షట్ తిల ఏకాదశి, తిలాదాన ఏకా దశిని మాఘమాసంలో కృష్ణ పక్ష ఏకాదశి నాడు జరుపు కుంటారు. 2022లో షట్టిల ఏకాదశి జనవరి 28నాడు వస్తున్నది. షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి. ఆ ఆరు తిల విధులు.1) తిలా స్నానం…నువ్వుల నూనె వంటికి రాసుకుని, నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి. 2) తిల లేపనం…స్నానానంతరం నువ్వు లను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం. 3) తిల హోమం…ఇంటిలో తిల హోమం నిర్వహించాలి. 4) తిలోదకాలు … పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట, నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం. 5) తిలదానం… నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. 6) తిలాన్నభోజనం… నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది.
ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే, శ్రీమన్నా రాయణుడు సంతసించి ఇహ లోకంలో సర్వసుఖాలు, మరణా నంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడని, శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి ఆశీర్వదిస్తారని పురాణ కథనాలు. పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణాలు వదలడం ఆచారంగా వస్తున్నది.
ఈ ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి. తెల్ల నువ్వు లతో దేవతలకి , నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీలలొ వేసుకుని ఆ నీరు తాగాలి. ఒక రాగి లేదా కంచు పాత్ర లో నువ్వులు పోసి దానం చేయాలి. నువ్వులు దేవుడికి నివేదన చేసి , అందరికి నువ్వుల ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత దానిని తినాలి.
షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తుడు ఉదయాన్నే స్నానం చేసి, పీఠాన్ని అలంకరించి, శ్రీకృష్ణుడు లేదా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించి, విష్ణు సహస్రనామాన్ని కృష్ణనామస్మరణలతో కలిపి సమర్పించాలి. తులసి నీరు, కొబ్బరి కాయ, పువ్వులు, ధూపం, పండ్లు మరియు ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించాలి. రోజంతా భగవంతుని స్మరించాలి. ద్వాదశి సందర్భంగా రోజు మరుసటి రోజు ఉదయం పూజను పునరావృతం చేసి, ప్రసాదంలో పాల్గొన్న తర్వాత ఉపవాసాన్ని ముగించాలి.
ఉపవాసం ఏకాదశి రోజున తెల్లవారు జామున ప్రారంభమై ద్వాదశి ఉదయం వరకు కొనసాగుతుంది. ద్వాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేసిన తర్వాత పారణ సమయంలో ఉపవాసం విరమించాలి. ఉపవాసం అంటే ఏమీ తినకూడదు. కొందరు భక్తులు ఆ రోజు నువ్వులు మాత్రమే తింటారు. పూర్తి ఉపవాసం సాధ్యం కాకపోతే, భక్తులు పాలు మరియు పండ్లు త్రాగవచ్చు.
తిల ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ పరంధాముడు సంతసించి దైహిక సంబంధమైన సర్వసుఖాలు సహా ఆ తరువాత ఊర్ధ్వ, అధో లోకాల్లో కూడ ఉత్కృష్ఠ స్థానం అనుగ్రహిస్తూ దీవిస్తాడని విశ్వాశం.