5.1 C
New York
Wednesday, March 29, 2023
Homespecial Editionఅభినవ కవితా యుగ సంస్థాపకులు రాయప్రోలు

అభినవ కవితా యుగ సంస్థాపకులు రాయప్రోలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”…అంటూ “జన్మభూమి” గీతాన్ని రచించి.. తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 – జూన్ 30, 1984) తెలుగులో భావ కవిత్వానికి ఆద్యులు. ఈయన 1913లో వ్రాసిన తృణ కంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు.
జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు. “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకు పోయేలా ఆయన సృజన చేశారు. ఒక కొత్త మార్గాన్ని పలుకుబడిని, భాషను దర్శనాన్ని ఇచ్చి నూతన యుగానికి సంస్థాపకుడుగా వెలసిన వారు రాయప్రోలు సుబ్బారావు. అభినవ కవితాయుగానికి ఆయన సంస్థాపకులు. నన్నయ్య తర్వాత తెలుగు కవిత్వ భాష ఆమూలంగా పరివర్తనం పొందింది రాయప్రోలు వల్లనే. ఆయన తెలుగు సంస్కృత భాషలే కాకుండా. రవీంద్రుని ప్రభావంతో భారతీయ జాతీయతా భావాలను కొత్త ఒరవడిలో తెలుగు కవితలో ప్రవేశపెట్టారు. రాయప్రోలు పరిపక్వమతులు, పాశ్చాత్య సాహిత్య విశారదులు, నవ్య కవితోపాసకులు. పాశ్చాత్య కవుల ప్రకృతి ఆరాధనా విధానాన్ని ఆకళింపు చేసుకున్న తెలుగు కవి. పాశ్చాత్య దేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో సుసంపన్నం చేశారు. భావ కవిత్వోద్యమానికి నాయకత్వం వహించి, తృణకంకణం, స్నేహలత, ఆంద్రావళి, జడ కుచ్చులు లాంటి రచనలు చేసిన ఆయనకు ‘కోకిలస్వామి’ అనే బిరుదు ఉంది. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించారు.

రాయప్రోలుది కేవలం అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన వీడలేదు. సమకాలీన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దారు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. అంతేకాదు. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. అయన వ్రాసిన గీతాలలో అందరినోళ్లలోనూ బాగా నానిన జన్మభూమి” గీతంలో తెలుగుదనం, జాతీయాభిమానం, గత వైభవ సంకీర్తనం, ప్రబోధం లాంటివి తొణికిసలాడుతాయి. ఇప్పటికీ ఈ గీతం ఉత్తమ దేశభక్తి ప్రబోధంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. “అవమానమేలరా! అనుమానమేలరా! భారతీయుడ నంచు భక్తితో పాడ…లేరురా మనవంటి వీరులింకెందు…
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున ఏ మంచి పూవులన్ ప్రేమించినావో నిను మోచె ఈ తల్లి కనక గర్భమున…లేదురా ఇటువంటి భూదేవి యెందూ లేరురా మనవంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడలా ఝండాలు ఆడునందాక…అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాల గీతములు పాడరా నీ వీర భావ భారతము”. ఇంతకంటే గొప్ప దేశభక్తి పూరిత కవిత్వం ఇంకేముంటుంది.

1918లో ఉస్మానియా విశ్వ విద్యాలయం స్థాపించ బడి, తెలుగు శాఖ ఏర్పడటం జరిగాక, .. ఆయన ఉస్మానియా తెలుగు శాఖకు తొలి ఆచార్యుడిగా నియమింప బడ్డారు. ఆనాడు తెలుగు శాఖలో చదువుకున్న విద్యార్థుల్లో పల్లా దుర్గయ్య, అనుముల కృష్ణమూర్తి, ఠంయాల రంగాచార్యులు, అలాగే జువ్వాడి గౌతమరావు లాంటి వారు ఎందరో ఉన్నారు. 1958 ప్రాంతాల్లో జువ్వాడి గౌతమరావు జయంతి పత్రిక నడిపేవారు. దాన్లో సాహిత్యధార అనే శీర్షికను నిర్వహించేవారు. రాయప్రోలు అందులో రచనలు చేసేవారు. కాళిదాస మేము సందేశాన్ని దూత మేఘము అన్న పేరుతో యతి ప్రాసలు లేకుండా రాయప్రోలు వారు రచించగా, పలువురి విమర్శలకు గురైనారు.

ఆయన ఒక పక్క కవిత్వంలో తెలుగు ప్రజల వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశ మేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడు తూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రచించారన్న పేరు మూట కట్టుకున్నారు. రవీంద్రుని శిష్యుడైన రాయప్రోలు సుబ్బారావు నిజాం ప్రభువునకు అనుకూలంగా ప్రవర్తించడం.. ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం నాటి జాతీయోద్యమ నాయకులకు నచ్చలేదు.

“కోకిల స్వామి” బిరుదాంకితుడు అయిన రాయప్రోలు గురించి, కాళోజీ నారాయణరావు నా గొడవలో …’ఓ కోయిలా.. ఏ మావి చివురులు తిని ఎవరిని పాడుతున్నావు?’ రాయప్రోలును ఉద్దేశించి ఒక గేయం రాశారు.
కట్టమంచి రామలింగారెడ్డి ఆయనను స్తుతించారు. రాయప్రోలు కవిత్వాన్ని జాతీయ భావ ప్రేరకంగా దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి కవిత్వ ప్రేమికులు భావించి 1913 నాటి బాపట్ల ఆంధ్ర మహాసభల్లో వాటిని గానం చేయడం విశేషం.

రాయప్రోలువారి సప్తతి సందర్భంలో విజయవాడలో జరిగిన సభలో…తాను రాయప్రోలు వల్ల ప్రేరణ పొందినట్లు తొలి రచనలు చేసినట్లు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేర్కొనడం గమనార్హం.రాయప్రోలు జూన్ 30, 1984న మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments