Saturday, November 26, 2022
HomeLifestyleDevotionalవసంత పంచమి

వసంత పంచమి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

“వసంత పంచమి”గా పిలువబడే మాఘ శుద్ధ పంచమి ప్రధానంగా రుతు సంబంధ పర్వదినం. ఈదినమే చదువుల తల్లి “సరస్వతి జయంతి”గా కొన్నిచోట్ల భావించ బడుతుంది. దీనిని ” సరస్వతి పూజా దినంగా, శ్రీపంచమి, మదన పంచమి, రతి కామ దమనోత్సవ పర్వదినం”గా పంచాంగ కర్తలు పరిగణిస్తారు. వసంత పంచమి నామాన్ని బట్టే దీనిని రుతు సంబంధమైనదిగా భావించవచ్చు. మకర సంక్రాంతి తరువాత ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఆకాలంలోనే క్రమంగా వసంత రుతు లక్షణాలైన చెట్లు చిగుర్చడం, పూలు పూయడం కనిపిస్తుంది. మాఘ మాసమే వసంత రుతువుకు ఆరంభమనే వాదనకూడా ఉంది. వసంతోత్సవారంభానికి వసంత పంచమినే కొందరు పంచాంగ కర్తలు ఉదహరిస్తారు. రాగల వసంత రుతువుకు శిశిరంలోనే స్వాగతించే పండుగ ఇది. ఈనాటి కృత్యాలలో నూతన వస్త్రధారణం, తైల స్నానాలు ప్రధానాలని చెప్పబడింది. నూతన వస్త్ర ధారులై, బుక్కా, వసంతం చల్లుకునే పండుగ అయి నందునే వసంత పంచమి అని నామాంకితమైంది. “నవాన్న భక్షణ దినం”గా, సంక్రాంతికి వచ్చే ధాన్యాన్ని ఈ రోజు అన్నం వండి కులదేవతలకు నివేదించి తినే ప్రాచీన ఆచారమూ కొన్ని ప్రాంతాలలో ఉన్నది. ప్రాచీన కాలంలో “రోమనులు” కూడా “వసంత రుతు పండుగ”ను ఇదే రోజు, ఇదే మాదిరిగా చేస్తుండే వారని పేర్కొనబడింది. బ్రహ్మ వైవర్త పురాణంలో.. ప్రకృతి ఖండంలో నాలుగో అధ్యాయంలో అన్ని శక్తులలో ప్రధానమైన శక్తిగల సరస్వ తిని వసంత పంచమినాడు పూజించాలని చెప్పబడింది. కనుక వసంత పంచమి “విద్యారంభ దినం”. జ్ఞానప్రాప్తి కోసం సరస్వతిని ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది.
విద్యకు అధిదేవతయైన సరస్వతిని మాఘ మాసమందు తాటియాకులు, గంటము, గ్రంథము లాది విద్యా సాధనములను దేవి ఎదుట ఉంచి, గంధ పుష్పాదులతో గ్రంథ రచన ప్రారంభ సమయంలో పూజించే ఆచారం ఉండినట్లు సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. “యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా, సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః” శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభం అవుతుంది.

సరస్వతీదేవి అహింసాదేవి. ఆయుధాలు ఏమీ ధరించని దేవత. తెల్లటి పద్మం మీద సరస్వతి నిల బడి ఉన్నట్లు, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిమీద అడ్డంగాను ఉంచుకుని, ఒక చేత వీణ మరొక చేత పుస్తకము ధరించి ఉన్నట్లు పద్మ పురాణ లిఖితం. తెల్లటి బట్టలు ధరించి, తెల్లటి పూలు, తెల్ల పూసల కంఠహారం, దానిపై తెల్లగంధం పూత తెల్లని వీణాపాణితో కూడిన ప్రశాంత, శాంతి దేవత సరస్వతి. పూజా సందర్భంలో చదువుకు, వ్రాతకు సంగీతానికి సంబంధించిన పరికరాలను ఆమె ముందుంచడం అనవాయితీ. సర్వవిద్యలకూ ఆధారమైన వాగ్దేవి చెంత పుస్తకాలు, కలాలు ఈ రోజున ఆరాధిస్తారు. “మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః…’వసంత పంచమి రోజున ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని పూజించి విద్యారంభం చేయాలని చెప్పబడింది. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. చదువుల తల్లి కృపతో సద్భుద్ధినీ పొందుతారు. పసుపు పచ్చని బట్టలు ధరించి, సరస్వతికి రోజంతా పూజలు నిర్వహిస్తూ, కీర్తనలు పాడడం సనాతన సాంప్రదాయం.

ఈనాడే రతీదేవి కామదేవత పూజ చేసినట్లు, రుతురాజు వసంతునికి కామ దేవుడు మంచి మితృడైనట్లు, కనుక ఈనాడు “రతీ మన్మద, వసంతుల పూజలు” చేయాలని పురాణ కథనం. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు పేర్కొన్నాడు. రుగ్వేదంలో ప్రధానంగా గ్రీష్మ, శారద వసంత కాలాలు మూడే పేర్కొనబడినాయి. వసంత పంచమి నాటికే మామిడి తదితర చెట్లు బాగా చిగురించి, పుష్పిస్తాయి. పనస మొదలైనవి పైరు గాలికి పిందెలుగా మారుతాయి. శీతాకాలపు పడిశాలు దగ్గులాంటి రుగ్మతలు క్రమంగా తగ్గుతాయి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments