Wednesday, August 10, 2022
HomeNewsదేశం గర్వించదగ్గ అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న

దేశం గర్వించదగ్గ అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న

రాజారామన్న, (జనవరి 28, 1925) – సెప్టెంబర్ 24, 2004) భారత అణు శాస్త్రవేత్త. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో డాక్టర్ రాజారామన్న ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అణు శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి చెందిన దేశంగా మన దేశానికి గుర్తింపు తేవడంలో రామన్న పాత్ర అద్వితీయం.

కర్ణాటకలోని మైసూర్లో 1925 జనవరి 28నాడు జన్మించిన రాజా రామన్న ప్రాథమిక విద్యాభ్యాసం మైసూర్ లోనే చేశారు. తరువాత బెంగళూర్, మద్రాసు నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి లండన్లోని కింగ్స్ కాలేజి నుండి మాలిక్యులర్ ఫిజిక్స్ లో పిహెచ్.డి. చేశారు. 1949లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు, డా.హోమీ జహంగీర్ భాభా సహచర్యం రాజారామన్నను ఎంతగానో ప్రభావితం చేసింది.

తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ బాధ్యతలను డా. హోమీ భాభా డా.రాజా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం హోమీ భాభా మరణం తరువాత అటామిక్ ఎనర్జీ కమీషన్ ఛైర్మన్ గా, అటామిక్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ సెక్రటరీగా డా.రాజారామన్నను నియమించింది.1972 నుండి 1978 వరకు, మళ్ళీ 1981 నుండి 1983 వరకు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1978 నుండి 1981 వరకు, రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు పదవిలో ఉన్నారు.

ఇందిరా గాంధీ హయాంలో భారత దేశం 1974 మే 18 తేదీన జరిపిన అణు పరీక్ష అప్పట్లో ఒక సంచలనం. దాని వెనక రామన్న కృషి అసమానం. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశపు మొట్టమొదటి భూగర్భ అణు పేలుడులో రాజా రామన్న కీలక పాత్ర పోషించారు. అణు పేలుడు పరికరం తయారీకి వెళ్ళే వివిధ విభాగాలలో నైపుణ్యం ఉన్న అనేక బృందాలను ఆయన కలిసి తీసుకు వచ్చారు. రాజస్ధాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద జరిపిన ఈ అణు పరీక్ష ఫలితంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇండియాపై ఆంక్షలు విధించాయి. ఇండియా పట్ల అణు అంటరాని తనాన్ని పాటించాయి. తాము ఒక పక్క అణ్వస్త్రాలను గుట్టలుగా పేర్చుకుంటూనే ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చు కోవడానికి వీలు లేదని శాసించాయి.

భారత దేశ మొట్ట మొదటి అణు బాంబు నిర్మాణం దేశంలో కూడా రహస్యంగానే సాగింది. బాంబు రూపకల్పన, నిర్మాణం, పరీక్షలలో పాల్గొన్న 75 మంది శాస్త్రవేత్తలకు (బార్క్ అధిపతి రాజా రామన్న నాయకుడు) తప్ప భారత మంత్రులకు ఎవరికీ బాంబు నిర్మాణం అవుతున్న సంగతి తెలియదు. శాస్త్రవేత్తలు కాకుండా భారత ప్రధాని ఇందిరాగాంధి, ఆమె సలహాదారు మరియు అప్పటి మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి పి.ఎన్.హక్సర్, అప్పటి ప్రిన్సిపల్ కార్యదర్శి డి.పి.ధర్ లకు తప్ప రక్షణ మంత్రికి కూడా బాంబు సంగతి తెలియదు. 1972 సెప్టెంబరులో బార్క్ సందర్శించిన ఇందిర నోటిమాటతో బాంబు నిర్మాణానికి, పరీక్షకు ఆదేశాలు ఇచ్చారని భావించ బడింది. 1997లో డాక్టర్ రాజా రామన్న స్వయంగా పోఖ్రాన్ లో పేల్చింది అణు బాంబే అని చెప్పేవరకూ అధికారికంగా దాని గురించి తెలియక పోవడం గమనార్హం.

1989 టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్ నుండి ఆర్థిక సహకారం అందడం వలన డా. రాజారామన్న బెంగుళూర్ లో పరిశోధన సంస్థను స్థాపించారు.
రామన్న చేసిన అసమాన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ (1968), పద్మభూషణ్ (1973), పద్మ విభూషణ్ (1975) అవార్డులు రామన్నను వరించాయి. 2004, సెప్టెంబర్ 24 న మరణించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments