Tuesday, August 9, 2022
HomeLifestyleDevotionalఆరాధ్య దేవత కన్యక

ఆరాధ్య దేవత కన్యక

వాసవీ దేవి అగ్ని ప్రవేశం చేసి, నేటికి 1000 సంవత్సరాలు గడిచాయి. వాసవీ మాత మాఘ శుక్ల పక్ష విదియ శుక్రవారం శతభిష నక్షత్రం రోజున ప్రాయోపవేశం చేసినట్లు పురాణ కథనం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడమే జగజ్జనని కన్యక అవతారం. బ్రహ్మ, విష్ణు, మహే శ్వర తైమూర్య దేవతలకు మూల కారణమైన భువనేశ్వరీదేవిని వాసవీ కన్యకా పరమేశ్వరీ రూపమున పూజించడం సదాచార పరంపరగా కొనసాగుతున్నది. గోదావరీ తీరాన గల 714 గోత్రీకులకు నిలయాలైన 18పట్టణాలకు కేంద్రంగా పెనుగొండ ముఖ్య పట్టణంగా మహా సంపదలతో వైశ్యులలో తలమానిక మైన, వేంగి దేశాన్ని ఏలే వైశ్యులకు రాజైన కుసుమ శ్రేష్ఠి, కుసుంబా దేవి దంపతులకు అనేక జన్మార్జితాలైన పుణ్యాలకు తోడు పుత్ర కామేష్టి యాగ ఫలము ఏకమై జగజ్జనని పరమేశ్వరీ దేవి, వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో అవతరించింది. అంతకు కొన్ని నిమిషాల ముందే ఒక బాలుడు జన్మించాడు. పరమేశ్వరుని పూజా ఫలమైన కుమారునికి విరూపాక్షుడని, జగజ్జ నని అవతారమైనందున పరమేశ్వరి అని నామకరణాలు చేశారు.

దేవి సర్వప్రాణులలో శక్తి రూపాన వసిస్తున్నందున “వాసవి” అని, పర పురుషులవైపు చూడక, పర మేశ్వరుని యందే మనసు లగ్నం చేసినందున “కన్యక” అని నామాంకితయైనది. ఇరువురు కుల గురువు భాస్కరాచార్యుని వద్ద వేదోక్త సంస్కారాలు, వేదాంగాలు నేర్చుకోగా, పరమేశ్వరి, పండితుల చెంత సంగీత నాట్య సకల కళలలో అసమాన ప్రతిభురాలై, విదుషీమణి యైనది. యుక్త వయస్కుడైన విరూపాక్షునకు, సంపన్న కుబేరుడైన అరిది శ్రేష్టి కూతురు రత్నావళితో వివాహం జరిపించారు. పరమేశ్వరి యౌవన వతియై, విశ్వమయుడైన మృత్యంజయుడి యందే మనసు లగ్నం చేసి నిరంతర ధ్యానం చేస్తున్నది. ఇలా ఉండగా రాజమహేంద్రవరాన్ని పాలించే దుష్టుడైన విష్ణువర్ధనుడు, పక్క రాజ్యాలను జయించి, తిరిగి వెళుతూ, పెనుకొండ వద్ద ఉద్యానవనంలో బసచేయగా, కుసుమ శ్రేష్ఠి తమ ప్రభువును దర్శింప కట్న కానుకలు, దాస దాసీ జనంతో వెళ్ళాడు. రాజును చూడడానికి మహేశ్వరి, తన తల్లి కుసుంబా దేవితో వెళ్ళి, ఆమె వెనక నిలుచుంది. అపురూప సౌందర్యవతి యైన మహేశ్వరిని రాజు చూసి, కామవాంఛా పరవశుడై తాను వివాహం చేసుకుంటానని, కాదంటే బలవం తంగా తీసుకు వెళతానని ప్రకటిస్తాడు. 714 గోత్రికులు సమావేశమై, ఇట్టి వివాహం వర్ణ సంకరం, వయో వ్యత్యాసముచే అనుచితమని నిర్ణయించారు. అయితే రాజుకు నచ్చ చెప్పి పంపుతారు.

కొద్ది దినాలకు విష్ణువర్ధనుడు తిరిగి వివాహ యత్నం చేయగా, పరమేశ్వరిని ఇవ్వడానికి సిద్ధంగా లేమని సమాధానం పంపుతారు. ఇది విన్నంతనే రాజు సందేశ హరులను ఖైదు చేస్తాడు. వారు తప్పించుకుని, పెనుకొండకు చేరుతారు. కుల గురువగు భాస్కరాచార్యుడు అక్షయ నామ సంవత్సర ఫాల్గుణ శుక్లపక్ష పాడ్యమి నాడు 18 పట్టణాల 714 గోత్రికులతో నగరేశ్వర మండపాన సమావేశ పరచగా, మహేశ్వరితో పాటు అగ్ని ప్రవేశం చేయ నిర్ణ యించారు. కన్యకను అభిప్రాయం కోరగా, పరంజ్యోతి నుండి తనను ఎవరూ వేరు పరచ జాలరని, అగ్ని ప్రవేశం ద్వారా జ్ఞాన మార్గాన పరమేశ్వరుని చేరుకుని, కైలాస వాసిని కాగలనని తేల్చి చెప్పింది. ఇది విన్న కొంత మంది ప్రాణ భయంతో పారి పోగా, 102 గోత్రికులు కన్యకతో ప్రాణ త్యాగానికి సంసిద్ధులౌతారు. అగ్ని ప్రవేశ సమయాన వాసవి తన తల్లిదండ్రులు నలకూబర దంపతులని, వీరనారాయణ పురవాసులగు ధనగుప్త దంపతులు కైలాస నివాసులు, నందీశ్వర దంపతులని, 102 గోత్రికులు ప్రమథ గణాలకు చెందిన వారని వివరించింది. దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. ఆమె తన నిజ స్వరూపాన్ని దేదీప్యమాన మైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.

వైశ్యులంతా వేద చోదితమైన మార్గమును వీడవలదని, వేదోక్త సంస్కారాలన్ని ఆచరించాలని, గాయత్రి మంత్ర జపమాచరించాలని, శృతి స్మృతి నిర్దేశిత మార్గాన్ని అనుసరించాలని ధర్మమార్గాన్ని వీడ వలదని బోధించింది. అలా అగ్ని గుండాన ప్రవేశించి, ఆత్మార్పణం ద్వారా నిజ స్థానాన్ని పొందింది. 102 గోత్రికులు ఆమెను అనుసరించి పుణ్యలోక ప్రాప్తులైనారు. నాటి నుండి వైశ్యులు త్రిమూర్తులకు మూల కారణమైన భువనేశ్వరిని కన్యకా పరమేశ్వరీ రూపాన పూజించడం సదాచారంగా, సత్సంప్రదాయంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments