అనితర సాధ్యాలు…సంగం లక్ష్మీబాయి సేవలు

Date:

తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీర వనిత ఆమె.
బాలికల, స్త్రీల సంక్షేమం కోసం నిరంతరం తపించి, జీవితాంతం చిత్తశుద్దితో పాటుపడిన సేవా నిరతికి ప్రతిరూపం ఆమె. స్వాతంత్ర్య సమర యోధురాలుగా తామ్రపత్ర గ్రహీత ఆమె. శాసన సభ్యురాలిగా, విద్యా మంత్రిణిగా, ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిణిగా, హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా, ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా, అంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ బాధ్యు రాలిగా సమర్థ వంతంగా పనిచేసి, ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె. ఆమే ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభ సభ్యురాలైన తొలి మహిళగా గుర్తింపు పొందిన సంగం లక్ష్మీబాయి.
సంగం లక్ష్మీబాయి(జూలై 27, 1911 – జూన్ 3, 1979) 1911, జూలై 27 న ఘటకేసర్ సమీపం లోని ఒక కుగ్రామంలో జన్మించారు. బాల్యం లోనే తల్లిదండ్రులు, చిన్నతనం లోనే వివాహమై భర్త చని పోవడంతో ఆమె అనాథ అయ్యారు. చాలా చురుకైన బాలిక కావడంతో మద్రాసు ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం లభ్యమైంది. కార్వే విశ్వ విద్యాలయం, ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ప్రారంభించిన శారదా నికేతన్, మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో చదువు కున్నారు. అక్కడ ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. నారాయణ గూడలో ఉన్న రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ బాధ్యతలు చూసు కుంటూనే మరోవైపు స్వాతంత్ర్యో ద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఎంతోమంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేశారు.
ఆమె సాంఘిక సేవలోనే పూర్తి సమయం వెచ్చించి ఆ తర్వాత రాజకీయాలలో చేరారు. ఆమె విద్యార్థిగా ఉన్న రోజులలో సైమన్ కమీషన్ ను వ్యతిరేకించారు. ఉప్పు సత్యాగ్రహం (1930-31) లో క్రియాశీలంగా పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు.

స్వామి రామానందతీర్థ ఆధ్వర్యంలో సాగిన నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు. 1932లో శాసనోల్లంఘనలో పాల్గొని అరెస్ట్ అయి రాయవెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. ఆమె వినోభా భావే యొక్క తొలి పాద యాత్రకు తెలంగాణలో సారథ్యం వహించారు. 1950లో భూదానో ద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబా బావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. 1947-48లో తెలంగాణ విమోచనో ద్యమం లోనూ పాల్గొన్నారు. విమోచన అనంతరం సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఆమె 1952 లో నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్‌లో విద్యాశాఖ సహాయ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదన మొత్తాన్ని స్త్రీ సేవాసదన్‌కు ఉపయోగించారు. 1955లో దాన్ని తన సహచరులైన కేవీ రంగారెడ్డి, ఎ.శ్యామలాదేవి, పి.లలితాదేవి, పాశం పాపయ్య, ఎం.భోజ్‌రెడ్డితో కలిసి ఇందిరా సేవా సదన్‌గా రిజిస్టర్‌ చేయించారు. తద్వారా అనాథ మహిళలు, శిశువులకు ఉచిత విద్యనందించారు. సంతోష్ నగర్ చౌరస్తాలో ప్రస్తుతం ఐ.ఎస్.సదన్ గా పిలవబడుతున్న ప్రాంతంలో ఆమెకు రెండెకరాల స్థలంలో ఇల్లుండేది. తమ సొంత ఇంటిలోనే అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. అదే కాకుండా రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్, మాశెట్టి హనుమంతు గుప్తా బాలికల ఉన్నత పాఠశాలల యొక్క స్థాపనలో ఆమె పాత్రలు మరిచి పోలేనివి.

లక్ష్మీబాయి సేవల గురించి తెలుసుకున్న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా వచ్చి సాయం చేశారు. నాటి డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డితో పాటు ఇందిరా గాంధీ కూడా సేవా సదనం నిర్వహణకు తోడ్పాటు అందించారు.
1957లో మెదక్‌ నియోజక వర్గం నుండి 2వ లోకసభకు ఎన్నిక య్యారు. 1962 లో 3వ లోకసభకు ఎన్నికయ్యారు. మూడవ సారి 1967లో 4వ లోకసభకు వరుసగా మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

హైదరాబాదు యాదవ మహాజన సమాజం అధ్యక్షురాలిగా, అఖిల భారత విద్యార్థి సంఘం ఉపాధ్యక్షు రాలిగా, హైదరాబాదు ఫుడ్ కౌన్సిల్, ఆంధ్ర యువతి మండలి అధ్యక్షురాలిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ సలహా బోర్డుకు కోశాధికారిణిగా, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగ కన్వీనరుగా ఉన్నారు. ఆమె పద్దెనిమిదేళ్ల పాటు ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ బాధ్యురాలిగా కొన్నాళ్లు పని చేశారు. స్వాతంత్య్ర సమర యోధురాలిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు తామ్రపత్రం ఇచ్చి గౌరవించింది. 1979లో మరణించే వరకు లక్ష్మీబాయి స్త్రీలు, బాలికల సంక్షేమం కొరకు నిర్విరామ, అసమాన కృషి చేశారు.

రామకిష్టయ్య సంగనభట్ల... 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల… 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...