ప్రతిభ ఉండీ, అందం, అభినయం అద్భుతంగా కలిగి, అవకాశాలు గడప తట్టినా, వాటిని వినియోగించు కొలేని తెలుగు సినీ నటి చిత్తజల్లు కాంచనమాల. తెలుగు సినీ ప్రపంచంలో తొలి తరం కథానాయికగా, ఆమె పేరుతో, ఫోటోతో తయారు చేసి మార్కెట్ లోకి వదిలిన వస్తువులు క్షణాలలో అమ్ముడు పోయాయంటే ఆమెకు ఆ రోజుల్లో గల క్రేజీ అర్థం అవుతుంది. అంతటి అభిమాన గణం కలిగి, నిర్మాతలు, దర్శకులు ఆమె తమ చిత్రాలలో నటించాలని కోరుకున్నా, విధి వంచితయైన ఆమె జీవితం హృదయ విదారక రం.కాంచనమాల (మార్చి 5, 1917 – జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆమె జన్మస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఆమె ఒకరు.కాంచనమాల మార్చి 5, 1917లో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి (అమృతలూరు)లో జన్మించారు. చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూప లావణ్యం, విశాల నేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన కృష్ణ తులాభారం (1935) లో మిత్రవింద వేషం వేయించారు. రూప లావణ్యవతి అయిన ఆమె ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకు తిప్పుకున్నారు. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యు (1936) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించు కున్నారు. ఆ తర్వాత వరుసగా విప్ర నారయణ (1937), మాల పిల్ల (1938), వందేమాతరం (1939), మళ్ళీ పెళ్ళి (1939), ఇల్లాలు (1940), మైరావణ (1940), బాల నాగమ్మ (1942) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. విప్ర నారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయేదిగా మారింది. తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి, మాల పిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్ళి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించు కున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం. ఆ సినిమా రెండవ భాగంలో ఆమె విద్యావంతురాలిగా కన్పిస్తారు. ఒక సీన్లో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో కాలెండర్ల మీద అచ్చయింది. అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచన మాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి..ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వాంప్ పాత్ర ధరించిన ఆమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య సరసన నటించారు. అది నాగయ్య రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్య, కాంచనమాల గారు ఇద్దరూ పేరు తెచ్చు కున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీపెళ్ళి వితంతు వివాహాన్ని ప్రబోధించిన చిత్రం. ఆ చిత్రంలో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునే వారట.ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదల అయి మునుపటి సినిమాలంత విజయం సాధించలేక పోయినా ఆంధ్రపత్రిక ఫిలిం బ్యాలెట్ లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు. ఆ సమయంలో విడుదల ఐన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేక పోయింది. ఆ తర్వాత జెమినీ వాసన్ నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచన మాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పిదం అయింది.ఆ సమయానికే పేరు పొందిన కాంచనమాల చెంతకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాలలో నటించడానికి వీలు లేక పోయింది. ఆ సమయంలో వాసన్ కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించక పోవడంతో కాంచనమాల వాసన్ తో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన ససేమిరా అన్నారట. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయం లోనే బాల నాగమ్మ విడుదల అయి అఖండ విజయం సాధించి, లాభాలను సంపాదించి పెట్టినా, వాసన్ కు ప్రయోజనం చేకూర్చాయి అంటారు. కాంచన మాల నటనకు ఈ సినిమా గీటురాయి అయినా, ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రం అయినది. ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్లు ఆ షాక్ తో శూన్యం లోనికి చూడటం మొదలు పెట్టాయి. హిందీ చిత్ర సీమలో అవకాశాలు కలిగినా, తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు అలా దురదృష్టం వెంటాడడం అత్యంత విచారకరం. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర ప్రపంచం ఓ మహానటిని కోల్పోయింది. ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య క్షయ వ్యాధితో మరణించారు. దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కాంచనమాల స్నేహితురాలు , నటి ఐన లక్ష్మీరాజ్యం 1963 లో నర్తనశాల చిత్రం నిర్మించారు. లక్ష్మీరాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల. 1940 లో ఆమె స్వంత ఊరు తెనాలిలో “శాంతి భవనం” అనే భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్న కాంచనమాల, ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో జి.వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు. వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదట. మహా కవి శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాలపై 2 సార్లు కవితలల్లారు. కాంచన మాల 1981 జనవరి 24 న మద్రాసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
