స్కై లాబ్… ఈ పేరు నేటి తరానికి అంతగా తెలియక పోవచ్చు. దాదాపు అర్ధ శతాబ్ది క్రితం జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంఘటన. ప్రధానంగా తెలంగాణ అదీ ఉత్తర తెలంగాణ ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు గురిచేసిన నేపథ్యం. యాభై ఏళ్ల పైబడిన వారిని కదిలిస్తే ఈనాటికీ వెంటనే గుర్తుకు వచ్చి, ఆనాటి తీవ్ర భయాందోళనల పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వివరించే అరుదైన సంఘటనల అపురూప అపూర్వ దృశ్యం(skylab satellite).
అంతరిక్షం లో మానవులచే నిర్మించిన పరిశోధనా ఉపగ్రహం లాంటి పరికరాల నిర్మిత అతిపెద్ద కేంద్రాన్ని స్కైలాబ్ అంటారు. భూమి గురుత్వాకర్షణ శక్తిని ఛేదించి మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ని 1957-అక్టోబర్లో అప్పటి సోవియట్ యూనియన్ పంపించడంతో అంతరిక్ష పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. ఆ తర్వాత అంతరిక్షం లోనే మానవుడు పరిశోధనా కేంద్రాన్ని (స్కైలాబ్) స్థాపించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానిలోనే ఉంటూ పరిశోధనలు చేస్తూ సౌరకుటుంబాన్ని గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసు కోవడానికి ఈ విజ్ఞానం ఉపయోగించు కున్నాడు. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి నిర్మించాయి. ఈ అంతరిక్ష కేంద్రం భూమి పరిభ్రమించే లోపలి కక్ష్యతో నిర్మించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి 278 నుండి 460 కి. మీ. ఎత్తులో ఉండి, సరాసరి గంటకు 27, 743 కి. మీ. వేగంతో పరిభ్రమిస్తూ ఉండేది. ఇది రోజుకు 16 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసేది. ఈ కేంద్రంలో వ్యోమగాములు ఉంటూ, భూగోళ వాతావరణ అధ్యయనానికి, సమాచార ప్రసార సాధనంగా స్కై లాబ్ ను వినియోగించు కున్నారు.
స్కైలాబ్ మొదటి యునైటెడ్ స్టేట్స్ అంతరిక్ష కేంద్రం, నాసా ప్రారంభించింది. మే 14 1973, ఫిబ్రవరి 1974 మధ్య 24 వారాలపాటు క్రియాశీలంగా ఉంది. ఇది అంతరిక్ష పరిశోధక నౌక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీన్ని రూపొందించింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టిన దీని జీవిత కాలం ఏడేళ్లు. అయితే అంతరిక్షం లోకి పంపిన తర్వాత దీన్ని భూమి మీదకు తిరిగి సురక్షితంగా ఎలా తీసుకు రావాలన్న విషయంలో నాసా సరిగా వ్యవహరించలేదు. అయితే ల్యాబ్ గతి తప్పడం మొదలైంది. ఉపగ్రహా జీవిత కాలం ప్రణాళిక ప్రకారం 1974 లో స్కైల్యాబ్ జీవిత కాలం ముగిసిన తరువాత 8 -10 ఏళ్ళ వరకు కక్ష్యలోనే ఉండాల్సి ఉండగా, సౌర కార్యకలాపాలు ఎక్కువ కావడంతో ఉచ్ఛస్థాయిల్లో వాతావరణం పలుచబడి జీవిత కాలం సమయానికంటే ముందే స్కైల్యాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
1978 చివరలో స్కైలాబ్ నియంత్రణ కోల్పోయి గతి తప్పడం గుర్తించారు. చివరకు అది వేగంగా వచ్చి భూమిని ఢీకొనడం తప్ప వేరే మార్గం లేదని అంతా భావించారు. అదే విషయాన్ని నాటి ప్రధాన ప్రసార మాధ్యమం అయిన రేడియోల ద్వారా పదే పదే ప్రకటింప చేశారు. ఫలితంగా ప్రజలు విపరీత భయాందోళనలకు గురయ్యారు. ఇంకా భారత భూభాగంలోనే ఢీ కొంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో… నిజామాబాద్ ఎక్కడైనా పడే అవకాశం ఉందంటూ పత్రికల్లో వెలువడ్డ వార్తలు మరింత ఆందోళనకు దారితీసింది. నాడు ఊరూరికీ పత్రికలు రాకున్నా, ఈ వార్తలు దావనంలా వ్యాపించాయి. నాటి ప్రధాన ప్రసార సాధనమైన రేడియో ఉన్న ఇళ్ళ వద్ద జనం గుమి కూడడం, భయాందోళనలకు లోనవడం సర్వ సాధారణంగా మారింది.

తెలంగాణ మొత్తం స్కైలాబ్ బారిన పడుతుందన్న శరవేగ ప్రచారం చదువుకున్న, చదువులేని వారు అన్న తేడా లేకుండా తీవ్ర ఆందోళనలో ముంచెత్తి వేసింది. 1979లో జరిగిన ఈ సంఘటన మూడు వారాల పాటు ప్రతి ఆవాస ప్రాంతంలో ఆబాల గోపాలాన్ని కంటికి కునుకు లేకుండా చేసింది.
స్కైలాబ్ వలన భూమికి భారీ నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. భూమి పై పడితే మహా ప్రళయం సంభవించినట్టేనని భావించిన అనేక మంది ప్రజలు చాలామంది తమ జీవితాలకు అవే చివరి రోజులని భావించి ప్రాణాలను అరి చేతుల్లో పెట్టుకుని కాలం వెళ్ళ దీశారు. ఆకాశం నుంచి నక్షత్రం లాంటిది భూమిని ఢీకొనబోతోందని, దీంతో ప్రళయం వస్తుందని, మనుషులంతా చనిపోతారన్న ప్రచారం నానాటికీ అధికం అయింది.
అయితే అంతరిక్షంలో 24 వారాల పాటు పనిచేసిన తరువాత, కక్ష్య క్షీణించి భూవాతావరణంలోకి ప్రవేశించి స్కై లాబ్ విచ్ఛిన్నమై పోయింది. అంతరిక్ష ముగ్గురు వ్యోమగాముల బృందం స్కైల్యాబ్ భూమిపై పడి నాశనమయ్యే లోపు తమకున్న పరిజ్ఞానంతో 1974 ఫిబ్రవరి 8 న భూమికి తిగి వచ్చేశారు. 1979 జూలై 11 న స్కైల్యాబ్ భూవాతావరణం లోకి ప్రవేశించి విచ్ఛిన్నమై పోయింది. స్కైలాబ్ కక్ష్య క్షీణించి, జూలై 11, 1979 న హిందూ మహాసముద్రం మీదుగా వాతావరణంలో కాలిపోయింది. దాని శకలాలు హిందూ మహా సముద్రం లోను, పశ్చిమా ఆస్ట్రేలియా లోనూ పడ్డాయి(skylab satellite).
ఇదిలా ఉంటే స్కై లాబ్ భూమిని ఢీకొని భారీ ప్రాణ, ఆస్తి తదితర నష్టం కలిగించ గలదనే ఉధృత ప్రచార నేపధ్యంలో…నాటి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. మర్రి చెన్నారెడ్డి… 1979 జూలై 11న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో స్థానికుల సమక్షంలో, వేద పండితులతో కూడి భగవదారాధన లో గడపడం, ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగి వెళ్ళడం విశేషం..
