సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి సూదిని జైపాల్ రెడ్డి

Date:

రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు ఎంపీగా.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, దశాబ్దాల రాజకీయ జీవితంలో మేధావిగా, సకల విషయ పరిజ్ఞానిగా, నిగర్విగా, నీతి, నిజాయితీలకు మారు పేరుగా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, దేశ రాజకీయాల్లో తన ప్రత్యేకత చాటిన అనుభవ శాలి ఆయన. విధి ఆయనపై చిన్నచూపు చూసినా, అంగవైకల్యమును జయించి, మానసిక స్థైర్యాన్ని వశం చేసుకుని, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగిన అలుపెరగని యోధుడు ఆయన. భారత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విధించబడిన అత్యాయక స్థితి నిర్ణయాన్ని వ్యతిరేకించి, తామున్న పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా పార్టీ అధినేత్రి ఇందిరా గాంధీనే ఎదిరించి ఆమెపై ఎంపీ స్థానానికి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ ధీశాలి ఆయన. ఆయనే రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న తెలంగాణ గర్వించ దగిన మేధావి సూదిని జైపాల్ రెడ్డి.

సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. 18 నెలల వయసులో ఉండగానే పోలియో కారణంగా వైకల్యానికి గురయినా, అది ఆయన రాజకీయ జీవన ఆరోహణకు ఎన్నడూ అవరోధం కాలేక పోయింది. మాడుగులతో పాటు నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించారు. ఉస్మానియా నుండి ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు.

జైపాల్ రెడ్డి నాలుగు సార్లు శాసన సభ్యునిగా, జనతా పార్టీ జనరల్ సెక్రెటరీగా, మహబూబ్‌నగర్ ఎంపీగా, మిర్యాలగూడ ఎంపీగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా , రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, పాలు మార్లు కేంద్ర మంత్రిగా, పని చేసిన విశేష అనుభవ శాలి. ఎమర్జెన్సీ ప్రకటనను వ్యతిరేకించడం, కాంగ్రెస్ హైకమాండ్‌కి ఆయన ఎదురు తిరగడం, ఇందిరా గాంధీ కి ఎంపీ స్థానానికి పోటీ చేయడం ఆయన ప్రత్యేకతలు. చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయని ప్రశంసలు అందుకున్నారు. పార్టీలకు అతీతంగా నేతలతో చనువు పెంచుకున్న, ప్రేమను పంచుకున్న గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి.

నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించిన జైపాల్ రెడ్డి, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ పట్టా తీసుకున్నారు.

ఉస్మానియాలో విద్యార్థి నాయకుడిగా ఉండగానే జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభం అయింది. కాంగ్రెస్ పార్టీలో చేరి, 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు కూడా ఇదే నియోజక వర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు.

1975లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించగా, దీన్ని వ్యతిరేకిస్తూ జైపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జనతా పార్టీలో చేరి, 1980లో ఇందిరా గాంధీపై మెదక్ ఎంపీ స్థానంలో పోటీకి దిగారు. అయితే, ఆయనకు ఓటమి చవి చూశారు. 1984లో జైపాల్ రెడ్డికి పార్లమెంటులో సభ్యుడిగా అడుగుపెట్టే అవకాశం తొలిసారి వచ్చింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు.

1985 నుంచి 1988 వరకు జైపాల్ రెడ్డి జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత విభేదాల వల్ల ఆయన జనతా దళ్‌లో చేరారు.

1990, 1996లో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. 1991 నుంచి 1992 వరకూ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1998లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా రెండో సారి ఎన్నికయ్యారు. అదే ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారత ఎంపీ ఆయనే.

1999లో జైపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. వరుసగా 1999, 2004లలో ఆ పార్టీ తరఫున మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. జైపాల్ రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఇంద్ర కుమార్
గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల్లో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి పదవులు చేపట్టారు.
2004లో యూపీఏ తొలి ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ నుంచీ గెలిచి, తిరిగి కేంద్ర మంత్రిగా పనిచేశారు జైపాల్ రెడ్డి. 2009లో యూపీఏ రెండో ప్రభుత్వ హయాంలో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచీ ఎన్నికై… పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రిగా పని చేశారు. 2012-2014 మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా చేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహా మరికొన్ని శాఖలకు మంత్రిగా పని చేశారు. పని చేయడమే తప్ప ప్రతిఫలం ఆశించని నేతగా ముద్రపడ్డ జైపాల్ రెడ్డికి పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ప్రధాన అంతర్గత పాత్ర పోషించారు. తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా, సోనియా గాంధీ కి విశ్వసనీయునిగా, ప్రత్యేక రాష్ట్ర సాధనలో బహిర్గతం కానీ ఆయన పాత్ర ఎన్నదగినది. రాష్ట్ర విభజన నివారణకై, ఆయనకు ముఖ్య మంత్రి పదవి ఇవ్వ జూపినా, ప్రజల ఆకాంక్షల దృష్ట్యా ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం ఉంది.

జైపాల్ రెడ్డి హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతూ 2019, జూలై 28న మరణించారు.

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...