Thursday, June 30, 2022
HomeLifestyleLife styleచరమాంకంలో తెలుగు నాటక రంగం.. నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం

చరమాంకంలో తెలుగు నాటక రంగం.. నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం

19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం చేశారు. తెలుగు నాటకరంగంలో తొలి నాటక సమాజాన్ని కూడా వీరేశలింగమే స్థాపించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా (Telugu Theater Day) నిర్ణయించడం జరిగింది.

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. రంగస్థలం వినోద ప్రదేశమే కాదు; వివిధ సంస్కృతుల్నీ. జాతుల్నీ, మనుషుల్నీ ఒకటిగా కలిపే ప్రక్రియ.
నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసు కోవచ్చు.

తెలుగు దేశంలో ఆధునిక నాటక రచన ప్రదర్శనలకు దారితీసిన వారు పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానంగా పండితులైన కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి తదితరులు ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రథములు. కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రథములు.

ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభంకాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం 1860 ప్రాంతాల్లో కోరాడ రామచంద్ర శాస్త్రిచే సంస్కృతంలో నుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన“మంజరీ మధుకరీయము”. ‘ఆంధ్రా జాన్సన్‌ ‘గా సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1871లో వారణాశి ధర్మసూరి సంస్కృతంలో రచించిన “నరకాసుర విజయము” అనే వ్యాయోగమును ఆంధ్రీకరించాడు. పరవస్తు వెంకట రంగాచార్యులు 1872 ప్రాంతాల్లో కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలము”ను ఆంధ్రీకరించడం జరిగింది. వావిలాల వాసుదేవశాస్త్రి ఆంగ్ల నాటక ఆంధ్రీకరణ ద్వారా జూలియస్ సీజర్ నాటకాన్ని “సీజరు చరిత్రము” అను పేరుతో 1874 లో ఆసాంతం తేటగీతిలో రాశాడు.

ఆధునిక నాటక రచనకు ఆద్యులు వారైతే, ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమకవి, వడ్డాది సుబ్బారాయుడు రూపకర్తలు. వీరేశలింగం సంభాషణ రూపాన “బ్రాహ్మ వివాహము” అను ప్రహసనమును తన “హాస్య సంజీవని” అను పత్రికలో రచించగా, అనంతరం “వ్యవహార ధర్మబోధిని” వ్యావహారిక భాషలో రచించి, ప్రదర్శన భాగ్యం కలిగించిన తొలి తెలుగు నాటకమిది. 1880 లో వీరేశలింగం నాటక సమాజాన్ని స్థాపించి “రత్నావళి”, “చమత్కార రత్నావళి” అను రెండు నాటకాలను ప్రదర్శించాడు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగందే. ఆయన స్వతంత్ర రచన అయిన “వ్యవహార ధర్మబోధిని”, సంస్కృత నాటక అనువాదమైన “రత్నావళి”, ఆంగ్ల నాటక అనుసరణ అయిన “చమత్కార రత్నావళి” ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880 లో జరిగింది. అందుచేత 1980 వ సంవత్సరం తెలుగు నాటకరంగ శతజయంతి సంవత్సరం అయింది.

తెలుగు నాటకాలలో పద్య పఠనమును (ఈనాడు వలె గానం కాదు) ప్రవేశపెట్టినది వడ్డాది సుబ్బారాయుడు. వీరి నాటకాలలో ప్రసిద్ధమై, “వేణీ సంహారము”. తెలుగులో గద్య, పద్యాత్మకం కాగా, పద్యాలని రంగస్థలం మీద పఠించేవారు. 1884-86 మధ్య నాదెళ్ళ పురుషోత్తమ కవి 32 హిందూస్తానీ నాటకాలు రచించాడు. వీటిని 15 ఏళ్ళపాటు అనేక పట్టణాలలో విజయ వంతంగా ప్రదర్శించారు. పాత్రోచిత భాష, అనుప్రాసయుక్తము ప్రాబంధికము అయిన శైలి ఆయన పాటించిన అంశాలు. పాటలు (టపాలు) పాడుట ఇతడు ప్రవేశపెట్టిన క్రొత్త అంశము. ఈ మూడు అంశాలు కాలక్రమంలో తెలుగు నాటక రంగం మీద ప్రాధాన్యం వహించాయి. ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారు తన తొలి తెలుగు నాటకమైన “చిత్రనళీయం”‌ను బళ్ళారిలో 1887 జనవరి 29న విజయవంతంగా ప్రదర్శించారు. రామకృష్ణమాచార్యులవారు 30 నాటకాలు రచించారు. అన్నీ స్వతంత్ర రచనలే. తన నాటకాలలో పాటలు ప్రవేశ పెట్టారు. పద్యాలను రాగయుక్తంగా పాడడం కూడా ప్రవేశ పెట్టారు. అయన “సారంగధర” తెలుగులోని తొలి స్వతంత్ర విషాద రూపకం. ప్రాచ్య-పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయించడంలో ప్రథములైనందునే “ఆంధ్ర నాటక పితామహ” అని బిరుదునిచ్చి సత్కరించారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం 1989లో నాటక రచన ఆరంభం చేయగా, అయన నాటకాలలో “గయోపాఖ్యానం” సుప్రసిద్ధమైనది. 1891లో ” వెంకట రాయశాస్త్రి రచించిన “ప్రతాపరుద్రీయం” బహుళ ఖ్యాతినొందింది.

1887లో ప్రకటితమైన గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం” వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం. 1892 ఆగస్టులో విజయనగరంలోని జగన్నాధ విలాసినీ నాటక సమాజం వారు దీనిని ప్రథమంగా విజయవంతంగా ప్రదర్శించారు. వ్యావహారిక భాషలో ఓ కొత్త మలుపు తెచ్చిన నాటకమిది. “ప్రతాపరుద్రీయం”, “కన్యాశుల్కం” రెండు రాత్రుల రూపకాలు కాగా 1894 ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసినవారు కోలాచలం శ్రీనివాసరావు. అధికంగా చారిత్రక నాటకాలు రచించడంచేత “చారిత్రక నాటక పితామహుడు”గా పేరొందారు. ఆయన నాటకాలలో “కర్ణాటక రాజ్యనాశము” లేదా “రామరాజు చరిత్రము”నకు తెలుగుదేశ మంతటా విశేష ప్రాచుర్యం తెచ్చినవారు కోలాచలం మేనల్లుడైన బళ్ళారి రాఘవ.

పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన తొలి నాటకం “నర్మదాపురుకుత్సీయము” 1900లో ప్రకటితమైంది. ఆయన నాటకాలలో “రాధాకృష్ణ”, “పాదుకాపట్టాభిషేకం”, “కంఠాభరణము” ప్రసిద్ధమైనవి. ” 1900 నాటికి తెలుగు నాటక రచన, ప్రదర్శన వ్యాసంగాలు తెలుగుదేశంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపించాయి. 1906-20 మధ్య కాలంలో బయల్దేరిన “హరిశ్చంద్ర” నాటకాలు 13. “సారంగధర 8. ఇంకా అనేక ఇతర నాటకాలు. ధర్మవరం రామకృష్ణమాచార్యుల ప్రభావం వల్ల నాటకాలలో పద్యాలకు, పాటలకు విలువ హెచ్చిన కాలమిది. ఈ కాలంలోని ముఖ్య విశేషం తెలుగుదేశంలో వ్యాపార నాటకరంగం విజృంభించడం.

1913 ప్రాంతాల్లో కృష్ణా మండలంలో నాటక పోటీలు ప్రారంభమై దేశమంతటా వ్యాపించాయి. “గయోపాఖ్యానం”, “పాండవ ఉద్యోగ విజయములు”, “బొబ్బిలి యుద్ధం”, “రంగూన్ రౌడి” మొదలగు నాటకాలకు విడివిడిగా పోటీలు జరిగాయి. 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు తెనాలిలో స్థాపించబడింది. 1930 నుంచి సాంఘిక నాటకోద్యమం విజృభించింది. “విశ్వశాంతి”, “ఎన్.జీ.ఓ.”, “మా భూమి”, “కీర్తిశేషులు”, “నిర్మల” “కుక్క” వంటి నాటక రచనల ద్వారా రచయితలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

