విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు

Date:

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక విలక్షణ నటులు ఎస్వీ రంగారావు. రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికా భినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరు గాంచారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రిక, ఐతిహాసిక పాత్రలు ఏవైనా వాటిల్లో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మహానటులు యస్వీఆర్. నవరసాలను అలవోకగా అవలీలగా పాత్రల ద్వారా ఒలికించిగల అతికొద్ది మంది నటుల్లో ఎస్వీఆర్ ది అగ్రస్థానం.

ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన జన్మించారు. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో ఆయనలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు.
ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం.
రంగారావు కు మాత్రం నటుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. కాకినాడ లోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. ఆయనకు ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణ రావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది.

నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావు కు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. మొదట బందరు లో తర్వాత విజయ నగరంలో ఫైర్ ఆఫీసరు గా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు.
ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడ సాగారు.

నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావు కిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావు కిచ్చారు.

పరభాషా సినిమాలు కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.

నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియా లోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించ బడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథా నాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్నది.

మొదటి సినిమా వైఫల్యం తర్వాత రంగారావు జంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగం లో చేరారు. ఇదే సమయంలో ఆయన మేనమామ బడేటి వెంకట రామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబరు 27న వివాహం చేసుకున్నారు. .

వ్యక్తిగా రంగారావు చమత్కారి, సహృదయుడు. సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవారు కాదు.

ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. యస్వీఆర్ ఒక వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చాక మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ , ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం , దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాలు ఘనంగా సన్మానించారు. అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు.

విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ, నటశేఖర తదితర బిరుదులు పొందారు. రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.

రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు.

రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఈయన నటనను అభినందించారు. జులై 3, 2018న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
1974 జూలై 18వ తేదీన మద్రాసులో కన్ను మూశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...

మొన్నటి వరకూ కేంద్రాన్ని దునుమాడి.. ఇప్పుడు నోరెత్తని సీఎం

– కార్మికపక్షంపై నిరంకుశత్వం– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ...