Wednesday, November 30, 2022
Homespecial Editionఅజరామరం ఆ గానం

అజరామరం ఆ గానం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతావనిలో ఎందరో గాయకులు ఉద్భవించారు. ఎందరో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కాని సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన ఘనత ఘంటసాల మాస్టారుకే దక్కుతుంది. ప్రముఖ గాయకులుగా, తెలుగు సినీ సంగీత దర్శకులుగా, జైలు కెళ్ళిన స్వాతంత్ర్య సమర యోధులుగా ఎనలేని కీర్తినార్జించిన గాన గంధర్వుడు తెలుగువాడు కావడం గర్వకారణం. 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీప చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మలకు జన్మించిన వేంకటేశ్వరరావు నామాంకితుడైన ఘంటసాల, బాల్యం నుండే సంగీతం పట్ల మక్కువ కలిగి ఉన్నారు. కచేరీలలో తండ్రి మృదంగం సహకారం అందించడానికి వెళుతూ, కుమారుడిని భుజంపై ఎత్తుకుని పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళేవారు. కచేరీలలో నాట్యం చేస్తూ, బాల భరతుడు అనిపించు కున్నారు, తాము గొప్ప సంగీత విద్వాంసుడు కావాలనే తమ 11వ ఏట మరణించిన తండ్రి ఆకాంక్షను సాకారం చేయ దృఢ సంకల్పులై, ఒకసారి ఒక సంగీత కచేరీలో పోటీపడి ఓటమి చెందగా, పట్టుదల మరింత పెరిగి, గురుకులాలలో చేరి, కట్టుబాట్లకు తట్టుకోలేక తిరిగి వచ్చేసారు. కొందరు విద్వాంసుల ఇళ్ళల్లో బట్టలుతికి, వంటచేసి, సంగీతా భ్యాసం చేసి, తర్వాత తమ దగ్గరున్న నలభై రూపాయల విలువైన బంగారు ఉంగరాన్ని కేవలం ఎనిమిది రూపాయలకే విక్ర యించి, ఆంధ్రరాష్ట్రంలోని ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయ నగరానికి చేరుకున్నారు. రోజుకో ఇంటిలో భోజనం చేస్తూ, జోలెకట్టి అడుక్కుంటూ, ఎల్లమ్మ గుడిలో తల దాచుకున్న ఘంటసాలను పబ్రాయని సీతారామశాస్త్రి యాదృచ్ఛికంగా చూడడం, తన ఇంట ఉచితంగా శిక్షణ నివ్వడానికి శాస్త్రి అంగీకరించడం ఘంటసాల జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన. పేదవాడైన శాస్త్రి, ఘంటసాలకు మధూకర (ఉంఛ వృత్తి) నేర్పించారు. తర్వాత కళాశాలలో చేరి, 4ఏళ్ళ కోర్సును రెండేళ్లకే పూర్తి చేశారు. కొన్నాళ్ళు విజయ నగరంలో కచేరీలు చేసి స్వగ్రామం చౌటపల్లికి చేరుకుని, ఉత్సవాలలో, వివాహ తదితర సందర్భాలలో గాన కచేరీలు చేసి, పాఠాలు నేర్పారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, రెండేళ్ళు అలీపూర్ జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1944 మార్చి 4న తమ మేనకోడలు సావిత్రిని పరిణయమాడారు. తమ వివాహ సందర్భంలో స్వయంగా సంగీత కచేరీ చేశారు. అత్తవారి ఊరిలో సముద్రాల రాఘవాచారిని కలవగా, ఆయన సూచనపై, రెండు మాసాలు కచేరీలు చేసి, సమకూర్చుకున్న డబ్బుతో, అప్పు చేసి మద్రాసుకు చేరుకున్నారు. రాఘవాచారి ద్వారా నాటి సినీ ప్రముఖులైన చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల సమక్షంలో పాటలు పాడి, ప్రశంసాపాత్రు లైనారు. పానగల్ పార్కులో నిద్రిస్తూ సముద్రాల చొరవతో మద్రాసు రేడియో కేంద్రంలో లలిత సంగీత గాయకునిగా అవకాశం పొందారు. కొన్ని గీతాలు రచించి, స్వరకల్పన చేసి, స్టేషన్ ద్వారా పాడారు. తర్వాత కాలంలో భువన విజయం పేరుతో వాటిని గ్రంథస్థం గావించారు. సినిమాలలో చిన్నచిన్న వేషాలు వేసారు. “స్వర్గసీమ” చిత్రంలో తొలిసారి నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు అవకాశం ఇవ్వగా, భానుమతితో పాడిన పాటకు 118 రూపాయల పారితోషికం పొందారు. భానుమతి రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్ర సహాయ సంగీత దర్శకత్వ అవకాశం పొంది, తర్వాత బాలరాజు, మనదేశం లకు సంగీత దర్శకులైనారు. 1951లో విడుదలైన “పాతాళ భైరవి” ఘన విజయం ఘంటసాలకు ఎనలేని పేరు తెచ్చి పెట్టింది. మళ్లీశ్వరి తర్వాత 1953లో దేవదాసు, 55లో అనార్కలి, 57లో మాయాబజార్ లాంటి హిట్ సినిమాలు ఘంటసాలను సాటిలేని మేటి గాయకునిగా నిలబెట్టాయి. 1970 వరకూ హీరో లకు, విలన్లకు, కమేడియర్లకు పాడిన ప్రతి పాటా మాస్టరుదే కావడంతో ఆయన సినీ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజయ్యారు. 1970లో పద్మశ్రీ పురస్కారం గ్రహించారు. 71లో ఐరోపా, ఆమెరికాలలో ప్రదర్శనలు నిర్వహించారు. ఆరోగ్యం క్రమేపీ క్షీణించి చివరకు 1974 ఫిబ్రవరి 11న యావదాంధ్ర సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచి, స్వర్గస్తులైనారు. కరుణశ్రీ, జాషువా, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి వారి ప్రశంసలకు పాత్రులై, వారి రచనలను వీధి పాటలుగా, నూతన ఒరవడితో శైలితో పద్యాలుగా, సామాన్య జన బాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చిన ఘనత మాస్టారుడే. సాంప్రదాయ సంగీతానికి భంగం వాటిల్ల నీయకుండా, సామాన్య సంగీత ప్రియులకు సైతం హృదయ రంజకంగా పాడిన “శేషశైలావాసా”, “ఏడు కొండ స్వామి”, రహస్యం, లవకుశ, నర్తనశాల, ఒకటేమిటి పాడిన పాటలెన్నో పండిత పామర ప్రశంసాపాత్రాలైనాయి. జన్మతః లభ్యమైన సుమధుర గంభీర గాత్రంతో గానం చేసిన “భగవద్గీత అజరామర సుస్వరాన్ని కలిగిన ఘంటసాలను అనునిత్యం స్మరణీయునిగా చేస్తూనే ఉంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments