ఆయన యుద్ధ వీరుడు. సాహస సైనికుడు. సమర్థ నాయకుడు. అయిదు యుద్ధాలలో పాల్గొని, తుపాకీ గుళ్ళు శరీరంలో దిగినా, విశ్రమించని పోరాట యోధుడు. పాకిస్తాన్ యుద్ధ విజయ సారథి. ఆయనే ధైర్య సాహసాలకు మారు పేరుగా నిలిచిన భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా. అయన పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్ షా (ఏప్రిల్ 3, 1914 – జూన్ 27, 2008). 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు.
1914 ఏప్రిల్ 3వ తేదీన అమృతసర్ లోని పార్శీ దంపతులకు మానెక్‌షా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అనే చిన్న పట్టణం నుంచి అమృతసర్, పంజాబ్ రాష్ట్రంకు వలస వెళ్ళారు.
అమృతసర్, నైనిటాల్‌లలో పాఠశాల విద్య పూర్తయ్యాక డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో క్యాడెట్‌గా తొలి బ్యాచ్‌లో మానెక్ షా చేరారు.1934లో ఆయన సైన్యంలో రెండో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. జూన్ 7, 1969 న జనరల్ కుమార మంగళం నుండి 8వ సైనిక దళాల ప్రదానాదికారిగా బాధ్యతలు స్వీకరించి 15, జనవరి 1973 న పదవీ విరమణ చేసారు.
బ్రిటిష్ పాలనా కాలం మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం మానెక్‌షా- రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధి కుశలత అమోఘమైనవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగు తున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పి కొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం ‘మిలిటరీ క్రాస్’ను మృతులకు ప్రకటించ రాదన్నది నియమం. మానెక్‌షా బతికి బట్టకట్టక పోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన ‘మిలిటరీ క్రాస్ రిబ్బన్’ను తక్షణం మానెక్‌షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖం లోంచి బయట పడిన మానెక్‌షా, మరోసారి బర్మాలో జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్ళీ గాయ పడినప్పటికీ వెన్ను చూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధ ఖైదీలకు పునరావాసం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947-48లో జమ్ము కాశ్మీర్‌లో సైనిక చర్యల సందర్భంగా ఆయన తన పోరాటపటిమను మరోమారు లోకానికి చాటి చెప్పారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహ నైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దం పట్టింది. ఆ యుద్ధంలో పాక్ చిత్తుగా ఓడిపోవడమే కాదు, 45,000 మంది పాక్ సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహద పడిన సిమ్లా అంగీకారం కుదర్చడంలోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశసైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచిత రీతిలో గౌరవించింది.
1971 ఆరంభంలో తూర్పు పాకిస్థాన్ నుంచి పెద్దయెత్తున శరణార్థులు భారత్‌లోకి వస్తున్న సమస్యపై ఆ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన క్యాబినెట్ సమావేశానికి త్రివిధ దళాధిపతుల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మానెక్‌షానూ ఆహ్వానించారు.ఈ సమస్యని పరిష్కరించడానికి తక్షణం సైనికులని పంపాలన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వాతావరణం అనుకూలంగా లేదన్న కారణముతో ఒప్పుకోకుండా, వెంటనే యుద్ధానికి దిగక తప్పదంటే మానసిక లేదా శారీరక అనారోగ్య కారణాలపై రాజీనామా చేయడానికీ తాను సిద్ధమే అనడం ద్వారా తన నాయకత్వ లక్షణాలని చాటిన ఈయన, తన సమర్థ వాదనతో క్యాబినెట్‌ను ఒప్పించి 1971 డిసెంబరులో, అన్ని విధాలా సానుకూల పరిస్థితుల్ని చూసుకొని పాక్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించి, అద్భుత విజయం సాధించి చూపి తన నిర్ణయం ఎంత సరియినదో నిరూపించి వ్యూహ కర్తగా ఆయన చతురతను చాటిచెప్పిన వైనం అద్వితీయం.
మీ యుద్ధ విమానాలు నాశనం చేశాం, మిమ్మల్నందరిని మా సైనికులు చుట్టూ ముట్టి వున్నారు. లోంగిపోక పొతే నిర్ధాక్ష్యంగా చంపేస్తాం అంటూ పాకిస్తాను సైనికులని కఠినంగా హెచ్చరించి శత్రువులని లొంగదీసుకున్న గొప్ప తనం ఆయనకే సొంతం.
శాం మానెక్‌షా గొప్ప వక్త కూడా. ముక్కు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. భారత సమాజాన్ని నాయకత్వ కొరతే పట్టి పీడిస్తోందంటూ ఒక సందర్భంలో ధైర్యంగా దాపరికం లేకుండా చెప్పారు. అన్ని రంగాల్లో నాయకత్వ కొరతే దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులకు కారణమని స్పష్టం చేశారు. వృత్తిపరమైన సామర్థ్యం, విజ్ఞానం, నిజాయతీ, నిష్పాక్షికత, ధైర్యం, విశ్వసనీయత, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత – ఇవీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని వివరించి, లక్షలమంది సైనికులకు, సైనికులుగా చేరాలనుకున్న వారికే కాకుండా సామాన్యులకి కూడా స్ఫూర్తిగా నిలిచారు.
భారత్‌కు ఎన్నో విజయాలను అందించిన యుద్ధ సేనాని మానెక్ షా జూన్ 26, 2008 గురువారం అర్ధరాత్రి 94ఏళ్ల వయసుులో మృతి చెందారు.