దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ జాన పదులు ఆరాధ్య దైవాలుగా కొలవడం సదాచారంగా మారింది. దాదాపు 900 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వన దేవతల జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే సాగుతుంది. అయితే గిరిజనులే కాక, గిరిజనే తరులు సైతం గద్దెలెక్కిన దేవతల ను కొలవడం వంశపారం పర్య ఆచరణగా కొనసాగుతున్నది. కాకతీయులు మొదట సబ్బినాడు (కరీంనగర్) లోనే రాజ్యము చేసి, చాళుక్యుల దయచే అనుమ కొండను సంపాదించారనే భావనకు, ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని పొలవాసలో ఏకశిలాదేవి కాకతీ యుల కులదైవం మందిరం ఆనాడు ఉండడం ఊతమిస్తున్నది. కాకతీయులలో మూడవ రాజైన రెండవ బేతరాజు, మహా మండలే శ్వర మేడరాజుకు సామంతుడని శాసనాధారులున్నాయి. జగిత్యాల జిల్లాలో ఆర్వెల్లి (ఆరువేల గ్రామం)లో నేటికీ ఎత్తైన ఆర్వెల్లి నాయకమ్మ విగ్రహం కలిగి, ఏటా జాతర జరుగు తున్నది. బేతరాజు సబ్బి సహస్రం (ఆరువేల నాడు)ను పాలించాడని చరిత్రకారుల భావన. బేతరాజు తర్వాత రెండవ ప్రోల రాజు రాజై, జగిత్యాల సమీప పొల వాస రాజ్యాన్ని ఏలే మేడరాజును గెల్చి, సామంతునిగా నిలిపాడని, అలాగే మంత్రకూటపు (మంథెన) రాజైన గుండె రాజును గుండారం వద్ద ఓడించి, అవమాన పరిచాడని, గుండెరాజు, మేడరాజు అన్నదమ్ము లని పరిశోధనలు జరిగాయి. ప్రోలుని తర్వాత రాజైన కాకతీయ రుద్రుడు నగునూరుపై దండెత్తి దొమ్మ రాజును ఓడించాక, పొలవాసపై దండెత్తగా, మేడరాజు పారిపోగా, హుస్నాబాద్ సమీప ఆకునూరుకు చేరుకుని, మూల సైనిక బలంతో మైళగి దేవుని కళ్యాణి వరకు తరిమిన క్రమంలో, రుద్రరాజు స్వతంత్రుడైన సందర్భం లో, యావదాంద్రదేశం రుద్రుని పాలన కిందకు 1162లో వచ్చినట్లు చరిత్రకారులు తెలుగు ప్రజలందరిని ఒక్కటిగా చేసిన సంవత్సరం గా గుర్తించారు. మేడరాజు తమ్ముడ గు ఏడెరాజు వేయించిన శాసనం రామగుండం వద్ద లభించుటచే ఏడెరాజు ఆప్రాంత సామంతుడుగా ఉండినట్లు అభి ప్రాయాలున్నాయి. గణపతి దేవుని కాలాన కరీంనగర్ జిల్లా మొత్తం సామంత పల్లవుల పాలనలో ఉండెనని తెలుస్తున్నది. గణపతి దేవుని తర్వాత రుద్రమ సింహాస నమెక్కింది. కాకతీయు లలో చివరివాడు ప్రతాప రుద్రుడు. స్థానిక కథనాల ప్రకారం పొలవాస ను పాలించిన మేడరాజు ఏకైక పుత్రిక సమ్మక్కను తన మేనల్లుడైన మేడారం పాలకుడగు పగిడిద్దరాజు తో వివాహం జరిపించాడు. వారికి సారలమ్మ నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. ప్రతాప రుద్రుడు పొలవాసపై దండెత్తగా, మేడరాజు పోరిపోయి, పగిడిద్ద రాజుకు ఆశ్రయుడైనట్లు, పడిగిద్ద రాజుపై ఆగ్రహించిన ప్రతాప రుద్రుడు మాఘ పౌర్ణమినాడు మేడారం పై దండెత్తినట్లు, మేడ రాజు, పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధం లో వీరస్వర్గం పొందినట్లు, సమ్మక్క సైతం కాకతీయలతో వీరోచితంగా పోరుసల్పి, గిరిజన యుద్ధ తంత్రా న్ని ప్రదర్శించినట్లు ప్రచారంలో ఉంది.
సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి పెద్ద జాతర, అలాగే మినీ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు.
అవిభక్త కరీంనగర్ జిల్లాతో విడదీయరాని అను బంధం, సంబంధం కలిగిన సమ్మక్క – సారలమ్మలకు అత్యధికంగా వనదేవతల గద్దెలున్నాయి. దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్ అయినవి కరీంనగర్ జిల్లాలో 41 కాగా, వరంగల్ జిల్లాలో 12 ఉన్నాయి. ఆదిలాబాద్ లో వేళ్ళపై లెక్కించేవి కాగా, ఇతర జిల్లాలలో బహుస్వల్పం.
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, దక్షిణ కుంభ మేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు (మండె మెలిగే పండగ) నిర్వహించేందుకు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ఘనంగా జరుగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది న సమ్మక్క- సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్ల కోసారి వైభవం గా జరుగుతుంది. జాతరలో భాగంగా నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించ నున్నారు.
నాలుగు రోజులలో ఏరోజు ప్రత్యేకత ఆ రోజుకు ఉంది.
ఫిబ్రవరి 16న…సారక్క, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెల దగ్గరికి తీసుకువెళ్తారు. ఫిబ్రవరి 17న…చిలుకల గుట్టనుంచి సమ్మక్కని గద్దెలవద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 18న…భక్తులు సమ్మక్క సారక్కలకు చెట్లను, బంగారం, బెల్లాన్ని కానుకలుగా అందిస్తారు. ఫిబ్రవరి 19న… సమ్మక్క సారక్కలను తిరిగి గద్దెల నుంచి అడవిలోకి చేరుస్తారు. దీంతో మహా జాతర సమాప్తమవుతుంది.
జాతరలో మొదటి రోజైన 16న సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించ నున్నారు. 17న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేయనున్నారు. 18న భక్తులు అమ్మవారిని దర్శించు కుంటారు. సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం 19వ తేదీన జాతర ముగియనుంది. ఉత్తర తెలంగాణ నుండి అధిక సంఖ్యాకులైన భక్తులు ఈ జాతరకు సనాతన సంప్రదాయ వారసత్వ ఆచారంలో భాగంగా క్రమం తప్పకుండా వెళ్లడం పరిపాటి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు.
