5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleLife styleసత్యాహింసల మార్గదర్శి వర్ధమాన మహావీరుడు

సత్యాహింసల మార్గదర్శి వర్ధమాన మహావీరుడు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

వేద యుగంలో పెరిగిన జీవహింస, ఖర్చుతో కూడిన యజ్ఞ యాగాలు, క్రతువులు, సమాజంలో పేరుకు పోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు ఆలోచనా పరులైన కొద్దిమందిలో జిజ్ఞాసను రేకెత్తించాయి. వీటిని అధిగమించడానికి అజీవకులు, చార్వాకులు, జైన, బౌద్ధ మత కర్తలైన… మహావీరుడు, బుద్ధుడు వంటివారు క్రీ.పూ 6వ శతాబ్దంలో భావవికాసానికి నాంది పలికారు.

జైన మతాన్ని అనుసరించేవారు జైనులు. జినులు అంటే కోరికలను జయించి వారు అని అర్థం. జైన మతాన్ని వృషభ నాథుడు స్థాపించగా, ఇది ‘జిన’ (విజేత) అనే పదం నుంచి వచ్చింది. జైన మత గురువులను తీర్థంకరులని పిలుస్తారు. తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు. జైనమతంలో తొలి తీర్థంకరుడు వృషభ నాథుడు కాగా, ఆయన గురించి ఋగ్వేదంలో పేర్కొన బడింది. అంతే కాదు విష్ణు పురాణం, భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించ బడ్డాడు. దీనిని బట్టి జైన మతం ఋగ్వేద మతం అంతటి ప్రాచీనమైంది. ఇక, చిట్ట చివరి ఇరవై నాలుగో తీర్థంకరుడు వర్థమాన మహావీరుడని జైనుల విశ్వాసం.

బీహార్ లో వైశాలికి సమీపములో కుండ గ్రామంలో క్రీ.పూ. 599 లో (అధిక సంఖ్యాకుల విశ్వాసం) క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. కొందరు జైనులు మాత్రం మహవీరుడు క్రీస్తు పూర్వం 599లో జన్మించాడని నమ్ముతుండగా, మరి కొందరు క్రీస్తు పూర్వం 615లో జన్మించాడని భావిస్తున్నారు. అయితే ఇందులో దేనికీ స్పష్టమైన ఆధారాలు లేవు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం 13వ రోజున అంటే చైత్ర శుక్ల త్రయోదశి రోజున మహావీరుడు జన్మించారు. అల్లారు ముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ ఏట మరణిం చారు. యశోధరను వివాహమాడి, ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత తన రాజ్యాన్ని 30 సంవత్సరాల పాటు పరిపాలించిన మహవీరుడు అకస్మాత్తుగా తన సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచి పెట్టి సత్యాన్వేషణ కోసం స్వయం గా బయలు దేరాడు. తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుని శిష్యునిగా ఉన్నాడు. 36 వ ఏట సన్యాసాన్ని స్వీకరించి, వర్ధమాను డు ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద వైశాఖ మాసం పదమూడో రోజున జృంభిక గ్రామంలో జ్ఙానోదయం కలిగింది. తద్వారా తపోసిద్దిని పొందాడు. తదనంతరం… వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహా వీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధిం చిన వివరాలు వెలుగు చూశాయి. 32ఏళ్ళ పాటు అహింసా ధర్మము తో ప్రచారం జరిపిన మహావీరుడు తన 72వ ఏట క్రీ.పూ.527లో పావాపురిలో దేహాన్ని త్వజించాడు.

మహావీరుని బోధనలు: 1. వైదిక కర్మలు చేయడం, దేవుణ్ని వేడు కోవడం వల్ల మనిషికి ఉపయోగం లేదు. 2. చెడు చేయకుండా మంచి జీవితాన్ని గడపడమే మోక్ష మార్గం. 3. జైనమత ప్రకారం ‘ఆత్మ’ ప్రాణులకే కాదు, ప్రతి వస్తువులోను ఉంటుంది. దేవుడితో నిమిత్తం లేదు. 4. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర- మోక్ష మార్గాలు. వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. (సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడి) 5. పార్శ్వ నాధుడు ప్రతిపాదించిన సత్య, అహింస, అపరిగ్రహ, అనస్తేయ అనే నాలుగు మూల సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్య సూత్రాన్ని అదనంగా జోడించాడు. వీటిని ‘పంచానువ్రత’ అని పిలుస్తారు.

పార్శ్వనాధుడు శ్వేతాంబర వాదాన్ని, మహావీరుడు దిగంబర వాదాన్ని సమర్థించారు.
మహావీరుని అనుచరులను నిగ్రంధులు అంటారు (బంధాల నుంచి విముక్తి పొందిన వారు).

జైనులు పూజించే స్త్రీ దేవతను ‘విద్యాదేవి’ అని పిలుస్తారు. జైన మతంలో సల్లేఖనం (శరీరాన్ని క్షీణించుకొని మరణించడం) ద్వారా పరమపదం చేరుకోవడం ఆచారం. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం ద్వారా పరమపదించాడు. భారతీయ వాస్తు – శిల్ప కళాభివృద్ధికి జైనమతం గొప్ప సేవ చేసింది. మహావీరుడు సాధారణంగా కూర్చొని లేదా నిలబడి ధ్యాన భంగిమలో, అతని క్రింద ఉన్న సింహం చిహ్నంగా చిత్రీకరించ బడింది. ఉత్తర భారతదేశం లోని మధురలోని పురావస్తు ప్రాంతాల నుండి అతని మొట్టమొదటి విగ్రహాన్ని క్రీ.పూ 1వ శతాబ్దం నుండి క్రీ. శ. 2వ శతాబ్దంకి చెందినది. అయన పుట్టిన రోజును మహావీర్ జయంతిగా జరుపు కుంటారు. ఆయన మోక్షంను జైనులు దీపావళిగా గుర్తించారు.

చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సత్యం, అహింస, ప్రేమ మార్గాన్ని చూపించిన మహావీరుని జయంతి సందర్భంగా జైన మతానికి చెందిన వారు వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మహవీరుని ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. దీని ద్వారా మహవీరుని సందేశాన్ని తెలియ జేయడానికి ప్రయత్నిస్తారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments