ఉప్పొంగిన పెన్‌గంగ –

Date:


– నదీతీర ప్రాంతాలను ముంచెత్తిన వరద
– శ్రీరాంసాగర్‌లోకి భారీగా నీరు
– చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
– ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి
– గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
– తగ్గుతున్న గోదావరి
– గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
నాలుగు రోజులుగా ఎడతెరపివ్వకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది. అలాగే, వాగులు ప్రవహిస్తుండగా.. చెరువులు, కుంటలు నిండాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. పంట పొలాలు వరదతో నిండాయి. రోడ్లపై గుంతల్లో నీరు చేరి కుంటలను తలపిస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. గోదావరి ప్రవాహం పెరిగి కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ప్రవహిస్తున్న పెన్‌గంగా నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకొని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆయా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. కిందటేడాది కడెం ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితిని తలపించగా.. ఈసారి 14గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేకపోయినా వరద ఉధృతి మాత్రం భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క భీంపూర్‌ మండలం వడూర్‌ గ్రామానికి చెందిన దాదిబా.. పెన్‌గంగా నదిలో కొట్టుకుపోతుండగా స్థానికులు కుషాల్‌, శ్రీనివాస్‌ సాహసం చేసి వెంటనే అతన్ని కాపాడారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం బంగారిగూడ వాగులో ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకురావడం కలకలం రేపింది. నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండటంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లకపోవడంతో పత్తి, సోయా పైర్లు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, ప్రతినిధులు పెన్‌గంగా నది పరివాహక ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు.
పెరుగుతూ.. తగ్గుతున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి శనివారం ఉదయం 7 గంటలకు 39.4 అడుగుల వద్ద ప్రవహించగా.. సాయంత్రం 7 గంటలకు 40.8 అడుగులకు చేరింది. పెరుగుతూ తగ్గుతూ ప్రవహిస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడూ వరదను అంచనా వేస్తున్నారు. గోదావరి వరదలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ మంత్రికి ఫోన్‌ చేసి గోదావరి వరదలపై ఆరా తీశారు.
గిరిజన గ్రామాల్లో వైద్యశిబిరాలు
ములుగు జిల్లాలో గోదావరి ఉధతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ నుంచి 61,9370 కూసెక్కులు, ఇంద్రావతి బ్యారేజ్‌ నుంచి 246220 క్యూసెక్కుల నీరు తుపాకుల గుడెం సమ్మక్క సారక్క బ్యారేజ్‌కి వచ్చి చేరుతుండటంతో 59 గేట్లు ఎత్తి 865590 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయిలో వరదలు తగ్గుముఖం పట్టేవరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అలాగే వరద వచ్చి తగ్గిన ప్రాంతాల్లో, ప్రజల నివాస ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం, వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెంకటాపురం మండలంలోని సీతారాంపురం, కలిపాక, కొత్తగుంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. జ్వరాలు ఉన్న గ్రామాల్లో ఇంటి, ఇంటి సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు.
శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి మూడ్రోజులుగా భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన మహారాష్ట్రలో కుండపోత వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 54.387 టీఎంసీలకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిస్థాయి 1080.70 అడుగులకు చేరింది. మహారాష్ట్రకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరదకు తోడు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ను నిలుపుదల చేశారు.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం 9.81 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కళ్యాణి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. వరద గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సింగితం రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్లకుగాను ప్రస్తుతం నిండుకుండలా మారింది. 916 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జలపాతాల సవ్వడులు
మహబూబాబాద్‌ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. బయ్యారంలో ఏడు బావులు, మినీ బొగత, పెద్ద గుట్ట జలపాతాలు, గూడూరు మండలంలో భీముని పాదం జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ జలపాతాలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...