తెలుగు సంగీత సినీ వినీలాకాశంలో మూడున్నర దశాబ్దాల పైగా వేలాది పాటలు రాసిన చేయి తిరిగిన కలం శాశ్వతంగా ఆగి పోయి ఏడాది అయింది. గత సంవత్సరం నిమో నియా ( ఊపిరితిత్తుల క్యాన్సర్) కారణంగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో నవంబర్ 24న చేరిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి నవంబర్ 30 సాయంత్రం ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన నేపథ్యం విదితమే.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామ శాస్త్రి. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన వేద పండితుడు, డా.సి.వి.యోగి, అమ్మాజి (సుబ్బలక్ష్మి)కి జన్మించారు.
అనకాపల్లి లోని మున్సిపల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేశారు. అనంతరం అనకాపల్లిలోని బీఎస్ఎన్ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో చురు కైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక, దేశభక్తి గీతాలు రాయడం సీతారామశాస్త్రికి అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం సొంతంగా పాటలు రాసి అలపించేవారు.
1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిసే అవకాశం కలుగగా, సీతారామ శాస్త్రి ప్రతిభను కె.విశ్వనాథ్ గుర్తించారు. ఆయన చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన పాటలు ఎంతగానో జనాదరణ పొందాయి. అలా ఆ సినిమా పేరే సీతారామశాస్త్రి ఇంటి పేరుగా మారింది. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామ శాస్త్రికే దక్కిన అరుదైన గౌరవం. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 800కు పైగా చిత్రాలలో, సిరివెన్నెల మూడు వేలకు పైగా పాటలు రాశారు.
విరించినై = బ్రహ్మను నేనై, విర చించితిని = రచించితిని, ఈ కవనం = ఈ కవిత్వం, విపంచినై = వీణనై, వినిపించితిని = వినిపిస్తున్నా,
ఈ గీతం =ఈ పాటను అంటూ బ్రహ్మగా కొంగ్రొత్త రచనల పరంపర సృష్టించి, చదువుల తల్లి వీణ సాయంతో వినిపించడం ప్రారంభించిన సిరివెన్నెల సినీ లోకానికి, తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు. తెలుగులో ప్రజానీకానీకి తెలిసిన, తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించారు, ప్రజల హృద యాలకు చేర్చారు సిరివెన్నెల.
విధాత తలఁపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టింది. విధాత తలపున ప్రభవించినది.. సిరివెన్నెల రాసిన తొలి పాట. చివరిసారిగా.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాట రాశారు.
చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటి లోనూ తన ప్రతిభను నిరూపించు కున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. తన ఉత్తమ విమర్శకు రాలిగా తన భార్య ‘పద్మావతి’ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ వై. సత్యారావు అని చెప్పేవారు.
ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అని పాట పాడే ప్రభావ శీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా, తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం లభించటం విశేషం. సినీ సాహిత్య రంగంలో చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన సినీ కెరీర్లో మొత్తం 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందు కున్నారు.
ఉత్తమ గేయ రచయితగా :1986 సిరివెన్నెల, 1987 – శ్రుతిలయలు, 1988 – స్వర్ణకమలం, 1993 – గాయం, 1994 – శుభలగ్నం, 1995 – శ్రీకారం, 1997 – సింధూరం, 1999 – ప్రేమకథ, 2005 – చక్రం, 2008 – గమ్యం, 2013 – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలలో ఆయన రాసిన పాటలకు , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఆయనకు లభించాయి. 2005 – నువ్వొస్తా నంటే నేనొద్దంటానా, 2008 – గమ్యం – ఎంతవరకు, 2009 – మహాత్మ – ఇందిరమ్మ, 2015 – కంచె దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు పొందారు.
