Wednesday, November 30, 2022
Homespecial Editionఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


భారత దేశ స్వాతంత్య్ర సమర చరిత్రలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. అది
మహాత్మా గాంధీచే ప్రారంభించ బడిన ఒక అహింసా ప్రచారోద్యమం. ఇది బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగింది. ఉప్పుపై పన్ను చెల్లిం చేందుకు నిరాకరించి, మార్చి 12, 1930న చేప ట్టిన దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహంగా పేర్కొంటారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సారమే ఈ ఉప్పు సత్యాగ్రహం. ఈ యాత్ర సబర్మతి ఆశ్రమం నుంచి ఎనభై మందితో ప్రారంభమై గుజరాత్ లోని సముద్ర తీరంలో ఉన్న పల్లెటూరు దండి వరకూ సాగింది. కనుక దీనికి ఉప్పు సత్యాగ్రహ కార్యక్రమంగా పేర్కొంటారు. కోట్లమంది భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు పన్నుకు వ్యతిరేకించిన మౌన నిరసన కార్యక్రమం అది. దానిని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చ్ అనీ పిలుస్తారు.

1920 – 22 నాటి సహాయ నిరాకరణోద్యమం తరువాత ఈ మార్చ్ బ్రిటిష్ అధికారానికి అత్యంత ముఖ్యమైన వ్యవస్థీకృత సవాలు విసిరింది. 1930 జనవరి 26 న భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య నినాదం ప్రకటించిన వెంటనే దండి సత్యాగ్రహం మొదలైంది.

ఉప్పు పన్ను బ్రిటిష్ రాజ్ పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు చాలా భారంగా ఉండే పన్ను ఇది. ఉప్పు తయారీనే నిరసనకు, సత్యాగ్రహానికి తాను ఎందుకు ఎంపిక చేసిందీ వివరిస్తూ గాంధీ… “గాలి, నీరూ… ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం” అని అని పేర్కొన్నారు.

ఉప్పు చట్టాలను ధిక్కరించడం ద్వారా గాంధీ శాసనోల్లంఘనను ప్రారంభిస్తారని ఫిబ్రవరి 5 న వార్తా పత్రికలు రాసాయి. ఉప్పు సత్యాగ్రహం మార్చి 12 న అహ్మదాబాదు లోని సబర్మతి ఆశ్రమంలో ప్రారంభమై ఏప్రిల్ 6 న దండిలో ముగుస్తుందని పత్రికలు పేర్కొన్నాయి.

ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు తయారు చేసారు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగ పడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సత్యాగ్రహం ప్రారంభానికి కొన్నిరోజులకు ముందే బ్రిటిష్ వారు గాంధీని మార్చి 5, 1930 న అరెస్టు చేశారు. ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సర కాలం నడిచింది. ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు. లక్షల కొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. దండి మార్చి‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి యెర్నేని సుబ్రహ్మణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.

నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణ రాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించారు. ఉప్పు సత్యాగ్రహం సమయం లోనే ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి… “వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి” అనే గేయ కవితను రాశారు. మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల ‘ది మదర్’ను ‘అమ్మ’ పేరుతో తెలుగులోకి అనువదించిన క్రొవ్విడి లింగరాజు ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు. బ్రహ్మా జోస్యుల సుబ్రహ్మణ్యం సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే ‘ఆంధ్రా దండి’గా పిలుస్తారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భం లోనే కేంద్ర శాసన సభకు రామదాసు పంతులు, శాసన మండలి సభ్యత్వానికి స్వామి వెంకటాచలం రాజీనామాలు చేశారు. ఉప్పు చట్టాలను ఉల్లఘించి బులుసు సాంబమూర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ ( మాలపల్లి నవల రచయిత), ఖాసా సుబ్బారావు లాఠీ దెబ్బలు తిన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని తన నివాసం వేదవనంలో సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖ పట్నంలో తెన్నేటి విశ్వనాథం, మచిలీ పట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు, రాయలసీమ పరిధిలో కల్లూరి సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. నెల్లూరులోని మైపాడు బీచ్‌లో బెజవాడ గోపాలరెడ్డి ఉప్పు తయారు చేసి ప్రజలకు అమ్మారు. అలా లక్షలాది మంది తమ సొంత ఉప్పును తయారు చేసుకున్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments