గొల్లపూడి మారుతీరావు పరి చయం అక్కరేలేని పేరు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో ఉన్న ప్రతిభ అనన్య సామాన్యం. సంపాదకుడు, వ్యాఖ్యాత, పాత్రికే యుడు, సినిమా మాటల రచయిత గాను నటుడిగానూ సుపరిచితు డు. తెలుగు సాహిత్యాభివృద్ధికి ఆయన కృషి సాటి రానిది. సినిమాల్లోకి రాకముందు నాటకా లు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరు గా, ‘ఆంధ్ర ప్రభ’ (దినపత్రిక) ఉపసంపాద కుడిగా పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్ట మొదటి రచన ‘డాక్టర్ చక్రవర్తి’కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకా లు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాం శాలుగా ఉన్నాయి.
గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో అన్నపూర్ణ, సుబ్బారావులకు జన్మించాడు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్సీ (ఆనర్స్) చేశాడు.
మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరు లో పత్రిక మరో ఎడిషన్ ప్రారంభిం చినపుడు, సంపాదక వర్గంలో పనిచేశాడు. తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశాడు. పదోన్నతి పొంది, సంబల్పూర్ వెళ్లాడు. తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1981లో ఆకాశ వాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు.
విద్యార్థి దశలో ఉండగానే పలు నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. భమిడి పాటి రాధాకృష్ణ రచించిన ‘మన స్తత్వాలు’ నాటకం ఆంధ్ర అసోసి యేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించాడు. ఆ అసోసియేషను కు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్ట మొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరి లలో ప్రదర్శిం చగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధాన మంత్రి రక్షణ నిధికి ఇచ్చాడు.
మారుతీరావు రాసిన తొలి కథ ‘ఆశాజీవి’. చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం ‘వందే మాతరం’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. నాటి విదేశీ వ్యవహా రాల శాఖ మంత్రి పి.వి. నరసింహా రావు దానికి ఉపోద్ఘాతం రాశాడు. 1959, డిసెంబరు 16న ‘రాగరాగిణి’ అనే నాటకం అప్పటి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించ బడింది.
తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపర ను ఆంధ్ర విశ్వ విద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్య పుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన ‘కళ్ళు’ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు.
1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నం లోనే ఉత్తమ కథా రచన కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు లభించింది. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయి తగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు.
1975లో కళ్ళు నాటకానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భారతీయ భాషల్లోకి అనువ దించారు. ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం వారికి పాఠ్యపుస్తకంగా ప్రతిపాదించారు.
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం. బుల్లితెరపై ఈటీవీ నిర్వహిస్తున్న ‘ప్రతిధ్వని’ కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యా తగా వ్యవహరించి, అన్ని రంగాల కు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఈటీవీ నిర్వహించిన ‘మనసున మనసై’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు. జెమిని టీవీ నిర్వహించిన ‘ప్రజా వేదిక’, మాటీవీ నిర్వహించిన ‘వేదిక’, దూరదర్శన్, హైదరాబాద్ ప్రసారం చేసిన ‘సినీ సౌరభాలు’ మొదలైనవి ఆయన నిర్వహించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు.
‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ’ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహ రించాడు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశాడు. గొల్లపూడి 80వ ఏట 2019 డిసెంబర్ 12న మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494