ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారత దేశంలోనే ప్రాచీనమైన, పంచభూత లింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. పంచ భూతాలయిన భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని శక్తులను పరమేశ్వరుడు తనలో నిక్షేపించు కొని, లింగాకారంగా ఆవిర్భ వించాడు. కంచి క్షేత్రంలో పృథ్వీ లింగంగా, చిదంబర క్షేత్రంలో ఆకాశ లింగంగా, జంబుకేశ్వర క్షేత్రంలో జల లింగంగా, అరుణా చలంలో అగ్ని లింగంగా, శ్రీకాళహస్తిలో వాయు లింగంగా ఆవిర్భవించాడు. అందుకే శ్రీకాళహస్తీశ్వరుని పక్క నున్న రెండు దీపాలు శివలింగ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన వచ్చే గాలికి కదులుతూ వుంటాయి. ఈ శివలింగం స్వయంభూ లింగం.
శైవ క్షేత్రాలలో కల్లా అత్యుత్తమ మైంది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ఇక్కడి పర్వత శ్రేణులే దక్షిణ కైలాసగిరి పర్వతాలు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి, శ్రీకాళ హస్తీశ్వరుని, శ్రీ జ్ఞానప్రసూ నాంబికా దేవిని దర్శించినంత మాత్రాన ముక్తి కలుగుతుందని ప్రశస్తి. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభి ముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వ రుడు పశ్చిమ ముఖంగాను దక్షిణా మూర్తి దక్షిణ ముఖం (మహాద్వారం ఎదురు) ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. క్షేత్ర పురాణ కథనాల ప్రకారం
దక్షిణ కైలాస మందు వాయు లింగాకృతి గల శివలింగాన్ని కాళం అనే పేరుగల సర్పం ప్రాతఃకాల మందే మణులతో పూజిస్తూండేది. మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చే ఏనుగు శివునికి సర్పంచే సమర్పించబడ్డ మణులను రాళ్ళుగా భావించి, వాటిని తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో లింగానికి అభిషేకం చేసి, కమలాలతో పూజిస్తూండేది. సర్పం సమర్పించిన మణులను ఏనుగు, ఏనుగు సమర్పించిన కమలాలను సర్పం తొలగిస్తూండేవి. తమ పూజలకు భంగం కలిగిస్తున్న వారిని కనిపెట్టి, శిక్షించాలని ఒకటి కొకటి భావించాయి.
ఒకరోజు సర్పం శివలింగం వెనుక భాగాన వేచి ఉండగా, ఏనుగు ప్రతిరోజూ లాగానే వచ్చి, మణులను తొలగించి, అభిషేకం చేసి పద్మాలతో పూజిస్తూండగా సర్పం, తను సమర్పించిన మణులను తొలగించిన ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. ఆ బాధను భరించలేక ఏనుగు ఘీంకారం చేస్తూ శివుని వెనుక భాగాన గల పర్వతాన్ని తొండంతో ఢీకొట్టింది. వెంటనే ఏనుగు,అదే సమయంలో తొండంలో గల సర్పం కూడా మరణించడం జరిగాయి. రెండూ ఒకేసారి రెండు జీవు లూ పరమ శివునిలో ఐక్యమైనాయి.
పరమశివుడు వాటి భక్తికి మెచ్చి వరం కోరుకోమనగా, అవి, ఆ
వాయులింగం తమ పేరున ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. మొదట ‘శ్రీ’ అనే పేరు గల సాలీడు శివ సాయుజ్యం పొందడం, తర్వాత కాళం, హస్తి శివసాయుజ్యం పొందినందున, వాటి కోరికపై పరమేశ్వరుడు వెలసిన వాయులింగాన్ని ‘శ్రీకాళ హస్తీశ్వరుడు’ అని, ఆ క్షేత్రం దక్షిణ కైలాసానికి బదులుగా ‘శ్రీకాళహస్తి’ అని పిలువబడు తుందని కైలాస నాథుడు అనుగ్రహించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
క్రీ.శ. 12వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. రాజేంద్ర చోళుని పాలన 13వ శతాబ్దంలో ముగిసిన తర్వాత, విజయ నగర రాజులైన సాళువ రాజు, శ్రీకృష్ణదేవ రాయలు, శ్రీకాళ హస్తి జమిందారుల హయాంలో ఈ దేవాలయం అనేకవిధాలుగా అభివృద్ధి చెందినట్లు చెపుతారు.
తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని, మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాలను నిర్మించారు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురా లను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా వంద స్తంభాలు కలిగిన మంటపం,
అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి గోపురాన్ని నిర్మించినట్లు తెలియ జేస్తుంది. క్రీస్తుశకం 1529 అచ్యుత రాయలు తన పట్టాభిషేక మహోత్స వాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు.
ఈ ఆలయంలో ప్రధానంగా రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. దేశం నలు మూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించు కుంటారు. రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. ఈ ఏడు శివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 24 నుండి మార్చి 9వరకు జరుగుతాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 24న భక్త కనప్ప ద్వజారోహణం, 25న స్వామివారి ద్వజారోహణం, 26న రెండో తిరునాళ్లు (భూత రాత్రి), 27న మూడవ తిరునాళ్లు (గంధర్వ రాత్రి), 28న నాలుగవ తిరునాళ్లు (నాగ రాత్రి), మార్చి 1న మహా శివరాత్రి, నంది సేవ, లింగోద్భవం, 2న రథోత్సవ (ఉదయం), బ్రహ్మ రాత్రి, తెప్పో త్సవం (రాత్రి), 3న శివపార్వతుల కల్యాణం (స్కంద రాత్రి), 4న సభాపతి కల్యాణం (ఆనంద రాత్రి), 5న గిరి ప్రదక్షిణ (రుషి రాత్రి), 6న మార్చి – తీర్థవారి, ధ్వజా వరోహణం, 7న పల్లకీ సేవ (రాత్రి), 8న ఏకాంత సేవ, 9న అభిషేకం, నిత్యోత్సవం ప్రధాన కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. దేవస్థానం ఈఓ శివాజి ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
