ఆర్. వెంకట్ రామన్ గా చిర పరిచితులయిన రామస్వామి వెంకట్రామన్, తమిళ నాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, న్యాయవాది, భారత మాజీ రాష్ట్రపతి (1987 నుండి 1992) 1910 డిసెంబర్ 4న తమిళనాడు లోని తంజావూరు సమీపంలోని పట్టుకొట్టైలో జన్మించారు. మద్రాసు విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి 1935లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. వెంకట్రామన్ 1950లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా తాత్కాలిక పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
వెంకట్రామన్ 1952 నుండి 1957 వరకు మరియు 1977 నుండి లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. 1957 నుండి 1967 వరకు తమిళనాడు రాష్ట్రానికి పారిశ్రామిక, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వెంకట్రామన్ కేంద్ర ప్రభుత్వంలో చేరి ఆర్థిక, పరిశ్రమల శాఖ (1980–82) మరియు రక్షణ శాఖ మంత్రిగా (1982–84) పనిచేశారు. అయన ఆర్థిక మంత్రిగా పని చేస్తూ, 1980-81, 1981-82 ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1984-87 లో భారత ఉప రాష్ట్రపతిగా పనిచేసిన తరువాత, 1987 జూలైలో రాష్ట్రపతి పదవికి ఎన్నిక కాబడ్డారు. జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకు దేశ ప్రథమ పౌరునిగా ఉన్నారు. 1987 – 92 మధ్య రాష్ట్రపతిగా పని చేసిన ఆర్ వెంకట్రామన్ హయాంలోనే సంకీర్ణ ప్రభుత్వాల పాలన మొదలైంది. రాజీవ్‌గాంధీ 1989 ఎన్నికల్లో పరాజయం పాలు కాగా వి.పి.సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన ప్రభుత్వం పతనం కావడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం. ఆ ప్రభుత్వం కూడా పడిపోవడంతో 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పి.వి. నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఈ అత్యున్నత రాజ్యాంగ పదవిని అందుకుని తమ తమ ముద్రలు వేశారు. తమిళనాడు నుంచి ఏకంగా ముగ్గురు (సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, అబ్దుల్ కలాం) ఎన్నికయ్యారు. కేరళ నుండి కే. ఆర్.నారాయణన్ తొలి దళిత రాష్ట్రపతికి రాష్ట్రపతి భవన్ లో అడుగు పెట్టారు. కాగా ఉమ్మడి అంధ్రప్రదేశ్ నుండి నీలం సంజీవరెడ్డి రెండు సార్లు దేశ అత్యున్నత పదవికి పోటీ చేసి ఒక్కసారి విజయం సాధించారు.
వెంకట రామన్ రచనల్లో ప్రసిద్ధి చెందినది “మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్”. వెంకట రామన్ 98 సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అవయవాల వైఫల్యం కారణంగా 2009 జనవరి 27న న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ లో మరణించారు.