార్వజనీన, సమానమైన ఓటు హక్కు ఉంటుంది. రహస్య ఓటింగ్ లేదా దానికి సమానమైన స్వేచ్ఛాయుత ఓటింగ్ నిర్వహించాలి. ఆర్టికల్ 22: సమాజంలో సభ్యులుగా ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత హక్కు ఉంది. తన గౌరవానికి, తన వ్యక్తిత్వం స్వేచ్ఛగా అభివృద్ధి చెందటానికి ఆవశ్యకమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను జాతీయ కృషి, అంతర్జాతీయ సహకారం ద్వారా దేశ వనరులకు అనుగుణంగా సాధించుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 23: (1) ప్రతి ఒక్కరికీ పని చేయడానికి హక్కుంది. స్వేచ్ఛగా కోరుకొన్న ఉపాధిని పొందడానికి, పనిచేయటానికి న్యాయమైన, అనుకూలమైన పరిస్థితులు పొందడానికి, నిరుద్యోగిత నుంచి రక్షణ పొందటానికి అందరికీ హక్కుంది. (2) ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్షా లేకుండా సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది. (3) పని చేసే ప్రతి ఒక్కరికీ తాను, తన కుటుంబం మానవ గౌరవంతో మనుగడ సాగించటానికి హామీ ఇచ్చేలా న్యాయమైన, అనుకూలమైన వేతనం పొందే హక్కు ఉంది. అవసరమైతే ఇతర మార్గాల్లో అదనంగా సామాజిక రక్షణ పొందే హక్కు ఉంది. (4) ప్రతి ఒక్కరికీ తన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం కార్మిక సంఘాలు ఏర్పాటు చేయటానికి, వాటిలో చేరటానికి హక్కు ఉంది. ఆర్టికల్ 24: ప్రతి ఒక్కరికీ పనిగంటలకు హేతుబద్ధమైన పరిమితిని, నిర్దేశిత కాలానికి వేతనంతో కూడిన సెలవులను పొందే హక్కు, విశ్రాంతి, విరామం తీసుకునే హక్కు ఉన్నాయి. ఆర్టికల్ 25: (1) ప్రతి వ్యక్తికీ ఆహారం, దుస్తులు, నివాసం, వైద్యసేవలు, ఇతర సామాజిక సేవలు సహా.. తను, తన కుటుంబ ఆరోగ్య, సంక్షేమాలకు తగిన జీవన ప్రమాణం పొందే హక్కు ఉంది. నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, వైధవ్యం, వృద్ధాప్యం లేదా తన నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల జీవనోపాధి లేకపోవటం నుంచి భద్రత పొందే హక్కు ఉంది. (2) మాతృత్వం సమయంలో మహిళలకు, బాల్యదశలో చిన్నారులకు ప్రత్యేక సేవ, సహాయాలు పొందే హక్కు ఉంది. పెళ్లి ద్వారా పుట్టినా, పెళ్లి కాకుండా పుట్టినా చిన్నారులు అందరికీ సమానమైన రక్షణ లభించాలి. ఆర్టికల్ 26:(1) ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు ఉంది. కనీసం ప్రాథమిక, మౌలిక స్థాయుల్లో అయినా అందరికీ విద్య ఉచితంగా అందాలి. ప్రాథమికవిద్య తప్పనిసరిగా ఉండాలి. సాంకేతిక విద్య, వృత్తినైపుణ్య విద్య అందుబాటులో ఉండాలి. ఉన్నతవిద్య ప్రతిభ ప్రాతిపదికన అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. (2) మానవ వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించేలా, మానవ హక్కులను, మౌలిక స్వాతంత్ర్యాలను గౌరవించేదిగా విద్య ఉండాలి. (3) తమ పిల్లలకు ఏ తరహా విద్య అందించాలో ఎంచుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది. ఆర్టికల్ 27: (1) ప్రతి ఒక్కరికీ సమాజ సాంస్కృతిక జీవనంలో స్వేచ్ఛగా పాలుపంచుకోవడానికి, కళలను ఆస్వాదించడానికి, శాస్త్రీయ పురోగతిలో, వాటి ప్రయోజనాల్లో భాగం పంచుకోవడానికి హక్కు ఉంది.
(2) ప్రతి వ్యక్తికీ తను సృజించిన ఎలాంటి శాస్త్రీయ, సాహిత్య, కళా ఉత్పత్తుల నుంచి లభించే నైతిక, భౌతిక ప్రయోజనాలను పరిరక్షించుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 28: ఈ ప్రకటనలో నిర్దేశించిన హక్కులు, స్వాతంత్ర్యాలు సంపూర్ణంగా సాకారమయ్యే సామాజిక, అంతర్జాతీయ పరిస్థితులు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఆర్టికల్ 29: తన వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించటం సాధ్యమయ్యే సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యతలు కూడా ఉన్నాయి. (1) ప్రతి ఒక్కరూ తన హక్కులు, స్వాతంత్ర్యాలను వినియోగించుకొనే క్రమంలో- ప్రజాస్వామ్య సమాజంలో ఇతరుల హక్కులు, స్వాతంత్ర్యాలకు తగిన గుర్తింపు, గౌరవం, నైతికత, శాంతిభద్రతలు, సాధారణ సంక్షేమం కోసం చట్టం నిర్దేశించిన పరిమితులకు మాత్రమే లోబడి ఉండాలి. (2) ఈ హక్కులు, స్వాతంత్ర్యాలను ఏ విధంగానూ ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, సూత్రాలకు వ్యతిరేకంగా ఉపయో గించరాదు. ఆర్టికల్ 30: ఈ ప్రకటనలోని ఏ అంశమైనా ఇందులో నిర్దేశించిన హక్కులు, స్వాతంత్ర్యాల్లో దేనినైనా ధ్వంసం చేసేందుకు, లేదా ఏమైనా చేసేందుకు ఏ రాజ్యానికీ, సంఘానికీ, వ్యక్తికీ వీలు కల్పిస్తున్నట్లు భావించరాదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments