స్వామి వివేకానంద గురువు అయిన స్వామి రామకృష్ణ పరమహంస,(గదాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 – ఆగష్టు 16, 1886) విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటి సారిగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు.
భారతీయ జాతీయతపై రామకృష్ణ పరమహంస ప్రభావం అలేఖ్యం. హిందూ మతం లోని మూఢ నమ్మకాలు అధిక సంప్రాదాయాలను కొంతవరకు తొలగించి, హిందూ మతాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాల సవాళ్లకు ధీటుగా నిలబెట్టిన మహనీయుడు రామకృష్ణుడు.
అన్ని మతాల సారాన్ని ఆమూలాగ్రంగా ఆస్వాదించడం లక్ష్యంగా అవిరళ కృషి చేసి, సిద్ది పొందిన తాపసి ఆయన. అన్ని మతాలు భగవం తుని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవ రీత్యా మొదటి సారి ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక గురువు. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో కామార్పుకూర్ గ్రామంలో ధార్మిక పేద బ్రాహ్మణులైన క్షుదీరాం, చంద్రమణీ దేవికి జన్మించారు. బాల్యం నుండీ ప్రకృతి ఆరాధకునిగా, సాధు సజ్జన ప్రసంగాలలో ఆసక్తి కనబరుస్తూ, వారికి సేవలందించే వారు. బయట ప్రపంచంతో సంబంధాలను పక్కనపెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేవారు. ఉపనయనం కాగానే మొదటి భిక్ష ఒక శూద్ర యువతి వద్ద పొందుతానని మాటిచ్చి, పట్టుబట్టి, ఎందరు చెప్పినా వినక, యువతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, సాంప్రదాయ మార్పుకు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్ళ శారదా దేవితో ఆయన పెళ్ళి కాగా, శారద… రామకృష్ణుని మొదటి శిష్యురాలుగా మారింది. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలు పెట్టారు. ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు. శారదా రామకృష్ణుల సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు.
తండ్రి మరణానంతరం పెద్దన్న రాంకుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, పౌరోహిత్యం చేస్తున్న క్రమంలో, రాణి రాషమొణి అనే యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించగా, రాంకుమార్ పూజారిగా, రామకృష్ణుడు దేవతను అలంకరించే వారు. రాంకుమార్ మరణించాక, ఆయనే పూజారిగా మారారు. గుడిలో ఉన్నది. రాతి విగ్రహమా? లేక సజీవమా తెలుసుకునేందుకు రేయిం బవళ్ళు చేసిన కఠోర ప్రార్ధన ద్వారా అమ్మవారి దర్శన భాగ్యం ఆయనకు కలిగింది. మనిషికి చేసేలాగే విగ్రహానికి సేవలు చేసేవారు. స్వామి రామకృష్ణ పరమహంస తన తంత్ర సాధనలో భాగంగా వివిధ గురువుల మార్గదర్శకత్వం క్రింద వైష్ణవ భక్తి గురించి, అద్వైత వేదాంతం గురించి తెలుసుకున్నారు. అన్ని మతాల పరమ సత్యాన్ని గ్రహించారనే ప్రచారంతో అన్ని మతాల వారూ ఆయన దర్శనానికి వచ్చేవారు. అనేకమంది విదేశీయులు ఆధ్యాత్మికతకు ప్రభావితమై, రామకృష్ణుని అనుసరించారు కూడా. తోతాపురి అనే సాధువు అద్వైతాన్ని బోధించారు. భైరవీ బ్రాహ్మణి అనే ఆమె ఆయనకు భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. తద్వారా మూడు రోజులలోనే నిర్వికల్ప సమాధిని పొందిన మహనీయుడు. జ్ఞానాన్ని సంపాదించడానికి, మానవ ఉనికికి సంబంధించిన అంశాల గురించి తెలుసు కోవాలని పరితపించారు. క్రమంగా ఆయన తన జీవితానికి గల పరమార్ధాన్ని అర్ధం చేసుకున్నారు.
తాను ఏమి కోరుకుంటున్నాడో ఆ దిశగా అడుగులు వేసి చివరికి ఫలితం సాధించారు. బెంగాలీ గ్రామీణ కుటుంబంలో జన్మించిన రామకృష్ణ , తర్వాతి కాలంలో భగవత్, ఆత్మసాక్షాత్కారం పొంది, తర్వాత ఇస్లాం క్రైస్తవ మార్గాల సాధన ద్వారా ఫలితం పొందారు. స్వామి వివేకానంద నిజంగా భగవదనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ… ఎందరినో కలిసి నిరాశకు లోనై, చివరికి రామకృష్ణులను కలిశారు. “మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?” అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందారు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించారు. అలా వివేకానంద ఆయన శిష్యులుగా మారారు. రామకృష్ణుడు తన ప్రత్యక్ష శిష్యులకు సన్యాసము ఇవ్వడము ద్వారా రామకృష్ణ మిషన్ ను స్వయముగా ప్రారంభించగా, స్వామీ వివేకానంద రామకృష్ణుని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింప చేశారు. తాము చని పోయే ముందు తమ ఆధ్యాత్మిక శక్తులన్నీ వివేకానందునికి ధారవోసి, 1886 ఆగస్టు 16న మహా సమాధిని పొందారు. స్వార్థం నుండి విడివడితే భగవంతుడిని పొంద వచ్చునని నిరూపించి చూపారు.