నవతెలంగాణ-బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్ బయ్య కృష్ణ(45) మృతిచెందారు. గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో కృష్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తూనే సమ్మెలో కూర్చున్నాడు. తమ హక్కులను సాధించుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని కుటుంబీకులతో చెబుతూ ఉండేవాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కృష్ణ మృతిచెందారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి మరో కార్మికుడు బలి అవ్వకముందే గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.