Thursday, June 30, 2022
HomeLifestyleLife styleప్రాచీన గ్రంథాలను పరిరక్షించాలి

ప్రాచీన గ్రంథాలను పరిరక్షించాలి

చినిగిన చొక్కా అయినా తొడుక్కో…కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి ‍వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి(World Book Day).

నేను నా భార్య బిడ్డలకన్నా పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను. “పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలిగిస్తుంది”… భారత రత్న ప్రపంచ మేధావి అంబేడ్కర్ మాటలు మనకు నిత్య జ్ఞాపకాలే.

పుస్తకం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆనందాన్నిస్తుంది, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలవాట్లను మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. తరాల మధ్య వారధిగా, జ్ఞానాన్ని పంచే మాధ్యమంగా పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం.
కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్‌, ఇంటర్నెట్, మొబైల్ ఇతరములు ఎన్ని దరిజేరుతున్నా, పుస్తకం విలువ మాత్రం చెక్కుచెదర లేదు.
మానవ మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహద పడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞాన సముపార్జన తృష్ణ మొదలైంది అంటే, తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నిత్య నూతన విజ్ఞానాన్ని అందించేది పుస్తకం.

ప్రపంచ పుస్తక దినోత్సవం(World Book Day) ప్రతి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.1616 సంవత్సరం, ఏప్రిల్ 23 తేదీ ప్రపంచ ప్రఖ్యాత విలియం షేక్స్పియర్, సెర్వాంటిస్ ఇన్కా గార్సిలాసో డి లా వెగా అదే రోజు కన్ను మూశారు. ఇంకా పలువురు సాహితీమూర్తులు మారిస్ డ్రాన్, హెడర్ కె లాక్నెస్, వ్లాదిమర్ నబకోవ్, జోసెఫ్ ప్లా, మాన్యుయెల్ మెజియా వాల్లెజో వంటి వారి జయంతి లేదా వర్ధంతి అదే రోజు కావడం విశేషం. దీనితో పుస్తకాన్ని విశ్వమంతా కలసి ఆరాధించేలా ఒక రోజును ఎంపిక చేయాలని భావించినప్పుడు యునెస్కోకు ఇదే తేదీ కనిపించింది. పారిస్ 1995లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1995, ఏప్రిల్ 23న యునెస్కో తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది.

అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంతమైన ఆయుధం. మానవుని భావనా తరంగాలు ఇతరులు స్పష్టంగా చదువ గలిగే ఒక కెమెరా దృశ్యాలు. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి అయు ప్రమాణం వందేళ్ళయితే, గ్రంథ ఆయుప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంథ పూజను పుస్తకాల (సర స్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రులలో నిర్వహించే ఆచారం కొనసాగు తున్నది. గ్రంథం పొరపాటున కాలికి తగిలితే, కళ్ళకు అద్దుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది.

గ్రంథానికి వయసు అనేది లేదు. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300 ఏళ్ళ క్రితం కౌటి ల్యుడు అర్థశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టాధ్యాయి పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్యశాస్త్రం హాలుని ‘గాథా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాలలాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి. భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంథాలు విదేశీయులను ఆకర్షించాయి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే తలంపులో భాగంగా, భారత దేశాన్ని జయించడా నికి వచ్చిన సందర్భంగా ఆయన గురువైన అరిస్టాటిల్ మన దేశ తత్వ సాహిత్యన్ని తెరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు(World Book Day). బుద్ధ బోధన గ్రంథాలు, విదేశీ యాత్రికల సందర్శనలకు హేతువులైనాయి. చైనా, టిబెట్, అప్ఘనిస్థాన్, మంగోలియా దేశీయులు భారత సందర్శనతో పాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్య మూల, అనువాద రూపాలలో తీసుకెళ్ళారు. అక్షరం కనుగొన బడడానికి ముందు వేద వాజ్మయం శ్రుత సాహిత్యంగా ఉండేది. శృతం లిఖితం కావడం మానవ సంస్కతీ వికాస పరిణామాల క్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రస్తాన త్రయం, భారత భాగవత రామాయణాలు ఉప పురాణాలు, స్మృతి గ్రంథాలు, భారతీయ కథా సాహిత్యం గ్రంథ రూపం సంతరించు కున్నాక, ప్రపం చంలో ఏజాతీ, ఏదేశం, భారత దేశానికి సాటి రావని సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది. భారతీయ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం.

ప్రాచీన తాళపత్ర గ్రంథాలు నలంద, తక్షశిల తది తర విశ్వ విద్యాలయాలలో భద్రపరచ బడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలాసార్లు మాడి మసి బొగ్గయింది. నేపాల్ విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విశాద ఘటన. ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతుల ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథ వందలాది ప్రతులు సిద్ధ మయ్యే సౌలభ్యం ఏర్పడింది. అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారు చేసే ఉద్యోగులు ఉండే వారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహు కష్టంతో కూడుకునేది. గ్రంథస్థ విషయాలు ప్రపంచ మంత విస్తృతం, ప్రపంచ వ్యాపితం అవుతున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంథాలు, సృజనాత్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మికాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటే మిటి…వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథంలోకి వెళితే, అది బాహ్య ప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతున్నది. అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారాలు. ఈ విషయాలను అర్థం చేసుకుని, పుస్తక దినోత్సవం సందర్భంగా పఠనాసక్తిని పెంపొందించే కృషి జరగాలి. అలాగే అపూర్వ, అపురూప, అమూల్య ప్రాచీన గ్రంథాల పరిరక్షణ పట్ల బాల్యం నుండే పిల్లలలో అవగాహన కల్పించాలి.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments