సంప్రదాయం ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని ఉపవాసలలో కంటే ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఫల్ఘుణ మాసానికి చెందిన కృష్ణ పక్షానికి చెందిన ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. అవతార పురుషుడైన శ్రీరామ చంద్రుడు స్వయంగా ఆచరించి ఫలితం పొందిన ఏకాదశి విజయ ఏకాదశి. ద్వాపర యుగంలో ధర్మరాజుకు ఫాల్ఘుణ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. వెంటనే ఆయన శ్రీకృష్ణుడిని ఫాల్గుణ ఏకాదశి కథ గురించి వివరించమని కోరాడు.శ్రీరామ సీతా లక్ష్మణులు వనవాస సమయంలో, రావణుడు సీతా దేవిని అపహరించి లంకలో ఉంచాడు. రాముడు సీతాదేవిని వెతుకుతున్నప్పుడు, హనుమం తుడు లంకలో సీతామాత ఉనికిని తెలియ జేశాడు. భూజాతను రక్షించడానికి, రాముడు వానర సేనతో కలిసి లంకకు చేరుకోవ డానికి సముద్రాన్ని దాటవలసి వచ్చింది. కాని వానర సైన్యానికి అది కష్టమైన పని.అతి దుర్భేద్యమైన సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకా పట్టణా న్ని ఎలా చేరుకోవాలా అని ఆంజనేయునితో సహా అందరూ విచారిస్తుండగా లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివశిస్తున్న బకదళా భ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కోరదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరిస్తారు. ఆ బకాదళాభ్యుడు బ్రహ్మ దేవుని మెప్పించి ప్రత్యక్షం చేసుకున్న మహా తపస్వి. ఆయన శ్రీరాముని చూడగానే శ్రీ మహా విష్ణువు ఏతెంచాడని గ్రహించాడు. విష్ణుని లీలలను తెలుసుకొన్న ఆయన విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి విజయ ప్రాప్తిని పొందమని రామచంద్రునికి సూచిస్తాడు. రామ చంద్రుడు విజయ ఏకాదశినాడు ఉపవాస దీక్ష పాటించి అందరికీ విజయ ఏకాదశి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపాడు. రాముడితోపాటు వానర సైన్యం మొత్తం కృష్ణ పక్షంలో వచ్చిన ఏకాదశి రోజున ఉపవాసం చేయడంతో పాటు రామసేతును నిర్మించి, సముద్రం దాట గలిగారని, విజయ ఏకాదశి నాటి వ్రత దీక్షా ఫలితంగా లంకను జయించి రావణుని సంహరించి సీతమ్మను చెరవిడిపించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఏకాదశి వ్రత కథ. ఇది స్కాంద పురాణం లో, రామాయణం లోనూ ప్రస్తావించ బడింది. ఈ కథను విన్నవారు, చదివిన, తెలుసుకున్న వారు ఇహ లోకం లో కోరిన కోర్కెలు నెరవేరి సర్వదా విజయం సాధించి, జన్మాంతంలో హరి సాన్నిధ్యాన్ని పొందుతారు. విజయ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల శ్రీరామునికి విజయం లభించింది. అందుకే భక్తులు విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. విజయ ఏకాదశి ప్రాముఖ్యత అనేక హిందూ గ్రంథాలలో వివరించబడింది. విజయ అనే పదం విజయాన్ని సూచిస్తుంది. విజయ ఏకాదశిని ఆచరించడం వల్ల అది విజయాన్ని అందిస్తుంది. అన్ని రకాల అడ్డంకుల నుండి ఉపశమనం అందించడంలో సహాయ పడు తుంది. ఈ రోజున దానధర్మా లు చేస్తే, తమ గత ప్రస్తుత పాపా ల నుండి ఉపశమనం పొందు తారని, సుఖ శాంతులు పొందు తారని శాస్త్ర వచనాలు.సనాతన ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశీ ఉపవాసం పరమ పుణ్య దాయకం.ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గర కావాల నేదే ఉపవాసం లోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణ పఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. ‘భగవద్గీతా’ పుస్తకదానం చేస్తారు.లంకణం పరమౌషధం అని పెద్దల నానుడి. ఏకాదశి ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేట ప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం.