బాల సాహిత్య రచయితల్లో ప్రథముడిగా, ప్రముఖుడిగా భావిం చ బడతారు గిడుగు వెంకట సీతాపతి.1800 సంవత్సరానికి పూర్వం బాల సాహిత్యమనేది ఎక్కువగా కనిపించేది కాదు. ఉన్నా అది లిఖితం కానిదే. జానపద సాహిత్యంలో అంతర్భాగమై ఉండేది. 1819లో పిల్లల కోసం విక్రమార్కుని కథలు పుస్తకం అచ్చయ్యింది. ఆనాటి నుంచి బాలసాహిత్యం ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన సాహిత్యంగా వచ్చింది. 20వ శతాబ్ది ప్రారంభంలో అధునిక తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రి యలు ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావ కారణంగా పరిణమించినట్లే బాలసాహిత్య ప్రక్రియ కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల వచ్చింది. పిల్లలు చదివి అర్థం చేసుకో గల సాహిత్యం ఈ వికాస దశలోనే వెలువడింది. బాల సాహిత్యంతో గిడుగు వెంకట సీతాపతికి విడదీయ రాని సంబంధం ఉంది.
సీతాపతి 1885వ సంవత్సరం జనవరి28 వ తేదీన విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తెలుగు వ్యావ హారిక భాషోద్యమసారధి అయిన గిడుగు వెంకటరామ మూర్తి దంప తులకు జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్ట భద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్ర ఉపన్యాసకులుగా పని చేశారు. వ్యావహారిక భాషోద్యమం లోను, సవర భాషోద్దరణ లోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషా నుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలన చిత్రాల్లోను మరియు కొన్ని నాటకా ల్లోను నటించారు. మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలు వడిన ఆంధ్ర సర్వస్వానికి అనేక వ్యాసాలు రాశారు. తెలుగులో భాషాసమితి ఏర్పడినప్పుడు తెలుగు విజ్ఞాన సర్వస్వానికి ప్రధాన సంపాదకుడిగా నియమితు లయ్యారు. చరిత్ర – రాజనీతి శాస్త్ర సంపుట సంపాదక వర్గంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యరాయాం ధ్ర నిఘంటువు చివరి దశలో ఆయన సంపాదకత్వం వహిం చారు. ఆయన రచనల్లో ముఖ్య మైనవి భారతీ శతకం, సరస్వతీ విలాసం, కొద్దిమొర్ర కువలయావళీ నాటిక మొదలై నవి. బైబిల్ మూడు సువార్తల్ని సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్థనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. ” తెలుగులో చంధోరీతులు’ అనే గ్రంథానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి పురస్కా రం లభించింది. ఆయనను ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళా ప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. గిడుగు ఇంగ్లీషు రచనల్లోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ అకాడమీ డి.లిట్ ప్రదానం చేసింది.
సీతాపతి రాసిన రచనలన్నీ ఒక ఎత్తు కాగా, బాలల కోసం సృష్టించిన సాహిత్యం మరొక ఎత్తు. ఈయన చిలకమ్మ పెళ్లి, ఎలుకా – పిల్లి, రైలుబండి, ఈగా-సాలీడు మొదలైన రచనలు 1907-1909 మధ్యకాలంలో ‘వివేకవతి’ పత్రికలో ప్రచురిత మయ్యాయి. ఆనాడు బాలగేయాలకు అసలు ఆదరణే వుండేది కాదు. రాతలు కాకుండా పిల్లలు మెచ్చేవి చిరకాలం మనసు లో నిలిచే కథలు, కబుర్లు తేలిక భాషలో చెప్పాలనేవారు సీతాపతి. తర్వాత 1940 సంవత్సరంలో సీతాపతి ”భారతి’ సాహిత్య మాస పత్రికకు సంపాదకులై నప్పుడు బాలలకోసం ఉపయుక్త రచనలు చేయమని కవులకు, రచయితలకు ప్రబోధించారు. అలా ప్రేరేపితులైన,
నూతనోత్సాహ భరితులైన కవులు, రచయితలు బాలల కోసం రాసిన గేయాల్ని గేయకథల్ని, చిన్న కథల్ని 1955 సంవత్సరంలో ‘బాలానందం’ అనే అనే శీర్షికతో పుస్తకరూపంలో ముద్రించారు. 1958 సం.లో బాలవినోదం అనే గేయసంపుటాన్ని ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన బాలసాహిత్య రచనాల యాల్ని నిర్వహించి యువ రచయితలకు శిక్షణ కూడా యిచ్చా రు. ఎందరో, కవులకు రచయిత లకు మార్గ దర్శకులయ్యారు.
పల్నాటి యుద్ధం(1947), భక్తి మాల(1941), రైతు బిడ్డ(1939), పంతులమ్మ(1943), మాలపిల్ల (1938) తదితర తెలుగు సినిమా లలో నటించారు. ఆయన ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో తుది శ్వాస విడిచారు.