విలియం క్రూక్స్ ప్రఖ్యాత బ్రిటిష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. క్రూక్స్ రేడియో వికిరణ మాపకం ఆవిష్కర్త. అయన ఉత్సర్గ నాళం రూపకల్పనకు మార్గదర్శి. థాలియం అనే క్రొత్త మూలకాన్ని కనుగొన్నాడు. రాయల్ కాలేజ్ ఆఫ్ కెమిస్ట్రీ, లండన్ లో వర్ణపట శాస్త్రం పై విస్తృత పరిశోధనలు చేశాడు. ఆయన తయారుచేసిన ఉత్సర్గ నాళాన్ని క్రూక్స్ నాళం అనికూడా అంటారు. ఆయన పరిశోధనల ఫలితంగా సెలేనియం యొక్క సంయోగ పదార్థములు కనుగొన బడ్డాయి. ఆయన కేంద్రక రేడియో ధార్మికతను అధ్యయనం చేయుటకు ఉపయోగించే పరికరం spinthariscope ను కనుగొన్నాడు. పదార్థం యొక్క స్థితులలో (ఘన, ద్రవ, వాయు) నాల్గవ స్థితి అయిన ప్లాస్మాను కనుగొనుటలో, ఆ స్థితిని గుర్తించుటలో మొదటి శాస్త్రవేత్తగా నిలచాడు. క్రూక్స్ చేసిన పరిశోధనల వల్ల భౌతిక, రసాయన శాస్త్రాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
క్రూక్స్ తన జీవన గమనంలో ఒక అంతరిక్ష శాస్త్రవేత్తగా, ఉపన్యాసకునిగా వివిధ ప్రాంతాలలో పనిచేశాడు. భౌతిక, రసాయన శాస్త్రాలలో అనేక పరిశోధనలు చేశాడు. తన పరిశోధన ముఖ్య లక్షణము ప్రయోగముల ద్వారా వివిధ భావనలను, వాస్తవాలను కనుగొనుటగా భావించాడు. ఆయన అభిరుచు లయిన అనువర్తిత భౌతిక శాస్త్రము, ఆర్థిక, ప్రాయోగిక సమస్యలు, మానసిక సంబంధమైన పరిశోధనలు, ఆయనను ఉన్నత వ్యక్తిగా నిలిపింది. ఆయన అనేక అవార్డులు, గౌరవాలను పొందాడు. ఆయన జీవితం ఒక అసాధారణ శాస్త్రీయ కృత్యాలలతో మమేకం అయింది.
సర్ విలియం క్రూక్స్ లండన్ లో 1832 జూన్ 17 లో జన్మించాడు.
1850 నుండి 1854 మధ్య కాలంలో ఆయన కళాశాలలో సహాయకునిగా పనిచేశాడు. అనతి కాలంలో ఆయన కర్బన రసాయన శాస్త్రంలో కాకుండా ఆయనకు ఇష్టమైన రంగంలో ఆయన గురువు విల్‌హెల్ం వోన్ హోఫ్మాన్న్ ప్రేరణతో ప్రవేశించాడు. ఆయన పరిశోధనల ఫలితంగా సెలేనియం యొక్క సంయోగ పదార్థములు కనుగొన బడ్డాయి. ఆయన మొదటి పరిశోధనా పత్రాలను 1851 లో ప్రచురించాడు. ఆయన ఆక్స్‌ఫర్డ్ లో రాడ్‌క్లిఫ్ అబ్సర్వేటరీ విభాగంలో 1854 లో, ఛెస్టెర్ డియోసియన్ ట్రయినింగ్ కళాశాలలో 1855లో ఉపన్యాసకునిగా పనిచేశాడు. 1859 లో ఆయన కెమికల్ న్యూస్ అనే విజ్ఞానశాస్త్ర పత్రికను ప్రారంభించాడు. అనేక సంవత్సరాలు ఆ పత్రికలో వివిధ మార్పులు చేస్తూ నిర్వహించి అన్ని విజ్ఞాన శాస్త్ర జర్నల్స్ లో అగ్రగామిగా నిలిపాడు.
1861 లో క్రూక్స్ థాలియం అనే క్రొత్త మూలకాన్ని కనుగొన్నాడు. ఈ మూలకం వర్ణపటంలో ఆకుపచ్చని కాంతిని ఉద్గారం చేయుటను గమనించాడు. గ్రీకు భాషలో థల్లోస్ అంటే ఆకుపచ్చని ఉద్గారం అని అర్థము. అలా దానికి థాలియం అని నామకరణం చేశాడు. క్రూక్స్ 1871 లో “Select Methods in Chemical Analysis” అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించాడు. ప్రముఖ శాస్త్రవేత్తలైన బున్సెన్, కిర్కాఫ్లు ప్రవేశపెట్టిన వర్ణపట విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి క్రూక్స్ అత్యంత ఉత్సుకతతో పరిశోధనలు కొన సాగించాడు. థాలియంను వర్ణపట విశ్లేషణ సహాయంతో కనుగొన్నాడు. ఆ నూతన ఆవిష్కరణ ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చి తెచ్చింది. ఆయన 1863 లో రాయల్ సొసైటీకి ఫెలోగా ఎంపికయ్యాడు.
ఆయన క్రూక్స్ నాళంను అభివృద్ధి చేశాడు. తద్వారా ఋణధృవ కిరణాల ఆవిష్కరణ జరిగింది. ఆయన అనేక పరిశోధనా పత్రాలను వర్ణపట శాస్త్రం పై ప్రచురించాడు. అల్ప పీడనం వద్ద వాయువుల గుండా విద్యుత్ ను ప్రవహింపజేయు పరిశోధనలలో ఆయన అతి తక్కువ పీడనం వద్ద వాయువుల గుండా విద్యుత్ ను ప్రవహింప జేసినపుడు ఋణ ధృవం (కాథోడ్) నుండి కొన్ని కిరణాలు ఉద్గారమగు చున్నట్లు కనుగొన్నాడు. వాటికి “ఋణధృవ కిరణాలు” అని పిలిచాడు. యివి ప్రస్తుతం స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహంగా పిలువ బడు తున్నాయి. ప్రస్తుతం ఇవి కాథోడ్ కిరణ నాళాలలో ఉపయోగ పడుతున్నాయి. ఈ ఉదాహరణల నుండి ఆయన భౌతిక దృగ్విషయాలను అధ్యయనం చేయుటకు ఉపయోగపడే ఉత్సర్గ నాళాల తయారీలో ప్రసిద్ధి పొందాడు. 1879 లో ఆయన పదార్థం యొక్క స్థితులలో (ఘన, ద్రవ, వాయు) నాల్గవ స్థితి అయిన ప్లాస్మాను కనుగొనుటలో, ఆ స్థితిని గుర్తించుటలో మొదటి శాస్త్రవేత్తగా నిలచాడు. ఆయన కేంద్రక రేడియో ధార్మికతను అధ్యయనం చేయుటకు ఉపయోగించే పరికరం spinthariscopeను కనుగొన్నాడు.
క్రూక్స్ ఋణధృవ కిరణాలు లక్షణాలపై పరిశోధనలు చేశాడు. అవి ఋజుమార్గంలో ప్రయాణిస్తాయని, అవి వస్తువులపై పడినపుడు ప్రతిదీప్తిని కలుగ జేస్తాయని కనుగొన్నాడు. పదార్థంలో నాల్గవ స్థితి అయిన “ప్లాస్మా” స్థితిని ఆయన కనుగొన్నాడు. దానికి “రేడియంట్ మేటర్” అని పిలిచాడు. ఋణ ధృవ కిరణాలు అనేవి కొన్ని కణాల ప్రవాహమని నమ్మాడు. ఆ తర్వాత జె.జె.థామ్సన్ వాటిని కనుగొనడానికి భూమికను ఏర్పరచాడు. కాథోడ్ కిరణాలలో గల కణాలకు ఎలక్ట్రాన్ లుగా గుర్తించాడు. క్రూక్స్ చేసిన పరిశోధనల వల్ల భౌతిక, రసాయన శాస్త్రాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీని ఫలితంగా పరమాణువులో కొత్త కణాల ఆవిష్కరణకు మార్గం సుగమమైంది.
1880 తర్వాత క్రూక్స్ ప్రైవేటు ప్రయోగ శాలలో తన పరిశోధనలను చేశాడు. 1895 లో విలియం క్రూక్స్ హీలియం నమూనాను గుర్తించాడు. 1903 లో ఆయన తన దృష్టిని రేడియో ధార్మికత దృగ్విషయాలపై నిలిపాడు. యురేనియం -X (తర్వాత ప్రొటాక్టీనియంగా పిలువ బడుతున్నది. యురేనియాన్ని రేడియో ధార్మిక పరివర్తన ఆధారంగా వేరుచేయ గలిగాడు. ఉత్తేజిత పరివర్తన ఆధారంగా యురేనియం నుండి రేడియో ధార్మిక విఘటనాన్ని గమనించాడు. అదే సమయంలో ఆయన రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే “p-కణముల”ను కనుగొన్నాడు. ఈ కణాలు జింక్ సల్ఫైడ్ తెరను ప్రభావితం చేయుట గమనించాడు.
క్రూక్స్ 1909 లో “డైమండ్స్” అనే చిన్న పుస్తకాన్ని రాశాడు. 1910 లో క్రూక్స్ “ఆర్డర్ ఆఫ్ మెరిట్”ను పొందాడు. ఆయన తన భార్య మరణానంతరం 2 సంవత్సరాల తర్వాత లండన్ లో 4 ఏప్రిల్ 1919 లో మరణించాడు.