స్థానం నరసింహారావు (23.9.1902–21.2.1971)
ఆంధ్ర నాటకరంగ చరిత్రలో నరసింహారావుది ప్రత్యేక స్థానం. నాటక రంగం మనగలిగినంత కాలం ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది. ఆయన స్త్రీ పాత్రధారణలో అసాధారణ ప్రజ్ఞ కనబరచి నాటక రంగానికే వన్నె తెచ్చారు. పురుషులే స్త్రీ వేషాలు వేసే ఆ నాటి రోజుల్లో రంగస్థలంపై విభిన్నమైన, పరస్పర విరుద్ధమయిన పాత్రలను ధరించి, ధరించిన ప్రతి పాత్రలోను తమదైన ప్రత్యేకతను చూపించి లీనమై, ముప్ఫయి సంవత్సరాలపాటు లక్షలాది మంది ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనకే సొంతం. నటకావతంస, నటశేఖర, నాటకకళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదులు, పురస్కారాలు ఆయనను వరించాయి.
స్థానం నరసింహారావు (సెప్టెంబర్ 23, 1902 – ఫిబ్రవరి 21, 1971) ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటులు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందాడు.
స్థానం నరసింహారావు 1902, సెప్టెంబర్ 23 న హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్ల లో జన్మించారు.
ఆయన చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వచ్చి బాపట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో వెంపటి వెంకటనారాయణ అనే ఆయన భామ వేషం అద్భుతంగా కట్టేవారట. ఆ స్త్రీ వేషం తన మనసులో ఎంతో ఆదరంతో మనసులో నిలిచి పోయి ఉండేదని చెప్పారు. ఈ దృశ్యాలన్నీ ఆయన రంగస్థల ప్రవేశం చేయడానికి దోహదం చేశాయి. 1921లో బాపట్లలోనే జంట కవులైన తిరుపతి వేంకటకవులకు, కొప్పరపు కవులకు శతావధానం పోటీ జరిగింది. నెగ్గిన తిరుపతి వేంకటకవులని సత్కరించాలని భావించారు. ఆ సందర్భంగా ప్లీడరు గుమస్తాల బృందం చేత సత్య హరిశ్చంద్ర నాటకం వేయించాలని నిర్ణయించారు. ఆహ్వానాలు వెళ్లిపోయాయి. కానీ చంద్రమతి వేషధారి అస్వస్థుడై రాలేకపోతున్నట్టు చివరి నిమిషంలో తెలిసింది. ప్రత్యామ్నాయం ఏదీ సాధ్యం కాలేదు. చంద్రమతి పాత్రధారి మరొకరు దొరకలేదు.
మరో నాటకం వేద్దామంటే పాత్రధారులంతా లేరు. గుండెల్లో రాయి పడింది. అప్పుడే ఆపద్బాంధవుడిలా స్థానం దొరికాడు చోరగుడి హనుమంతరావుకి. వారి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు వెళ్లి కూర్చోవడంతో పద్యాలన్నీ వచ్చేశాయి. ఒకసారి ఎవరూ లేనప్పుడు పాడుకుంటూ ఉంటే హనుమంతరావు విన్నారు. ఆ ధైర్యంతోనే చంద్రమతి వేషం వేయించారు. స్థానం వారికి చిన్నతనంలోనే చిత్రలేఖనం కూడా అబ్బింది. ఆ కళతోనే, వేరే ఒకరి ఇంట రహస్యంగా తన వేషం తనే వేసుకున్నారాయన. చిన్న చిన్న లోపాలు ఉన్నా అరంగేట్రంలోనే తిరుపతి కవుల ఆశీస్సులు అందుకున్నారు స్థానం.
తెనాలిలోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించారు.
వరంగల్‌లో ‘కృష్ణలీల’ నాటకంలో యశోద వేషం వేసినందుకు ఆయన జీవితంలో తొలి బంగారు పతకం వచ్చింది. అనతికాలంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. కాపురం బాపట్ల నుంచి తెనాలికి మారింది. శ్రీరామవిలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటననే జీవికగా చేసుకున్నారు. రోషనార (రోషనార నాటకం), తామీనా (రుస్తుం సొహరాబ్ నాటకంలో), సంయుక్త (రాణీ సంయుక్త), శకుంతల (అభిజ్ఞాన శాకుంతలం), సత్యభామ (శ్రీకృష్ణ తులాభారం), చిత్రాంగి (సారంగధర), దేవదేవి (విప్రనారాయణ), కోకిల (కోకిల నాటకం), మల్లమ్మ (బొబ్బిలి), మధురవాణి (కన్యాశుల్కం), అనసూయ (అనసూయ నాటకం), మురాదేవి (చంద్రగుప్త), చింతామణి (చింతామణి), సుభద్ర (వీరాభిమన్య), సరళ (ఛత్రపతి శివాజీ), విద్యాధరి (కాళిదాసు), చండిక (చండిక నాటకం) వంటి పాత్రలు వేశారు. ఎన్ని పాత్రలు పోషించినా, ఆయన వేసిన సత్యభామ పాత్ర పోషణ న భూతో న భవిష్యతి. మీర జాల గలడా నా యానతి అన్న పాటకు ఆయన చేసిన గాత్రం, చూపిన అభినయం నాటక ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయాయి.
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ, వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి …
