వేటూరి జయంతి తెలుగు పదానికి పునరావృత జన్మదినం. ఆయన గేయ రచనా వైవిద్యం ఎందరికో స్ఫూర్తి దాయకం.
శ్రీశ్రీ తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు పాటల రచయత వేటూరి సుందర రామమూర్తి. మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు ఈ అవార్డు అందుకున్న వేటూరి. ఇటు క్లాసే కాదు.. అటు మాస్ సాంగ్స్ రాయడంలోనూ వేటూరి వారిది అందె వేసిన చెయ్యే. తొమ్మిది వేలకు పైగా అలవోకగా ధారాపాతంగా పాటలు రాసిన గొప్పతనం వేటూరిది. పల్లెటూరి మాటలైనా, సమాస భూయిష్ట సంక్లిష్ట పదాలైనా పండితుని నుండి పామరుని వరకూ అవలీలగా చేరి, సులభంగా ప్రతీ నోటా పాడుకునేలా చేసిన అసమాన ప్రతిభ ఆయనకే సొంతమైంది.
వేటూరి సినిమా పాటలు రాయటానికి పూర్వం కొంతకాలం పత్రికల్లో పని చేసారు. తెలుగు భాష, సాహిత్యాలపై మక్కువ పెంచు కోవడానికి కారణం అయన పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి, తెలుగులో ప్రథమ జ్ఞానపీఠ గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. 1960 సంవత్సర ప్రాంతాల్లో మొదట ఆంధ్ర పత్రికలో కాలూని, తర్వాత ఆంధ్రపత్రిక
వీక్లీకి సహాయ సంపాదకుడుగా, ఆపై కొంతకాలం ఆంధ్రప్రభ
వార పత్రిక కు చీఫ్ సబ్ ఎడిటర్ గా అయన పని చేశారు.
ఎన్టీఆర్ నటించిన “దీక్ష” సినిమాలో మెదటి సారిగా సినిమాకు గీతరచన ప్రారంభించినా అది సినిమాలో రాలేదు. 1972 సంవత్సరం “ఓ సీత కధ” సినిమాలో లీల పాడిన హరికధతో, సినిమా దర్శకులు కె.విశ్వనాధ్ ప్రోత్సాహంతో సినిమా పాటల రచయితగా శ్రీకారం చుట్టి, వెనుతిరిగి చూడకుండా సాగుతూ, వరసగా సినిమా పాటలు రాస్తూ వచ్చారు.
వేటూరిగా పిలవబడే వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 – మే 22, 2010) లాంటి రచయిత సినీ పరిశ్రమకు పరిచయం కావడం తెలుగు ప్రజలు చేసుకున్న పురాకృత సుకృతం. సుందర రామమూర్తి 1936 జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళే పల్లిలో జన్మించారు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తి చేశారు.
1956 నుంచి పదహారేళ్ళ పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.
ముందుగా దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. వేటూరి సుందర రామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి, తన మాతృ భాషాభిమానాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.
వేటూరి మొదటి పాట ఓ సీత కథ. చివరి పాట బద్రినాథ్ లోని ఓంకారేశ్వరి పాట. ఆ మధ్యకాలంలో ఆయన వేల పాటలను రాశారు. ఓంకారేశ్వరి పాటలో 108 వైష్ణవ దివ్య స్థలాలను తన పాటలో వ్యక్త పరిచిన తీరు అసమానం. అపూర్వం, మహాద్భుతం.
సంప్రదాయ కవిత్వ పద బంధాల నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించు కున్నారు. కవనంలో, భావంలో, భాషలో పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. వేటూరి సినీ పాటల పరంపర నాలుగు దశాబ్దాలకు పైగా నిరాటంకంగా కొనసాగింది. దర్శకులకు, నిర్మాతలకు, నటీ నటులకు, సినీ సంబంధీకులకు ఆలంబనగా నిలిచింది. శ్రోతల హృదయాలను దోచింది. పసలేని చిత్రాలను పాటల ద్వారా తీరాలకు చేర్చింది. ఒక్క మాటలో … సినీ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంది. వేటూరి పాటల పూదోటలో ప్రతీ పాటా పరిమళం కొల్పోని సుగంధ పుష్పాలే. ఎన్నటికీ వాడిపోని అందమైన లతాంతాలే.
గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాటల్లో చెప్పాలంటే… ‘ఉపనిషత్తుల నుంచి ఉలిపిరి కాయితం వరకూ , దేన్ని గురించైనా అపారమైన పరిజ్ఞానం ’ వేటూరిది. మహా కవి శ్రీశ్రీ అన్నట్లు…తాను కన్న, విన్న, అనుభవించిన, ఊహించిన ప్రతి అంశాన్ని పదబద్దం చేసి, కాదేదీ కవితకు అనర్హం అని నిరూపించిన నేర్పరి వేటూరి. వేటూరి భువి నుండి దివికేగినా, ఆయన పాటలు అజరామరాలు, నిరంతరం తెలుగు వారి నాలుకలపై నడయాడే సుస్వరాలు. తెలుగు ప్రజల మనో ఫలకాలపై చెరగని ముద్రలు వేసి 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయారు.