5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleLife styleస్వతంత్ర భావుకుడు శంకరంబాడి

స్వతంత్ర భావుకుడు శంకరంబాడి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 – ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.

శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను సుందరకవి, భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు.

సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. సనాతన సంప్రదాయాలను వ్యతిరేకించే వాడు.కన్న తండ్రి మందలిస్తే, కోపం తెచ్చుకుని, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.

భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.

అమితమైన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగాడు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనో వ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాస ముంటున్న ఇంట్లో మరణించాడు.

2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.

మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.

రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటి కవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు కూడా వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి “మా తెలుగు తల్లికి” గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళ గీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.

ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.

సుందరాచారి గురించి పలువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి…

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి … మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగి వీరి కవిత్వము అనందము నాపాదించకలిగి ఉంది.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ… తెలుగు పలుకు, కవితాశక్తి, సౌకుమార్యము, ఈమూడు గుణములు మూటకట్టి వీరు పొత్తములను రచించు చున్నట్లున్నది. ఈ యుగములో వీరిదొక ప్రత్యేక వాజ్మయముగా ఏర్పాటు కాబోవు చున్నట్లున్నది. వీరిశైలి సంస్కృత సమాసముల నుండియు, మారుమూల పదముల నుండియు విడివడి సరళమైనది.

గడియారం వేంకటశేష శాస్త్రి …ఈతని శైలి మిక్కిలి సరళమైనది. భాష సుగమనమైనది. ధార సహజమైనది. పోకడలు, ఎత్తుగడలు, అలంకారములు చమత్కారములు, మున్నగు ప్రసాధనము లన్నియు సుమచిత సన్నివేశములే భావ శ్రుతిలో మేళవించినవి.

శ్రీరాయప్రోలు సుబ్బారావు… సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత.

శ్రీమాన్ రాళ్ళపళ్ళి అనంతకృష్ణ శర్మ…తేటగీతుల తెలుగు తీదీపిరుచుల యూట….కొంకుల కొసరుల కాటుపడక సారతరమిది సుందరాచారి కవిత.

శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. “నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం” అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన తేటగీతులలోనే రాసిన మా తెలుగు తల్లికి.. ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ,
మా కన్న తల్లికి మంగళారతులు.

కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి.

గల గలా గోదారి కదలి పోతుంటేను, బిర బిరా కృష్ణమ్మ పరుగులిడు తుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక;

రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తీ, తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయని కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక, నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం;

జై తెలుగు తల్లీ, జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments