అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో ఆయనను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్న ప్రతిభాశాలి ఆయన. భాషాపరంగా ఆయన సంప్రదాయ బద్ధుడైనా భావనా పరంగా ఆధునికులు. అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి. ఆయనే అభినవ తిక్కన బిరుదాంకితుడు తుమ్మల సీతారామ మూర్తి. సౌమ్యశీలి, నిరాడంబరుడు, గాంధేయ వాది, తెలుగు రైతుబిడ్డ, ఆధునిక పద్య కవుల్లో అన్నింటా ముందుండి తెలుగు భాషానురక్తి కలిగిన మహా కవి.
తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25 న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించారు. “మహాత్ముని ఆస్థానకవి” అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ, మహాత్మ కథ వంటి ఆదర్శ ప్రౌఢ కావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్ర గానము, ఉదయ గానము, పఱిగ పంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు.
1930లో ఆయన ఆంధ్ర విశ్వ విద్యాలయము నుండి ప్రథమ శ్రేణిలో ఉభయ భాషా ప్రవీణ పట్టాను అందుకున్నారు. చదువు పూర్తయ్యాక, తన స్వగ్రామం కావూరు లోని తిలక్ జాతీయ పాఠశాలలో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పని చేసారు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డులోని దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసారు. 1920 – 1930 మధ్య కాలంలో కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1922లో జైలుశిక్ష అనుభవించారు.
1928లో తుమ్మల ‘ఆత్మార్పణము’ అనే కావ్యాన్ని రచించారు. 1938 లో ‘సోదరా లెమ్ము, నీ హక్కులందు కొమ్ము’ అని ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం తన ‘రాష్ట్ర గానం’ ద్వారా తెలుగువారిని వెన్ను తట్టి లేపారు. తెలుగువారి పూర్వవైభవాన్ని ఎలుగెత్తి చాటి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రబోధించారు. 1840లో ధర్మజ్యోతి అనే ఒక గాథను,1943లో ‘పఱిగి పంట’, 1950లో గాంధీజీ ఆత్మకథకు పద్య అనువాదమైన ‘ఆత్మకథ’ను రచించారు. 1953లో ‘ఉదయగానం’ గావించారు. 1955లో ‘శబిల’ అనే ఖండ కావ్యాల సంపుటిని వెలువ రించారు. తెలుగు సాహిత్య సరస్వతికి శిరోభూషణమైన ‘సంక్రాంతి తలపులు’ ఈ సంపుటి లోనివే. 1957లో ‘గీతాధర్మము’ పేరుతో భగవద్గీతకు అనువాదం చేశారు. భర్తృహరి నీతి శతకాన్ని ‘తెలుగు నీతి’ పేరుతో తెనిగించారు. ‘సర్వోదయ’ సిద్ధాంతాన్ని విశదీకరిస్తూ 1960లో ‘సర్వోదయ గానం’ చేశారు. 1963లో తన అభిరుచులు, ఆదర్శాలు, అనుభవాలు వెల్లడి చేస్తూ ‘నేను’ అనే కావ్యాన్ని,1964లో ‘పైరపంట’, 1967లో ఆదర్శ ప్రాయులైన కొందరు త్యాగ ధనుల గుణగణాలను విశదీకరిస్తూ ‘సమదర్శి’ రచించారు.
తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలుంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మ ప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగు వాడననే అభిమానం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించి పోయేవారాయన. కాల్పనిక వాదం, మానవీయత, దేశభక్తి అనే మూడు ప్రధాన అంశాలతో సీతారామ మూర్తి గారు తన రచనలను కొనసాగించారు. అనేక నాటకాలు, హరికథలు కూడా రచించారు.
తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ, ఘన సన్మానం చేసి ‘అభినవ తిక్కన’ అనే బిరుదును ఇస్తే, వినయ పూర్వకంగా, తాను తిక్కన అంత ఘనుణ్ణి కాదని, ‘తెలుగు భాషకు సేవకుడను’ అనే అర్థం వచ్చేలా ‘తెనుగు లెంక’ అని పేరు పెట్టుకున్న మహాకవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి.
రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి, తెలుగు నుడికారానికి ప్రాణంపోసి, తెనుగు దనానికి నిర్వచనంగా నిలిచిన తుమ్మలను కొంగర జగ్గయ్య ‘కళా తపస్వి’గా సంభావించారు. ఒకనాడు వెండి తెర నాయకుడైన చిత్తూరు నాగయ్యకు తుమ్మల అభిమాన కవి.
1949 నిడుబ్రోలులో – గజారోహణము, గండ పెండేరము, కనకాభిషేకము, సువర్ణ కంకణము;
1960లో అఖిల భారత తెలుగు రచయితల మహాసభ సత్కారము; 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వ ప్రదానము; 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహు మానము; 1969లో ఆంధ్ర విశ్వ విద్యాలయము “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కారము; 1984 మద్రాసులో శ్రీ ఎల్. వి. రామయ్య చారిటీస్ జాతీయకవి అవార్డు; 1985 లో నాగార్జున విశ్వ విద్యాలయం నాగార్జున విశ్వ విద్యాలయము “డాక్టర్ ఆఫ్ లెటర్స్” (డి.లిట్) బిరుదుతో సత్కారము పొందారు.
నాటి యువ కవులను ఉద్దేశించి…వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.’ అని తుమ్మల వ్యక్త పరిచిన అభిప్రాయం నేటికీ అక్షరాలా వాస్తవమని అనిపించక మానదు.
1990 మార్చి 21 న గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామాలో తుమ్మల సీతారామమూర్తి మరణించారు.
ఇరవై నాలుగు వేల పద్యాలు వ్రాసినా, ఆయన సాహిత్యం నిరాదరణకు గురవడం శోచనీయం. విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆయన రచనలు ఉండక పోవడం తెలుగు సాహిత్యాభిమానులకు బాధాకరం.