Thursday, December 8, 2022
Homespecial Editionతెలుగుకు పునర్వైభవం తేవాలి...

తెలుగుకు పునర్వైభవం తేవాలి…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

జంతువుల నుండి మానవుని వేరు చేసేది భాష ఒక్కటే. భాష లేకపోతే మన భావాలను ఇతరులతో వ్యక్తీకరించడం సాధ్యం కాదు. సమాజం ద్వారా వ్యక్తి లోనికి ప్రవేశించి వ్యక్తిని సామాజికుడిని చేసేది మాతృభాష. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడం, తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవాన్ని సంస్కృతిని, సంప్రదాయాన్ని తర్వాతి తరాలకు అందించడానికి ఉపకరించే సాధనం మాతృభాష. గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు వారధి కూడా మాతృభాషే. భాష అనేది చరిత్ర గమనానికి, సామాజిక పరిణామానికి మూలాధారం. మాతృభాష అనగా శిశువుకు తల్లి ఉగ్గుపాలతో నేర్పినటువంటి భాష. ఈ మాతృభాష ప్రతి శిశువుకు సహజంగా ఎలాంటి ప్రయత్నం అవసరం లేకుండానే వస్తుంది. మాతృభాష ద్వారా నేర్చుకున్న విద్య సులభంగా అవగత మవుతోంది. అంతేకాక విద్యార్థిలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీస్తుంది. తద్వారా ఇతర భాషలు నేర్చుకోవడానికి మాతృ భాష ఎంతో సహాయకారిగా ఉంటుంది.. ఇదంతా గత కాలం గురించి పూర్తిగా తెలిసిన తెలుగు వారికి, తెలియనిది ఏమీ కాదు. ఆంగ్ల మాధ్యమంలో చదివితే పిల్లలు గొప్పవారు కాగలరని, తెలుగు మాట్లాడితే చులకన అనే భావన వల్ల, ఆంగ్ల భాషకు ప్రాధాన్యత పెరిగి, తెలుగు భాష నిరంతర నిర్లక్ష్యానికి గురి అవుతున్నది. వెనుజులకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు చివరన కలిగి) గా ఉండటం గమనించి తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌ గా 1402 లోనే ప్రశంసించారు. పరభాష ద్వారా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పే విధానం పూర్తిగా అశాస్త్రీయమని, కాలహరణ హేతువని, బావి పౌరులను బానిసలుగా చేస్తుందని విద్యా వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పిల్లల సొంత ఆలోచనలను పెంపొందించడానికి, వారి సాంస్కృతిక బానిసత్వానికి మార్గం ఏర్పడుతుందని, విజ్ఞానానికి – విద్యార్థులకు మధ్య ఒక అడ్డుగోడలా సృష్టిస్తుందని, తమ చుట్టూ ఉన్న జీవిత విలువలను తెలియని విద్యార్థులను, విషయ పరిజ్ఞానం లోతుగా తెలీని, ఉపాధ్యాయులు చెప్పింది చెప్పినట్లు, నోట్సు కాపీ చేస్తూ, కంఠస్తం చేసే యంత్రాలుగా మారుస్తుందని విద్యాధికుల, మానసిక శాస్త్ర వేత్తల భావన. తనకు అర్ధం కాని, సాధికారికత ఏమాత్రం చేకూర్చని భాషకు సంబంధించిన విషయాలను, బట్టి పట్టి తమ తల్లిదండ్రులను మురిపింప చేస్తూ, తమను తాము, తమ పోషకులను, మోసం చేసుకోవడం అవుతుందని విజ్ఞులు, ప్రాజ్ఞులు ఎంత మొత్తుకున్నా, అర్థం చేసుకునే వారు భూతద్దానికీ అగుపించడం లేదంటే అతిశయోక్తి లేదు…మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అరబ్బీ భాషలో తనకు పాఠాలు బోధించి, తన బాల్యం అంతా వృధా పరిచారని, తన గురువుకు రాజ్య బహిష్కరణ లాంటి తీవ్ర శిక్ష విధించిన విషయం చరిత్ర చెప్తుంది. ఔరంగజేబు తన గురువుకు రాసిన నాటి చారిత్రాత్మక ఉత్తరాన్ని 1910లో కొమర్రాజు లక్ష్మణరావు తెలుగులోకి అనుమతించడమే కాక, తన కాలం నాటి ఆంగ్ల మాధ్యమం చదువుల వల్ల భవిష్యత్ తరాలు ఔరంగజేబు లాగా మనలను తప్పు పడతాయని హెచ్చరించారు … ప్రఖ్యాత ఆంగ్ల కవి విలియం షేక్స్పియర్ ఏమి చదవుకుని, ఆంగ్ల సాహిత్య శిఖరంలా ఎదిగారనేది అర్థం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు 9.3 కోట్ల మందికి మాతృభాషగా ఉంది. భారతావనిలో హిందీ 366 మిలియన్ల, బెంగాలీ 83 మిలియన్ల, తెలుగు 74 మిలియన్ల, తర్వాత మరాఠీ 72, తమిళం 61, కన్నడం 55, ఉర్దూ 52, గుజరాతీ 46, మలయాళం 33, ఒరియా 33 మిలియన్ల మంది మాట్లాడుతూ 10 స్థానాలలో ఉన్నారు. తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం ప్రాచీన భాషగా గుర్తించింది. వాస్తవానికి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది తెలుగు జాతి. ప్రపంచంలో “మా తల్లి భాష మాకొద్దు, ఇతర భాషల ముద్దు” అని చెప్పగలిగే జాతి ఏదైనా ఉంది అంటే నిస్సిగ్గుగా అది తెలుగు జాతి మాత్రమే. “తెలుగుకు” పట్టిన ఈ “తెగులు” ఈనాటిది కాదు. కాలక్రమేణా, అవిభక్త ఆంధ్ర దేశం పూర్తిగా మారిపోయి ప్రస్తుతం ఆంగ్ల దేశంగా రూపుదిద్దు కుంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేజీ నుండి పూర్తిగా ఆంగ్ల మాధ్యమం పెడదామన్న సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని, హై కోర్టు నిర్ద్వందంగా త్రోసి పుచ్చింది. తెలుగు భాషాభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇదైనా పాలకులకు గుణపాఠం కావాలి. ప్రైవేటు పాఠశాలలో తెలుగు మాధ్యమంలో, ప్రాథమిక విద్య దాదాపు కనుమరుగయింది. తెలుగు భాషకు.. తెలుగు తనానికి చోటు లేకుండా పోతున్నది. ఈ తరం విద్యార్థులకు తెలుగు ప్రాచీన వైభవం, సంస్కృతి సంప్రదాయాల పట్ల కనీస అవగాహన లేకుండా పోతున్నది. దేశ భాషలందు ” తెలుగు లెస్స” అన్న నానుడి దేశ భాష లందు “తెలుగు లెస్” అనే దురవస్థకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగును నిర్లక్ష్యం చేస్తుంటే…. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ, అహమ్మదాబాద్, సూరత్ లాంటి పట్టణాలలో, తెలుగు వారికోసం తెలుగు మాధ్యమ బడులు నడిపారు. ఇప్పటికీ అవి నడుస్తూనే ఉన్నాయి. అంతే కాదు, 2017లో కేంద్ర ప్రభుత్వ బళ్ళలో కూడా తెలుగు తప్పని సరి అని ప్రధాని అన్నారు కూడా. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, “మాతృ భాష కళ్ళ వంటిది, పరాయి భాష కళ్ళద్దాల వంటిది, కళ్లు లేకుండా, అద్దాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం శూన్యం”. అన్న మాటలను మననం చేసుకోవాలి. మారిషస్ లో తెలుగు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయి కోర్సుల నిర్వహణ; ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడి పాఠశాలల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పన్నెండో తరగతి వరకు తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలుగుతున్నది. అమెరికాలో తెలుగు వారి కోసం బ్యాలెట్లపై ఇటీవలే తెలుగులో ముద్రించడం వంటి అంశాలను గమనించాలి.
పరదేశీయుడైనా, ఆంగ్ల భాష మాతృభాష అయినా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా భారత దేశానికి వచ్చి, విధి నిర్వహణ కోసం తెలుగు భాష నేర్చుకుని, నాటికి కరడుగట్టి, మినుకు మినుకు మంటూ, ఆరి పోవడానికి సిద్దంగా ఉన్న తెలుగు భాష ఉద్దరణకు బ్రౌన్ తీసుకున్న చొరవను, సహస్రాధిక వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించడం, పాఠశాలలు స్థాపించి, ఉచిత విద్య నేర్చుకునే అవకాశం కల్పించడం, ప్రాచీన గ్రంథాలను అర్ధం చేసుకోవడానికి ఏకంగా నిఘంటువుని అందించడం ద్వారా తెలుగు భాషా, సాహిత్య వికాసానికి సి. పి. బ్రౌన్ అందించిన సేవలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. గొప్పలను ప్రదర్శించడం కాదు… గొప్పలను నిలబెట్టు కోవడమే గొప్ప.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments