వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి భారతా వనిలో సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. రెండేసి నెలల చొప్పున వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అని సంవత్సరకాలాన్ని ఆరు ఋతువులుగా విభజించారు.
నిజానికి వేద వాఙ్మయంలో ప్రాచీనమైన ఋగ్వేదంలో ఆరు ఋతువుల ప్రస్తావన లేదు. ఋగ్వేదంలోని పదవ మండలం లోని పురుష సూక్తంలో ఋతువుల పేర్లు కనిపించే ఈ శ్లోకం చూడండి: “యత్ పురుషేణ హవిషా, దేవా యజ్ఞమతన్వత, వసంతో అస్యాసీద్ ఆజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ హవి” (ఋగ్వేదం10.90.6). పురుషుడే హవిస్సుగా దేవతలు చేసే సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే, గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి. వసంతం, గ్రీష్మం, శరత్తు ఈ మూడు ఋతువుల పేర్లు తప్ప ఋగ్వేదంలో ఇతర ఋతువుల ప్రస్తావన కనిపించదు. కృష్ణ యజుర్వేదంలో కనిపించే ఈ కింది శ్లోకంలో పంచభూతాలవలే సంవత్సరంలో ఋతువులు కూడా అయిదు అన్న వివరణ కనిపిస్తుంది. “పంచ వా ఋతవః సంవత్సరస్ ఋతుష్వేవ సంవత్సరే ప్రతి తిష్ఠంతి” (యజుర్వేద 7.3.8). కృష్ణ యజుర్వేదానికే సంబంధించిన తైత్తిరీయ బ్రాహ్మణంలో అయిదు ఋతువుల వివరాలతో సంవత్సరాన్ని పక్షితో పోల్చుతూ చేసిన ఈ అందమైన వర్ణన ఉంది:
“తస్య తే వసంతః శిరః; గ్రీష్మో దక్షిణః పక్షః । వర్షాః పుచ్ఛం; శరద్ ఉత్తరః పక్షః; హేమంతో మధ్యం”॥ (తై. బ్రా. 3.10.4.1). సంవత్సర మనే పక్షికి వసంతం శిరస్సు అయితే, గ్రీష్మం కుడి రెక్క; వర్షం తోక; శరత్తు ఎడమ రెక్క; హేమంతం మధ్యభాగం. అంటే, ఋగ్వేదలోని మూడు ఋతువులకు వర్ష ఋతువు, హేమంత ఋతువు ఈ కాలానికి జత చేయ బడ్డాయి. ఆరు ఋతువుల ప్రస్తావన మనకు తెలిసినంత వరకూ తైత్తిరీయ సంహితంలో (తైత్తిరీయ సంహితం, తైత్తిరీయ బ్రాహ్మణం తరువాతి కాలంలో వెలువడింది) మొదటి సారి కనిపిస్తుంది. “మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతూ శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మా వృతూ నభశ్చ నభస్యశ్చ వార్షికా వృతూ ఇషశ్చోర్జశ్చ శారదా వృతూ సహశ్చ సహస్యశ్చ హైమంతికా వృతూ తపశ్చ తపస్యశ్చ శైశిరా వృతూ” (తైత్తిరీయ సంహత 4-4-11). మధు మాధవ మాసాలు వసంత ఋతువు. శుక్రము శుచి మాసాలు గ్రీష్మర్తువు. నభము, నభస్యము, వర్షర్తువు, ఇషము, ఊర్జము శరదృతువు. సహము, సహస్యము హైమంతిక ఋతువు. తపము, తపస్యము శైశిర ఋతువు. మనం ఇప్పుడు చెప్పుకొనే చైత్రం, వైశాఖం అన్న 12 మాసాల పేర్లు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. వాటికి మారుగా, మధు, మాధవ, శుక్ర, శుచి, ఇషము, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అన్న పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు వాడే చైత్రం, వైశాఖం అన్న పేర్లు నక్షత్రాలకు సంబంధించినవి. నక్షత్రాల ఆధారంగా చంద్రుని గమనాన్ని పరిశీలిస్తే చంద్రుడు ఒక నక్షత్ర కూటమి నుండి బయలు దేరి మళ్ళీ అదే నక్షత్ర కూటమిని చేరుకోవ డానికి దాదాపు 27రోజులు పడుతుందని తెలుస్తుంది. దీన్ని నాక్షత్రిక మాసం అంటారు. ఈ 27 రోజుల్లో చంద్రుడు దాటే ఒక్కొక్క నక్షత్ర కూటమికి ఒక్కో పేరు చొప్పున అశ్వని, భరణి మొదలైన 27 నక్షత్రాల పేర్లు ఏర్పాటు చేసారు. ఆపైన, ప్రతి మాసంలో నిండు పున్నమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రపు వృద్ధి రూపమే ఆ మాసానికి పేరుగా ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ రకంగా చిత్త నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ మాసం చైత్ర మాసంగా, అలాగే, విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తే వైశాఖంగా పిలువ బడింది. ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా విభజన చేసి వాటిని కార్తెలు అని అన్నారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు 2 వారాల పాటు ఉంటాడు కాబట్టి ఒక్కో కార్తె సుమారుగా 13 రోజులు ఉంటుంది. అశ్వని కార్తె మొదలు రేవతీ కార్తె వరకూ సాగే ఈ కార్తెల విభజన వ్యవసాయ దారులకు చాలా ఉపయోగకరం. భారత దేశంలో ఆచరణలో ఉన్నవి ఆరు ఋతువులు.
వసంత ఋతువు: చైత్రం, వైశాఖం
సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; చెట్లు చిగురించి పూవులు పూ స్తాయి. వివాహాల కాలం ,ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి; గ్రీష్మ ఋతువు: జ్యేష్టం, ఆషాఢం బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, ఎండలు మెండుగా ఉంటాయి. వట పూర్ణిమ, రధాయాత్ర, గురు పూర్ణిమ; వర్ష ఋతువు: శ్రావణం, భాద్రపదం చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి,వినాయక చవితి, ಓಣಂ. శరదృతువు: ఆశ్వయుజం, కార్తీకం. తక్కువ ఉష్ణోగ్రత, దసరా నవరాత్రి, విజయ దశమి, దీపావళి, శరద్ పూర్ణిమ బిహు, కార్తీక పౌర్ణమి; హేమంత ఋతువు: మార్గశిరం, పుష్యం. చాలా తక్కువ
ఉష్ణోగ్రతలు (20-25) మంచు కురిసి, చల్లగా నుండు కాలము.
పంటలు కోతల కాలం. భోగి, సంక్రాంతి, కనుమ; శిశిర ఋతువు: మాఘం, ఫాల్గుణం, బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10
డిగ్రీల కంటె తక్కువ, ఆకురాల్చు కాలం, ఉగాది, వసంత పంచమి, రథసప్తమి/మకర
సంక్రాంతి, శివరాత్రి, హోళీ…
భారతీయ పురాణాలలో, శరదృతువు సరస్వతి దేవతకి ఇష్టపడే కాలంగా పరిగణించ బడుతుంది, దీనిని “శరదృతువు దేవత” (శారద) అని కూడా పిలుస్తారు. అలంకార శాస్త్రం నిర్దేశించిన అష్టాదశ వర్ణనల్లో ఋతు వర్ణన ప్రథానమైనది కాబట్టి మన తెలుగు కావ్యాలలో కూడా సాంప్రదాయికంగా ఈ ఆరు ఋతువుల వర్ణనే కనిపిస్తుంది. ఈ ఏడు అధిక మాసం వచ్చినందున, శరదృతువు సెప్టెంబర్ 18తో ప్రారంభమై, డిసెంబర్ 14తో ముగుస్తుంది.