సత్యజిత్ రాయ్…(Sattyagith Rai) సినిమాల గురించి ఏ కొంచెం అవగాహన ఉన్నా, ఈ పేరు సుపరిచితమే.
ప్రపంచం లోని సినీ దర్శకులలో అగ్రశ్రేణికి చెందిన ప్రతిభాశాలి సత్యజిత్ రాయ్. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళా దర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన శాఖలలోనే కాకుండా చిత్రకళ లోనూ, సాహిత్యం లోనూ సాటి లేని మేటిగా తనదైన ప్రత్యేకత చాటుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారత దేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. అయన ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించారు(Sattyagith Rai). కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించి ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎకనామిక్స్ చదువుకున్న సత్యజిత్ 1940-41లో తమ కుటుంబానికి మిత్రుడైన రవీంద్ర నాథ ఠాకూర్ బతికుండగానే శాంతినికేతన్ వెళ్ళి చిత్రకళ అభ్యసించారు. సినిమాలూ, గ్రామఫోన్ రికార్డ్ల మోజుతో 1942లో కలకత్తాకు తిరిగి వచ్చారు. 1943 నుంచి సుమారు పన్నెండేళ్ళపాటు ఒక బ్రిటిష్ అడ్వర్తైజింగ్ కంపెనీలో పని చేశాక సినీ రంగంలో కాలు మోపారు. 1955లో పథేర్ పాంచాలీ సినిమాకు దర్శకత్వం వహించిన తరవాత దర్శకుడుగా దేశవిదేశాల్లో పేరు సంపాదించు కున్నారు. అంతకు ముందే కలకత్తా ఫిల్మ్ సొసైటీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. 1949లో కలకత్తాకు వచ్చిన ప్రసిద్ధ ఫ్రెంచ్ దర్శకుడు ఝాఁ రెన్వార్ వెంట తిరిగి సమకాలీన సినిమా గురించి అవగాహన చేసుకున్నారు.
సంవత్సరానికి ఒక సినిమా చొప్పున అతను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి. కొన్ని బెంగాలీ సాహిత్యం నుంచి తీసుకున్న కథలైతే కొన్ని స్వయంగా రాసుకున్నవి. సీరియస్ కళాఖండాలే కాక పిల్లల కోసం సాహసాలూ, హాస్యంతో కూడిన సినిమాలూ తీశారు. సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, వాస్తవిక జీవిత చిత్రణ, అపూర్వం అనిపించే సినీ పరిభాషా, కళా నైపుణ్యం అడుగడుగునా ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేసే దర్శకుల్లో రాయ్ ఒకరు. రవీంద్రుడి ‘చారులతా’ మొదలుకొని పిల్లల సినిమా ‘గోపీ గాయేన్’ వంటి జానపద చిత్రాలూ, హిందీలో ప్రేంచంద్ కథ ఆధారంగా ‘శత్రంజ్ కే ఖిలాడీ’, రవీంద్రనాథ ఠాకూర్ మీద అద్భుతమైన డాక్యుమెంటరీ ఒకటీ ఇలా ప్రతీ ఒక్కటీ కళాఖండం అనిపించేట్టుగా నిర్మించారు. ఆయనకు దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉందేది. తమ సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే, కేస్టింగ్, సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము – వంటివి కూడా ఆయనే చూసుకునేవారు.
రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది.
కంప్యూటర్ ఫాంట్లు వ్యాప్తిలోకి రాకముందే రాయ్ బెంగాలీ అక్షరమాలలో కొత్త శైలులని ప్రవేశపెట్టారు. బెంగాలీలో అనేక కథలూ, వ్యాసాలూ, నవలలూ కూడా రాశారు. సైన్స్ ఫిక్షన్, డిటెక్టివ్ సాహిత్యం మొదలైన ప్రత్యేక విషయాల గురించి కథలు రాసి, ఫేలూ దా మొదలైన పాత్రలతో జైసల్మేర్ కోట నేపథ్యంతో ‘షోనార్ కెల్లా’ వగైరా సినిమాలు కూడా తీశారు.
బెంగాలీ సంస్కారాన్నీ, భారతీయతనూ ఒంట పట్టించుకుని ప్రపంచ స్థాయికి ఎదిగిన సత్యజిత్ రాయ్ ఏ ప్రక్రియను చేపట్టినా ప్రతిభా వంతంగా నిర్వహించ గలిగారు. తన చిన్నతనంలోనే ఆర్థర్ కోనన్ డాయిల్ డిటెక్టివ్ కథలనూ, ఎచ్.జి.వెల్స్ తదితరుల సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్నీ అభిమానించే వారు.
సత్యజిత్ రాయ్ పిల్లల కోసం “ఫెలూదా” అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో – ఫెలూదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసారు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది.
సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక “సందేశ్”ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నారు.
40 ఏళ్ళు సినీరంగంలో ఓ వెలుగు వెలిగి, మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగా, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగ ప్రముఖునిగా నిలిచారు. సత్యజిత్ రాయ్ మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది.
