– మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సహయ చర్యలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.ఇంకా లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతయుతమైన పదవిలో ఉండి ప్రజల గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. పుట్టిన రోజులు చేసుకుంటూ ప్రజలను ‘మీ చావు మీరు చావండి’ అని వదిలేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రీ, కొడుకులు పోటీ పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టుగా అన్ని జరిగితే, ఐటీ కారిడార్ నుంచి హయత్‌నగర్ దాకా ట్రాఫిక్ జామ్‌లు ఎందుకవుతున్నాయని నిలదీశారు. పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతున్నదని తెలిపారు. నాలాలు, చెరువులు కబ్జా. హైదరాబాద్ పరిధిలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు యధేేచ్ఛగా భూములు, చెరువులు కబ్జా చేస్తూ… అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వరదల సమయంలో మీడియా ముందుకు వచ్చికేసీఆర్ చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ పరిస్థితి కారణం ఎవరనే దానిపై ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నా పాపాన పోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని కేటీఆర్‌ను కోరారు. ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదిన మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరద సాయం అందేలా చూడాలి : జూమ్ మీడింగ్‌లో రేవంత్‌రెడ్డి డిమాండ్
రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరద సాయం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో తన నివాసం నుంచి పార్టీ నేతలతో రేవంత్ జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు సీనియర్ నాయకులతో మాట్లాడారు.