1935-44 మధ్య కాలంలో రేడియో రూపకం ఆవిర్భవించి అభివృద్ధి చెందింది. కాళ్ళకూరి నారాయణరావు రచించిన “చింతామణి”, “వరవిక్రయం”, “మధుసేవ” సమస్యల ఆలంబనగా వెలసిన నాటకాలు. ఇలా వుండగా సంప్రదాయాల ఆధిక్యాన్ని రూపుమాపడం కోసం రచనలు చేసినవారు త్రిపురనేని రామస్వామి, ముద్దుకృష్ణ, గుడిపాటి వెంకట చలం, ఆమంచర్ల గోపాలరావు మొదలగువారు. ఈ కాలంలో దువ్వూరి రామిరెడ్డి గారి “కుంభరాణా”, విశ్వనాథ సత్యనారాయణ “నర్తనశాల” ఉత్తమ విషాద రూపకాలు. 1930 తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన నాటకాలు కూడా వెలిశాయి. 1944-45 తరువాతి కాలాన్ని నాటక/నాటిక పోటీల యుగం అనవచ్చు. 1937 నుంచి రేడియో నాటికలు, 1944-45 నుంచి రంగస్థల ఏకాంకికలు పుంఖాను పుంఖాలుగా వెలువడు తున్నాయి. 1964లో ఎన్.ఆర్.నంది రచించిన “మరో మొహెంజొదారో” నాటకం ద్వారా తెలుగు నాటక ప్రయోగంలో “ఫ్రీజ్” ప్రవేశించింది.

ఆ తరువాత లెక్కలేనన్ని ప్రయోగాలు ఆధునిక నాటకరంగాన్ని వరించాయి. సాంఘిక నాటకాలలో లేజర్ టెక్నిక్‌ను వాడడం ద్వారా సైంటిఫిక్ పోకడలను సైతం గ్రహించి ప్రదర్శించే అవసరం అనివార్యం అయింది.

ఇక ప్రస్తుతం రంగస్థలానికి కావల్సిన సౌకర్యాలు సరైన ధియేటర్లు లేవు. ఏదో హాలులో నాటకం వేయ్యాల్సిన పరిస్థితులు. అతి ముఖ్యమైన మైకులూ, స్పీకర్ సిస్టములూ ఉండవు. ఉన్నా సరిగా పనిచేయవు. మైకులు మొరాయించని నాటకం ఉండదూ అంటే అతిశయోక్తి కాదు. నటులూ అంటే సినిమా నటులే అన్న ఒక అభిప్రాయం బలంగా నాటుకు పోయింది. సినిమాల్లో నటన ముక్కలు ముక్కలుగా చిత్రీకరించ బడుతుంది. నాటకంలో ఏకబిగిన మొత్తం సన్నివేశంలో నిమగ్నమై నటించాలి. అది చాలా కష్టం. నాటకాలు వేసిన వాళ్ళు సినిమాల్లో రాణిస్తారేమో కానీ, సినిమా నటులు నాటకాల్లో రాణించడం అంత సులభం కాదు. ఇది వరకు తెలుగు సినిమా నటుల్లో అధికులు నాటక రంగం నుండి వచ్చిన వారే ఆన్న విషయం గుర్తుంచు కోవాలి. ఏటా నంది నాటకాలు పేరు చెప్పి ఓ పది పదిహేను నాటకాలు వేయించి ప్రభుత్వమూ చేతులు దులిపేసు కుంతిండ్. ప్రభుత్వాలు చొరవ తీసుకుని, నాటక సంస్థలకు చేయూత అందించి, ప్రోత్సహిస్తే తప్ప మినుకు మినుకు మంటూ అరి పోవడానికి సిద్దంగా ఉన్న నాటకరంగం బతికి బట్ట కట్టడం కష్టం. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఇకనైనా గ్రహించక పోతే చరమాంకంలో ఉన్న నాటక రంగం తెర మరుగు కాక తప్పని స్థితి నెలకొంది

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments