5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeLifestyleDevotionalఎవరీ సప్త ఋషులు? వారు మనకెలా మూలపురుషులయ్యారు ?

ఎవరీ సప్త ఋషులు? వారు మనకెలా మూలపురుషులయ్యారు ?

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.

అంటే, ఒక విధంగా సృష్ట్యాదిలో మనమంతా ఆ ఏడుగురు మూల పురుషుల నుంచే వచ్చామన్నమాట. సప్త ఋషుల పేర్లు ఒక్కోచోట ఒక్కో విధంగా కొంచెం భేదాలతో చెప్పబడ్డాయి. ఎవరి పేరు ఉన్నా ఎవరిది లేకున్నా అందరూ గొప్పవారే. పైగా సప్తర్షి వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేది. అందుకే, ప్రతీ మన్వంతరంలో సప్త ఋషులు మారిపోతుంటారు. మన గ్రంథాల్లో ఈ కల్పంలోని మొత్తం పద్నాలుగు మన్వంతరాలకు కూడా సప్తర్షుల జాబితాలు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం.

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!
ఈ కాలానికి సప్తర్షులు… కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. వీరంతా ఎవరికి వారే మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవులు. కశ్యపుడు నారాయణ అంశ అంటారు. అత్రి దత్తాత్రేయునికే తండ్రి. విశ్వామిత్రుడు పరమ పవిత్రమైన గాయత్రి మహామంత్రాన్ని అందించిన వాడు. ఇక గౌతముడు మన తెలుగు నేలను సస్యశ్యామలం చేసే గోదావరిని భువికి తెచ్చిన వాడు. అందుకే, గోదావరిని గౌతమీ అని కూడా అంటుంటారు. అలాగే, వశిష్ఠుడు సాక్షాత్తూ శ్రీరామచంద్రుల వారికే కుల గురువు. సప్తర్షుల్లో చివరి వాడైన జమదగ్ని రేణుకా దేవీ భర్త, పరశురాముని తండ్రి, మహా తపః సంపన్నుడు . అందువలన వీరు ఏడుగురు పూజ్యనీయులే. వారిని గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .

 1. కశ్యప మహర్షి:-
  సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.
 2. అత్రి మహర్షి:-
  సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.
 3. భరద్వాజ మహర్షి:-
  భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.
 4. విశ్వామిత్ర మహర్షి:-
  విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
 5. గౌతమ మహర్షి:-
  తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.
 6. వశిష్ఠ మహర్షి:-
  ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
  సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.
 7. జమదగ్ని మహర్షి:-
  జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.
  వీరు ఈ మన్వంతరానికి ఋషులు . గురువులు . వీరిజీవితాలని తెలుసుకోవడం, వారి బోధనలని అనుసరించడం ఈ మన్వంతరంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు .

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments