రోదసీ కార్యక్రమంలో మరో ఇద్దరు వ్యోమగాములను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) శనివారం ప్రకటించింది. వీరిలో యూఏఈ తొలి మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. యూఏఈ తొలి వ్యోమగామిగా హజ్జా అల్-మన్సూరీని 2019లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ శనివారం ట్విటర్ వేదికగా ఇద్దరు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. నౌరా అల్-మత్రౌషీ, మహమ్మద్ అల్-ముల్లాలను వ్యోమగాములుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. 4 వేలకుపైగా దరఖాస్తుల నుంచి వీరిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. దీంతో యూఏఈ మొదటి మహిళా వ్యోమగామి (ఆస్ట్రోనాట్)గా నౌరా అల్-మత్రౌషీ రికార్డు సృష్టించారు. ఇదిలావుండగా, వీరి వివరాలను షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించలేదు. వీరిద్దరూ టెక్సాస్, హూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌లో శిక్షణ పొందుతారు.
అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహం అమల్‌ను అంగారక గ్రహం కక్ష్యలో యూఏఈ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 2024లో చంద్రునిపైకి మానవ రహిత రోదసీ నౌకను పంపించేందుకు ప్రయత్నిస్తోంది.