Friday, August 12, 2022
HomeLifestylespecial Editionఅజారామరాలు...ఉషశ్రీ పురాణ వ్యాఖ్యానాలు

అజారామరాలు…ఉషశ్రీ పురాణ వ్యాఖ్యానాలు

తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు ఉషశ్రీ. తెలుగునాట ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాతగా, సాహిత్య రచయితగా, తమ రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగుసీమలో ఉషశ్రీ అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోతలు లేరంటే అది అతిశయోక్తి కానేకాదు. ధర్మ సందేహాలు అనే పదబంధం వినబడితే ఉషశ్రీ గుర్తుకు రాక మానరు. ఆకాశవాణి ద్వారా ఆ కార్యక్రమాన్ని అంతగా ప్రాచుర్యం గావించారు ఉషశ్రీ.

పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్ష వ్యాఖ్యానాల లోనూ తెలుగు శ్రోతలపై చెరగని ముద్ర వేసిన ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ. తెలుగు దేశంలో రేడియో స్వర్ణయుగ వైభవాన్ని శిఖరస్థాయికి చేర్చిన దిగ్దంతులలో అగ్ర తాంబూలం ఆయనదే అనడం అతిశయోక్తికాదు.

ఉషశ్రీ (మార్చి 16, 1928 – సెప్టెంబరు 7, 1990) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యులు పురాణపండ రామూర్తి, తల్లి కాశీ అన్నపూర్ణ. వారికి నలుగురు సంతానం. డాక్టర్ గాయత్రి, పద్మావతి, వైజయంతి, కళ్యాణి.

జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పని చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల ద్వారా రామాయణం, మహాభారతం మహాభాగవతం ప్రవచనం చేశారు.

ఆకాశవాణిలో పని చేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూత లూగించారు. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట.

రామాయణ భారతాలు పనికిమాలిన గ్రంథాలు అని నిరసించే హేతు వాదులనూ, అవి పరమ పవిత్రమయిన మత గ్రంథాలు అని గుడ్డిగా ఆరాధించే చాందసులను ఇద్దరినీ సమానంగా నిందించి, ఈ రామాయణ భారతాలు మానవజాతి సర్వకాలాల లోనూ సుఖశాంతులతో మనుగడ సాధించడానికి అవసరమయిన విశేషాలను అందించే గ్రంథాలు మాత్రమే అనీ, అందుచేతనే ఇవి ఇన్నివేల సంవత్సరాలు జీవించ గలిగాయనీ ఉషశ్రీ స్పష్టం చేశారు.

రేడియోలో ఉషశ్రీగా పేరొందక ముందు కవిత్వం, గేయాలు, యక్షగానాలు, ఎన్నో కధలు, నవలికలు రాసారు. ఎమెస్కో వారు కూడా ఎన్నో ప్రచురించారు. రేడియోలో వార్తలు కూడా చెప్పేవారు. రేడియో నాటకాలు రాసేవారు. రేడియో నాటకాల్లో పాల్గొనేవారు.

1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. ఆయన ఉచ్చారణ ఎంత గంభీరమో, రచనా శైలి కూడా అంతటి నారికేళపాకంగా ఉండేది.
శ్రోతలు రేడియోల ముందు నుండి కదలక ఉండేవారు. భగవద్గీతను, సుందరాకాండను పండిత పామరులను అలరించేలా, అందరికీ అర్థమయ్యేలా చేశారాయన. ధర్మసందేహాల కార్యక్రమం రేడియోలో వస్తూంటే పండిత పామరులనే బేధాల్లేకుండా రేడియోకి అతుక్కుని పోయేవారు. అయన కార్యక్రమం ప్రారంభం అయినంటే, రిక్షా కార్మికులు మొదలుకొని, రోడ్లపై నడిపేవారు కూడా ఆగి, రేడియో ఉన్న షాపు వద్ద విని వెళ్ళేవారు. రోడ్లపై జనసంచారం ఉండేది కాదు. నేటి క్రికెట్ మాచ్ కి మించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమం అది. మొదట శనివారం నాడు పది నిమిషాల కార్యక్రమంగా మొదలై తరువాత శ్రోతల కోరికపై అరగంట, ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మార్చక తప్పలేదు.

ఉషశ్రీ వాణి, ప్రత్యేకమైన బాణీ శ్రోతల్ని యెంతగా ఉర్రూత లూగించేవంటే వ్యాసపీఠం ప్రసారాల్ని నిలిపి వేసినప్పుడు రెడియో స్టషన్ యెదుట ధర్నాలు కూడా జరిగేవి. ఉషశ్రీ స్వరానికి వున్న పాపులారిటీకి అది మచ్చు తునక. దీన్ని బట్టి ఆయన కార్యక్రమాలు శ్రోతలను ఎంతగా ప్రభావితం చేశాయో స్పష్టం అవుతున్నది.

1979 లో పి.వి.ఆర్.కె ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నపుడు ఉషశ్రీ చేత భాగవతం రాయించి పాతికవేల ప్రతులు ముద్రింప జేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించారు. అయితే ఆయన రెండున్నర రూపాయలకు విక్రయించే చర్యలు గైకొనగా, తర్వాత వచ్చిన అధికారులు తొమ్మిది రూపాయలకు పెంచారు. భారతం, రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు.

దైవభక్తి, దేవుడిమీద అచంచల విశ్వాసం, జాలి, దయ, కరుణ, సున్నితత్వం, సేవా దృక్పథం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం ఆయన స్వభావం. ఆయన తనకు మాత్రమే తెల్సి ఇంకెవ్వరికీ చెప్పకుండా చేసిన సాయాలు, దానాలెన్నో. మానవ విలువలు, సంబంధాలకు ఎంతో విలువ నిచ్చేవారు. 1986-90ల మధ్య ఆంధ్రజ్యోతి, స్వాతి వారపత్రికలలో ఉషశ్రీ పాఠకుల ధర్మసందేహాలకు సమాధానాలు కార్యక్రమం నిర్వహించారు.

వీరకాకాని అంతిమ యాత్ర, భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించిన రాజమండ్రి – కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ – కమ్ రైలు వంతెన ప్రారంభోత్సవం, భద్రాద్రి రామయ్య కల్యాణం, కృష్ణా పుష్కరాల సందర్భంగా తొలి ప్రత్యక్ష వ్యాఖ్యానం లాల్ బహదూర్ శాస్త్రి హైదరాబాద్ పర్యటన సందర్భంగా చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యానం, తదితరాలు ఆయన వాగ్ధాటి, సమయస్పూర్తి, విషయ పరిజ్ఞానం, సమయోచిత సందర్భానుసార పద ప్రయోగ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. రాజాజీ ప్రసంగాలను అనువదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments