దిశ కేసులో ఆధారాలు లేవు..
కోర్టులో నిందితులకు శిక్షపడే అవకాశం తక్కువ
న్యాయనిపుణుల అభిప్రాయం

హైదరాబాద్,lll దిశ హత్యాచార కేసులో నిందితులను అసలు ఎందుకు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న విషయంలో మరో కోణం బయటికొచ్చింది. ఎన్‌కౌంటర్ జరక్కపోతే శిక్ష పడడం అనుమానమేనన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, సంఘటనలో బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇది కోర్టులో నిలబడడం కష్టంగా మారనుంది. నిందితులే నేరం చేశారనేందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఏవీ లేవు. దిశ శరీరం పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్షతో సరిపోల్చడం కూడా సాధ్యం కాదు. తామే నేరం చేశామన్న నిందితుల వాంగ్మూలానికి చట్టం ముందు విలువుండదు.

పోలీసులు చంపుతామని బెదిరించడంతో తామలా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెబుతారు నిందితులు. ఈ నేపథ్యంలో ఈకేసును అన్ని ఆధారాలతో రుజువు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిందితుల వాంగ్మూలం కోర్టులో చెల్లదు
సరైన సాక్ష్యాధారాలు లేకుండా పోలీసుల ముందు నిందితు లు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా శిక్ష పడే అవకాశం లేదు.

అత్యాచారం జరిగినట్లు రుజువు చేయాలంటే ముందు నిందితులకు వైద్యపరీక్షలు చేయాలి. వారి దుస్తులు సేకరించాలి.
వాటిపై వీర్యం, రక్తం మరకలు ఫోరెన్సిక్ లేబోరేటరీకి పంపి నిర్థారించాలి. పోలీసులు ఇక్కడ ఆ ఆధారాలు సేకరించినట్లు కన్పించడంలేదు. ఈ కేసులో ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి.
