భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేరెన్నిక గన్న 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతావనిలో ప్రారంభం అయినా దాని ప్రభావం దక్షిణ భారతదేశానికీ విస్తరించింది. ఈ తిరుగు బాటుకు నిజాం పరిపాలనా ప్రాంతమైన హైదరాబాద్ కు సంబంధాన్ని సూచించే చారిత్రక అంశమే తుర్రేబాజ్ ఖాన్ మార్గదర్శక జీవితం. ఆధునిక మారణ ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక బలగాలున్న బ్రిటీష్ వారికి ఎదుర్కోవడం, ఎదురొడ్డి పోరాడడం ఆత్మహత్యా సదృశమని తెలియని వారుండరంటే అతిశయోక్తి కానేరదు. పోరు బాటలో మరణం పాలకులను తరిమి కొట్టేందుకు నడుం కట్టి, ఆయుధం చేతపట్టి, కదన రంగాన్ని ఎన్నుకుని పోరాడి అసువులు బాసి, అమరులైన పోరాట యోధులలో పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ ఒకడు. అందుకే చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయాడు. పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ పరాక్రమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు. ప్రఖ్యాతి చెందిన అరబ్బులు, రొహిల్లాలు గల సైనిక దళానికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్ ఖాన్, హైదరాబాద్ నివాసి పఠాన్ రుస్తుం ఖాన్ కుమారుడు. ఆయన బ్రిటిషు సైన్యంలో చేరి ఔరంగాబాదు బ్రిటీష్ కంటోన్మెంటులో జమేదారుగా పని చేశాడు.
1857లో మీరట్ లో ప్రారంభమైన తిరుగుబాటు బావుటా హైదరాబాద్ కు చేరడంతో… హైదరాబాద్లో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు, రెసిడెన్సీలో ఖైదీగా ఉన్న జమేదార్ చీదా ఖాన్ను విడిపించడానికి అవసర మైనది. చరిత్రాత్మక మక్కా మసీదు నుండి బయలుదేరి, బ్రిటిష్ ఆధిప త్యానికి చిహ్నమైన హైదారాబాద్ రెసిడెన్సీ మీద సుమారు ఐదు వందల మంది సాహసికులతో 1857జూలై 17న సాహసోపేతమైన దాడి చేశారు. రెసిడెన్సీ గోడకు సమీపంలో ఉన్న రెండు ఇళ్లను ఖాళీ చేయించి అందులో నుంచి గోడను ధ్వంసం చేసి రెసిడెన్సీలోకి ప్రవేశించారు. వీరి వెంట ఐదు వేలకు పైగా రొహిల్లాలు, అరబ్లు, విద్యార్థులు, ఇతర సామాన్యులూ ఉన్నారు. కానీ, దాడి గురించిన సమాచా రాన్ని నిజాం మంత్రి తురబ్ అలీ ఖాన్ బ్రిటీషర్లకు చేర వేయడంతో గోడను ధ్వంసం చేసి రెసిడెన్సీలోకి తుర్రెబాజ్ సారథ్యంలో తిరుగు బాటు దారులు ప్రవేశించగానే బ్రిటీష్ సైన్యం సాయుధులై ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారు. జులై 17 సాయంత్రం ఆరు.. ఏడు గంటల ప్రాంతంలో మొదలైన ఈ పోరాటం తెల్లవారు జామున నాలుగు గంటల వరకు జరిగింది.
దాడిలో పలువురు సహచరులను కోల్పోయిన ఖాన్, బ్రిటిష్ – నిజాం బలగాలకు 1857 జూలై 22న పట్టు బడ్డారు. ఆయనకు ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విధించి, యావదాస్తిని పాలకులు స్వాధీనం చేసుకున్నారు. కాపలాగా పెట్టిన సెంట్రీలలో కూడా మాతృభూమి పట్ల అభిమానాన్ని ప్రేరేపించి, వారి సహకారంతో 1859 జనవరి 18న జైలు నుండి తప్పించు కున్నాడు. ఆగ్రహించిన ప్రభుత్వం తుర్రేబాజ్ ఖాన్ను పట్టితెచ్చిన వారికి 5వేల రూపాయల నగదు నజరానాను జనవరి 19న ప్రకటించింది. నిజాం నవాబు ప్రకటించిన నజరానాకు ఆశపడిన కుర్బాన్ అలీ అనే నమ్మక ద్రోహి తుర్రేబాజ్ ఖాన్ ఆచూకిని బహిర్గతం చేశాడు. ఆ సమాచారంతో 1859 జనవరి 24న, మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ అను గ్రామం మీద నిజాం, బ్రిటిష్ సైన్యాలు విరుచుకు పడ్డాయి. పోరాటంలో శత్రువు తుపాకి గుండ్లకు తుర్రేబాజ్ ఖాన్ గురైనాడు. తరువాత ఆ యోధుని మృత దేహాన్ని బ్రిటిషు సైన్యాలు హైదారాబాద్ కు తరలించాయి. ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు జరపకుండా ఇనుప సంకెళ్ళతో కట్టేసి ప్రస్తుతం సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఉన్న చోట, ఇలాంటివి పునరావృతం కాకుండా, స్థానికుల్లో భయాందోళనలు కలిగించేందుకు బహిరంగంగా వేలాడ దీశారు. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర పుటలలో స్థానం పొంది అమరుడై, చిరస్మరణీయుడైన తుర్రేబాజ్ ఖాన్ పఠాన్, శ్రీ మౌల్వీ అల్లావుద్దీన్ తదితర యోధుల దాడి సంఘటనలకు గుర్తుగా, వీరయోధుల స్మారకార్థం, హైదరాబాదు నగరం నడి బొడ్డున గల కోటిలోని సిటీ బస్టాండు వద్ద (అది అనాటి రెసిడెన్సీ ప్రాంతం) స్వతంత్ర భారత ప్రభుత్వం 1957లో స్మారక స్థూపాన్ని నిర్మించింది. అలాగే కోటి విమెన్స్ కాలేజీ నుంచి పుల్లి బౌలీ ఎక్స్ రోడ్ వరకు ఉన్న దారికి తుర్రెబాజ్ ఖాన్ పేరు పెట్టారు. కానీ, దాన్ని ఆ పేరుతో వ్యవహరించడం మరిచి పోవడం జరిగింది. స్థానిక పోరాట యోధుడి గురించి స్మరించడం, పాఠ్యాంశాల్లో చేర్చడం, భావి తరాలకు తెలియ చేయడం అత్యవసరం.
