నగదు దోచుకుని..రైలు నుంచి తోసేసి
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగుల దుశ్చర్య
గుంతకల్లు: గుర్తుతెలియని దుండగులు ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని కదిలే రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగుళూరు నుంచి నాందేడ్‌కు వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరాడు.
రైలు తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌కు రాగానే గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతని వద్దనున్న రూ.50వేలు లాక్కొని రైలులో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని తిమ్మనచర్ల గ్రామస్థులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వైద్యులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందజేశారు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
