పురాణ శ్రవణం ముక్తి దాయకమని, శ్రద్ధతో పురాణ శ్రవణం గావించడం పురాకృత సుకృతమని కలియుగంలో ముక్తిని, తద్వారా జన్మరాహి త్యాన్ని పొందగల దివ్య సాధనం పురాణ కాలక్షేపమని లబ్దప్రతిష్టులైన రచయిత్రి, పౌరాణికులు, విదుషీమణి కొరిడె (తాడూరి) రమాదేవి ఉద్ఘాటించారు.
రామ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్షేత్రంలో గోదావరీ తీరాన వెలసిన రామాలయంలో, విశ్రాంత ట్రెజరీ అధికారి ఇందవరపు లక్ష్మీ కాంత శర్మ, గుండమ్మ సౌజన్యంతో దేవాలయ వంశ పారంపర్య నిర్వాహకులు అర్చకులు తాడూరి రఘునాథ్ శర్మ ఆద్వర్యంలో శ్రీరామ నవమి వరకు నిర్వహిస్తున్న శ్రీ మద్రామాయణ పురాణ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా మూడవ రోజైన శుక్రవారం రమాదేవి పురాణ ప్రవచనం గావిస్తూ, రామాయణ మహాత్మ్యాన్ని, తదంతర్భాగ విషయాలను కూలంకషంగా వ్యాఖ్యానం గావించారు. రమాదేవి స్వీయ విరచిత “శ్రీ రామ చరితాంబుది” గ్రంథస్త రామాయణ అంతర్గత బాలకాండ సంబంధిత విషయాలను సంతానార్థియైన దశరథుడు ఋష్యశృంగ మహర్షి వద్దకు వెళ్ళిన, పుత్ర కామేష్టి యాగ ఆచరణ, రామ జన్మ గురించి సోదాహరణంగా వివరించారు.
కార్యక్రమంలో నిర్వహణ బాధ్యులు తాడూరి బాల కిష్టయ్య, బలరాం, బాల చందర్, రఘునాథ్, ఆశ్విత్, కోరిడే శంకర్, మాజీ ప్రాచార్యు లు డాక్టర్ సంగన భట్ల నరసయ్య, గుండయ్య, సామాజిక సేవకులు జక్కు రవీందర్, కాసర్ల వెంకట రమణ, మహిళా మండలి సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు భాగస్వాము లైనారు.
