“నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’’
ఆంధ్ర ప్రదేశ్ లోని ఉభయ గోదావరి నదీ తీర వాసులు గోదావరీ స్నానాల సమయంలో సంకల్పం చేసేప్పుడు పఠించే సాంప్రదాయం ఆచరిస్తారు. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమా చరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం.
కేవలం గోదావరి స్నానమాచరించే అవకాశమే కాదు, తమ జీవితాల్లో సమూల మార్పులకు మూలం ఆర్థర్ కాటన్ ఆలోచనే అని గోదావరి తీర వాసులు నేటికీ విశ్వసిస్తారు. అందుకు అనుగుణంగా ఆయనను నిత్యం తమ పూజా మందిరంలో కొలిచేవాళ్లు, తమ ఇంటి వద్ద, సమీపాలలో కాటన్ మహాశయుని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆరాధించేవాళ్లు చాలామంది కనిపిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో అనేక అంశాలలో గోదావరి, కృష్ణా తీరం ముందు ఉండడంలో కాటన్ శ్రమ ఉందని భావించక తప్పదు.
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి జీవితాన్ని ఫణంగా పెట్టిన మేధావి, కార్యశీలి. కాటన్ 15 ఏళ్ల వయసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంజనీరింగు సర్వీసుల్లో చేరి శిక్షణ పొందారు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్‌గా నియమితుడైన ఆయన విధి నిర్వహణలో భాగంగా 18 ఏళ్ల వయసులో భారత దేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగిగా పనిచేశారు.
అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ తరుఫున దక్షిణ భారత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో 1828-29 మధ్య కాలంలో కావేరీ నది వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశారు.
కరువు పీడిత ప్రాంతం గోదావరి డెల్టాగా రూపాంతరం చెందడంలో ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట ప్రధాన పాత్ర పోషించింది. అప్పటి జిల్లా అధికారిగా ఉన్న సర్ హెన్రి మౌంట్ పంపించిన నివేదిక ఆధారంగా ఆనకట్ట నిర్మాణం ఆలోచన తెరమీదకు వచ్చింది. ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకు సదరు ప్రతిపాదన అప్పగించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని బ్రిటీష్ ప్రభుత్వం అప్పగించడంతో ఆయన అందుకు అనువైన ప్రాంతం కోసం సుదీర్ఘ అన్వేషణ చేశారు.
అలా 1840లోనే కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఆయన రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ ట్వేల్ డేల్ ఆమోదించారు. లండన్‌లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదానికి పంపించారు. ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించిన తర్వాత, 1846 ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్టను కాటన్ ఆధ్యర్యంలో నిర్మించేందుకు లండన్ నుంచి అనుమతి లభించింది.
1847 ఏప్రిల్ నెలలో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆనకట్ట నిర్మాణంలో పది వేలమంది కూలీలతో పాటుగా ఐదు వందల మంది వడ్రంగులు, ఐదు వందల మంది కమ్మరులను వినియో గించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి సుమారుగా 6 కి.మీ. వెడల్పు ఉంటుంది. 1847 అగస్టు మూడో వారంలో రైల్వే వ్యాగన్ల ద్వారా ఉక్కు, రాయిని ధవళేశ్వరానికి తరలించారు. దాంతో యంత్ర సామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మర మయ్యాయి. నది ఒడ్డుకు చేర్చిన రాళ్లు, ఇతర సామగ్రిని పడవల ద్వారా నదిలోని నిర్మాణ ప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వినియోగించారు. కాటన్ కు కూలీలతో పాటుగా ఇంజనీర్లయిన భారతీయులు కూడా కొందరు తోడుగా ఉన్నారు. వారిలో తొలి నాటి ఇంజనీర్లలో ఒకరైన రాజ్ బహుదూర్ వీణం వీరన్న కూడా ఉన్నారు. కాటన్ పర్యవేక్షణలో ఈ ఆనకట్టను వేగంగా పూర్తి చేశారు. తర్వాత 1852 గన్నవరం అక్విడక్టు పనులు కూడా కాటన్ ప్రారంభించారు. ఐదేళ్ల లోనే నిర్మాణం జరగడంతో 1852 నాటికి అందుబాటు లోకి వచ్చింది.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతమున్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌కి పూర్వ రూపంగా ఆనకట్ట ఉండేది. అనేక వరదల తాకిడికి ఆనకట్ట దెబ్బ తినడంతో చివరకు 1970వ దశకంలో కొత్తగా బ్యారేజ్ నిర్మాణం చేశారు.
20వ శతాబ్దం తొలినాళ్లలోనే ఆయా ప్రాంతాల్లో వెనువెంటనే ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి రావడం తో పాటు, పారిశ్రామి కాభివృద్ధి, విస్తారంగా పంటలు, రవాణా సదుపాయాలు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా గోదావరి జల ప్రవాహం ద్వారా లభించాయి.
కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దే. ఆయన బెంగాల్, ఒడిసా, బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవ ఉపయోగం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు ఎంతో రుణ పడి ఉంటారు. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణదాతగా మార్చిన ఆర్థర్ కాటన్… అపర భగీరథునికి, ప్రాతః స్మర స్మరణ చేయడం తప్ప ఏమిచ్చుకో గలరు.
